Third Railway line: గ్రాండ్ ట్రంక్ మార్గంలో మూడో రైలు లైన్ నిర్మాణం
Third Railway line: విజయవాడ - గూడూరు మార్గంలో మూడో రైల్వేలైన్ నిర్మాణంతో పాటు , విద్యుద్దీకరణ ప్రాజెక్టులో భాగంగా మనుబోలు, నెల్లూరు రైల్వే స్టేషన్ల మధ్య మూడవ లైన్ విద్యుదీకరణ పూర్తి చేశారు. కొత్తగా నిర్మించిన రైలు మార్గంలో రైళ్ల రాకపోకలను ప్రారంభించారు.
Third Railway line: విజయవాడ - గూడూరు మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణం, విద్యుద్దీకరణ ప్రాజెక్టులో భాగంగా కొత్త సెక్షన్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో మౌలిక సదుపాయాల పనులకు పెద్ద పీట వేయడంతో పాటు విద్యుదీకరణ పనులు చేపట్టారు. దీంతో పాటు డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ కొత్త లైన్ నిర్మాణ పనులను చేపట్టారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో మౌలిక సదుపాయాల పనులకు పెద్ద పీట వేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. విద్యుదీకరణతో పాటు డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారు. గ్రాండ్ ట్రంక్ వంటి మార్గంలో రద్దీని తగ్గించడంలోకొత్త లైన్ నిర్మాణం సాయపడుతుందని చెబుతున్నారు. రైల్వే కార్యకలాపాలను సైతం సులభతరం చేస్తుంది.
విజయవాడ - గూడూరు ట్రిప్లింగ్ & విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా విద్యుదీకరణతో పాటు మనుబోలు - నెల్లూరు సెక్షన్ మధ్య 29.3 కి.మీ.ల మేర మూడవ లైన్ పనులు పూర్తయ్యాయి. ఈ రైలు మార్గం ఆంధ్ర ప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా పరిధిలోకి వస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంతం వెంబడి ఉన్న గ్రాండ్ ట్రంక్ మార్గంలో ఉన్న రైలు మార్గం, దక్షిణ మధ్య రైల్వే లో విజయవాడ - గూడూరు మధ్య సెక్షన్ పరిధిలో ఉంది. దేశంలోని ఉత్తర మరియు తూర్పు ప్రాంతాలను దక్షిణాది రాష్ట్రాలతో అనుసంధానించడంలో గ్రాండ్ ట్రంక్ మార్గం కీలక పాత్ర పోషిస్తుంది.
ప్యాసింజర్ రవాణాతో పాటు సరకు రవాణా రైళ్లలో స్థిరమైన పెరుగుదలతో ఈ మార్గం అత్యంత రద్దీగా మారిందని అధికారులు చెబుతున్నారు. కీలకమైన సెక్షన్‌లో రద్దీని తగ్గించడానికి, విజయవాడ - గూడూరు మూడవ లైన్ ప్రాజెక్ట్ 2015-16 సంవత్సరంలో 288 కి.మీల దూరానికి సుమారు రూ.3246 కోట్ల నిధులతో మంజూరు చేశారు. ఈ పనులను చేపట్టేందుకు ఆర్ వి ఎన్ ఎల్ సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు.
ప్రాజెక్ట్ లోని అన్ని సెక్షన్ లలో పనులు ఏకకాలంలో చేపట్టారని, ఇప్పటి వరకు ఉలవపాడు-కావలి మధ్య 29 కిలోమీటర్ల దూరం, తలమంచి-బిట్రగుంట-శ్రీవేంకటేశ్వరపాలెం మధ్య 24.8కిలోమీటర్లు, శ్రీవేంకటేశ్వరపాలెం-కావలి మధ్య 12.2 కిలోమీటర్లు, తలమంచి-నెల్లూరు మధ్య 17కిలోమీటర్లు, కరవడి - చిన గంజాం మధ్య 23.5 కి.మీ.లు మేర పనులు పూర్తిఅయినాయి . తాజాగా మనుబోలు - నెల్లూరు మధ్య 29.3 కిలోమీటర్లు పూర్తి చేయడంతో విజయవాడ-గూడూరు సెక్షన్‌లో మొత్తం 135.8 కిలోమీటర్ల మూడవ లైన్ విద్యుదీకరణతో సహా పూర్తైనట్టైందని చెబుతున్నారు.
మనుబోలు-నెల్లూరు సెక్షన్ మధ్య ట్రిప్లింగ్ మరియు విద్యుద్దీకరణ పనులను పూర్తి చేసిన విజయవాడ డివిజన్ రైల్వే అధికారులతో పాటు ఆర్ వి ఎన్ ఎల్ సంస్థను జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అభినందించారు. విజయవాడ - గూడూరు మధ్య మూడో లైన్ పనులను అత్యధిక ప్రాధాన్యత క్రమమున చేపడుతున్నామని, అన్ని సెక్షన్ లలో పనులు ఏకకాలంలో వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ట్రిప్లింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరికొన్ని విభాగాలను ప్రారంభించడానికి జోన్ తగిన ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.