SCR Special Trains : ప్రయాణికులకు గుడ్‌న్యూస్ - విజయవాడ మీదుగా 4 స్పెషల్ వీక్లీ రైళ్లు
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. విజయవాడ మీదుగా నాలుగు స్పెషల్ వీక్లీ రైళ్లను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. మరోవైపు ఆరు నెలల పాటు వందేభారత్ రైలుకు ఏలూరులో స్టాపేజ్ కొనసాగనుంది.

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. నాలుగు స్పెషల్ వీక్లీ రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రయాణికులు రద్దీని తగ్గించేందుకు విజయవాడ మీదుగా చర్లపల్లి-కాకినాడ టౌన్, చర్లపల్లి-నర్సాపూర్ మధ్య రెండు స్పెషల్ వీక్లీ రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
స్పెషల్ రైళ్ల వివరాలు:
1. చర్లపల్లి- కాకినాడ (07031) స్పెషల్ వీక్లీ రైలు ఈనెల 14, 21 తేదీల్లో అందుబాటు ఉంటుంది. ఈ రైలు ఆయా తేదీల్లో రాత్రి 7.20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.
2. కాకినాడ టౌన్- చర్లపల్లి (07032) స్పెషల్ వీక్లీ రైలు ఈనెల 16, 23 తేదీల్లో అందుబాటు ఉంటుంది. ఈ రైలు ఆయా తేదీల్లో సాయంత్రం 6.55 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
ఈ రెండు రైళ్లు చర్లపల్లి -కాకినాడ టౌన్ మధ్య నల్లొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలలో ఆగుతాయి.
3. చర్లపల్లి-నర్సాపూర్ (07233) స్పెషల్ వీక్లీ రైలు ఈనెల 14, 21 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఆయా తేదీల్లో రాత్రి 7.15 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు నర్సాపూర్‌కి చేరుకుంటుంది.
4. నర్సాపూర్-చర్లపల్లి (07234) స్పెషల్ వీక్లీ రైలు ఈనెల 16, 23 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఆయా తేదీల్లో రాత్రి 8 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి…. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
ఈ రెండు రైళ్లు చర్లపల్లి-నర్సాపూర్ మధ్య నల్లొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు స్టేషన్లల్లో ఆగుతాయి.
వందేభారత్ రైలుకు ఏలూరులో స్టాపేజ్:
సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల (రైలు నంబర్ 20707/20708) కోసం ఏలూరు స్టేషన్‌లో ప్రయోగాత్మక స్టాపేజ్ ను పొడిగించారు. ఫిబ్రవరి 25 నుంచి మరో ఆరు నెలల పాటు కొనసాగుతుందని రైల్వే శాఖ ప్రకటించింది.
సికింద్రాబాద్ - విశాఖపట్నం (20707) ఏలూరులో ఉదయం 9:49 గంటలకు ఆగుతుంది. ఉదయం 9.50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరుతుంది. విశాఖపట్నం - సికింద్రాబాద్ (20708) సాయంత్రం 5:44 గంటలకు ఏలూరు చేరుకుంటుంది. అక్కడి నుంచి సాయంత్రం 5:45 గంటలకు బయలుదేరుతుంది.
ఈ పొడిగింపుతో ఏలూరు నుండి ఎక్కే ప్రయాణికులు సికింద్రాబాద్, విశాఖపట్నం రెండింటికీ హై-స్పీడ్ కనెక్టివిటీ నుండి ప్రయోజనం పొందడం కొనసాగించినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.
రైళ్ల షార్ట్-టర్మినేషన్:
కెకె లైన్‌లోని జగదల్‌పూర్-కిరండూల్ సెక్షన్‌పై డబ్లింగ్‌కు సంబంధించి రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. బచేలి-కిరండూల్ స్టేషన్ యార్డుల పునర్నిర్మాణం కోసం ప్రీ-నాన్-ఇంటర్‌లాక్ పనులు, నాన్-ఇంటర్‌లాక్ పనుల కారణంగా రైళ్లను దంతేవాడ వద్ద షార్ట్ టెర్మినేటెడ్ చేస్తున్నట్లు తెలిపింది.
విశాఖపట్నం నుంచి బయలుదేరే విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ రైలు(ట్రైన్ నంబర్ 58501) ఫిబ్రవరి 15 నుంచి మార్చి 6 వరకు దంతేవాడ వద్ద షార్ట్ టెర్మినేటెడ్ చేయబడుతుంది. కిరండూల్ నుంచి బయలుదేరే కిరండూల్-విశాఖపట్నం ప్యాసింజర్ రైలు(రైలు నంబర్ 58502) కిరండూల్‌కు బదులుగా దంతేవాడ నుంచి ఫిబ్రవరి 14 నుండి మార్చి 7 వరకు బయలుదేరుతుంది.
విశాఖపట్నం నుంచి బయలుదేరే… విశాఖపట్నం-కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫిబ్రవరి 15 నుండి మార్చి 6 వరకు దంతేవాడ వద్ద షార్ట్ టెర్మినేటెడ్ చేయబడుతుంది. కిరండూల్ నుంచి బయలుదేరే కిరండూల్-విశాఖపట్నం నైట్ ఎక్స్‌ప్రెస్ రైలు… కిరండూల్‌కు బదులుగా దంతేవాడ నుంచి బయల్దేరుతుంది. ఫిబ్రవరి 14 నుండి మార్చి 7 వరకు రాకపోకలు ఉంటాయి.
రిపోర్టింగ్: జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం