South Central Railway : కరీంనగర్ టు హైదరాబాద్.. వయా మానేరు.. ఈ రైల్వే బ్రిడ్జ్ చాలా స్పెషల్ గురూ!-south central railway to build huge bridge over maneru river in karimnagar district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  South Central Railway : కరీంనగర్ టు హైదరాబాద్.. వయా మానేరు.. ఈ రైల్వే బ్రిడ్జ్ చాలా స్పెషల్ గురూ!

South Central Railway : కరీంనగర్ టు హైదరాబాద్.. వయా మానేరు.. ఈ రైల్వే బ్రిడ్జ్ చాలా స్పెషల్ గురూ!

Basani Shiva Kumar HT Telugu
Jan 31, 2025 04:07 PM IST

South Central Railway : తెలంగాణలో కనెక్టివిటీని పెంచడానికి సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రాజెక్టులను చేపడుతోంది. దీంట్లో భాగంగానే మానేరు నదిపై బ్రిడ్జ్‌ను నిర్మించనున్నారు. విజయవాడ వద్ద కృష్ణా నదిపై నిర్మించినట్టు.. దీన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇది పూర్తయితే కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు రావడం చాలా ఈజీ.

రైల్వే బ్రిడ్జ్
రైల్వే బ్రిడ్జ్ (istockphoto)

కరీంనగర్‌‌ను సిద్దిపేట మీదుగా హైదరాబాద్‌తో నేరుగా అనుసంధానించనున్నారు. అందుకోసం మనోహరాబాద్‌– కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టును ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. వీటిల్లో భాగంగా.. సిరిసిల్ల సమీపంలో మానేరు నదిపై 2.4 కిలో మీటర్ల పొడవుతో భారీ రైలు వంతెన నిర్మించనున్నారు. దీనికి రూ.332 కోట్లు ఖర్చు కానుందని తెలుస్తోంది.

yearly horoscope entry point

ఇనుప గడ్డర్లతో..

ఈ వంతెన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం గోదావరి నదిపై పెద్దపెద్ద వంతెనలు ఉన్నాయి. ఇప్పుడు మానేరుపై నిర్మించే ఈ వంతెన వాటి సరసన చేరనుంది. విజయవాడలో కృష్ణా నదిపై నిర్మించిన రైలు వంతెన తరహాలో.. ఇనుప గర్డర్లతో దీన్ని నిర్మించబోతున్నారు. రైళ్లు వేగంగా వెళ్లినప్పుడు ఏర్పడే కంపన ప్రభావం పిల్లర్లపై చూపకుండా ఇనుప గర్డర్లు అడ్డుకుంటాయి. దీంతో అధికారులు ఈ డిజైన్‌కే మొగ్గు చూపారని తెలుస్తోంది.

సిరిసిల్లలో రైల్వే స్టేషన్..

మనోహరాబాద్‌– కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా.. సిద్దిపేట వరకు రైలు సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సిద్దిపేట– సిరిసిల్ల మధ్య పనులు జరుగుతున్నాయి. రైలు సిరిసిల్లకు చేరుకోవాలంటే మానేరు నదిని దాటాలి. సిరిసిల్ల శివారులోనే రైల్వే స్టేషన్‌‌ను నిర్మిస్తున్నారు. అక్కడికి చేరుకునే మార్గానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే మిడ్‌ మానేరు ఉంది. అక్కడ బ్యాక్‌ వాటర్‌ ప్రభావం ఎక్కువ.

భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా..

అన్ని పరిస్థితులను పరిశీలించిన అధికారులు.. గతంలో గరిష్ట నీటిమట్టాన్ని పరిగణనలోకి తీసుకుని.. అంతకంటే ఎక్కువ చేరినా రైలు మార్గానికి ఇబ్బంది కాని రీతిలో వంతెనకు డిజైన్‌ చేశారు. నదీ తీరంలో ఉన్న గోపాలరావు పల్లి వద్ద వంతెన నిర్మాణం ప్రారంభమై.. సిరిసిల్ల వైపు అనుపురం గ్రామ పరిధిలో ల్యాండ్‌ అవుతుంది. ప్రయాణికుల రైళ్లు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లినా ఇబ్బంది కాకుండా ఈ వంతెనను నిర్మించనున్నారు.

టెండర్లు పిలిచిన రైల్వే..

ఈ వంతెన పనులను వెంటనే ప్రారంభించేలా సౌత్ సెంట్రల్ రైల్వే టెండర్లు పిలిచింది. గతంలో ఈ సెక్షన్‌ మధ్యలో భూ పరిహారం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో డిపాజిట్‌ చేయలేదు. దీంతో జాప్యం జరిగింది. ఇటీవల ఆ మొత్తం చెల్లించటంతో పనులు జరుగుతున్నాయి. సిరిసిల్ల వైపు లైన్‌ నిర్మాణం పూర్తయ్యేనాటికి.. వంతెన సిద్ధమయ్యేలా అధికారులు ప్లాన్‌ చేస్తున్నారు.

Whats_app_banner