Railway Squad Earnings: కోట్లు కురిపిస్తున్న టిక్కెట్టు లేని ప్రయాణాలు..-south central railway commercial staff earned highest revenues with ticketless travelers
Telugu News  /  Andhra Pradesh  /  South Central Railway Commercial Staff Earned Highest Revenues With Ticketless Travelers
రైల్వే సిబ్బందిని అభినందిస్తున్న రైల్వే జిఎం అరుణ్‌ కుమార్ జైన్
రైల్వే సిబ్బందిని అభినందిస్తున్న రైల్వే జిఎం అరుణ్‌ కుమార్ జైన్

Railway Squad Earnings: కోట్లు కురిపిస్తున్న టిక్కెట్టు లేని ప్రయాణాలు..

22 March 2023, 13:00 ISTHT Telugu Desk
22 March 2023, 13:00 IST

Railway Squad Earnings: టిక్కెట్టు లేని ప్రయాణాలు రైల్వేకు కోట్లు కురిపిస్తున్నాయి. రైళ్లలో టిక్కెట్టు లేకుండా ప్రయాణించే వారికి భారీగా జరిమానాలు విధిస్తుండటంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కోట్లాది రుపాయల ఆదాయం సమకూరుతోంది. విజయవాడ డివిజన్‌లో ఓ అధికారి ఏకంగా కోటి రుపాయల జరిమానాలు వసూలు చేశారు.

Railway Squad Earnings: రైళ్లలో టిక్కెట్లు లేకుండా జర్నీ చేసే వారి సంఖ్య తక్కువేమి కాదు. దక్షిణాది రాష్ట్రాల్లో కాస్త తక్కువే కాని ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే టిక్కెట్ కొని ప్రయాణించడాన్ని నేరంగా చూసే రాష్ట్రాలు కూడా ఉన్నాయి. వాటి సంగతెలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం టిక్కెట్లు లేని రైలు ప్రయాణికుల నుంచి కోట్లాది రుపాయలు జరిమానాలు వసూలు చేశారు. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో కొంతమంది సిబ్బంది కోట్లలో జరిమానాలు కూడా వసూలు చేశారు.

విజయవాడ రైల్వే డివిజన్‌‌కు చెందిన ఎంజె.మాథ్యూ అనే చీఫ్‌ టిక్కెట్ ఇన్‌స్పెక్టర్ గుడివాడ స్క్వాడ్‌లో పనిచేస్తున్నారు. ఏడాది కాలంలో ఈయన అక్షరాలా కోటి రెండు లక్షల రుపాయల జరిమానాలు వసూలు చేశారు. టిక్కెట్లు లేకుండా ప్రయాణించే వారిని గుర్తించి వారికి జరిమానాలు విధించడంతో పాటు, నిర్ణీత పరిణామం కంటే ఎక్కువగా లగేజీ తీసుకెళ్తున్న వారిని గుర్తించి ఈ జరిమానాలు విధించారు.

ఎంజె.మాథ్యూ మొత్తం 12,707 కేసులు నమోదు చేశారు. అనధికారిక ప్రయాణికులతో పాటు రైలు ప్రయాణ ఉల్లంఘనలపై ఈ కేసులు నమోదు చేశారు. రైలు ప్రయాణ నిబంధనల్ని ఉల్లంఘించిన వారిపై కొరడా జుళిపించడం ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని తెచ్చి పెట్టారు. వీటిలో 5810 కేసులు టిక్కెట్టు లేకుండా ప్రయాణిస్తున్న వారిపై నమోదు చేశారు. వారి నుంచి రూ.61.02లక్షల జరిమానాలు వసూలు చేశారు. దీంతో పాటు అనధికారిక ప్రయాణాలపై 6900 కేసులు నమోదు చేశారు. వీటి ద్వారా రూ.41.33లక్షల జరిమానాలు వసూలు చేశారు.

35ఏళ్ల కెరీర్‌లో మాథ్యూ జిఎం అవార్డుతో పాటు డిఆర్ఎం అవార్డు, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌ అవార్డులు పొందారు. అత్యధిక కేసులు నమోదు చేసిన అధికారికి జిఎం నుంచి అభినందనలు దక్కాయి.

మరోవైపు సికింద్రబాద్‌ రైల్వే డివిజన్‌లో కూడా మరో ఏడుగురు అధికారులు కోటికి పైగా జరిమానాలు వసూలు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం తొమ్మిది మంది రైల్వే తనిఖీ సిబ్బంది ఏకంగా రూ.9.62 కోట్లు వసూలు చేశారు. సగటున ఒక్కొక్కరూ రూ.కోటిని మించి వసూలు చేశారన్నమాట.

టికెట్‌ లేకుండా ప్రయాణించేవారు, ముందస్తు బుకింగ్‌ లేకుండా సామగ్రి తరలించేవారిని గుర్తించి అపరాధ రుసుము వసూలు చేయటంలో తొమ్మిది మంది టికెట్‌ తనిఖీ సిబ్బంది చురుగ్గా వ్యవహరించి పెద్దమొత్తంలో పెనాల్టీ వసూలు చేశారు.

ఒక్కో అధికారి రూ.కోటికిపైగా పెనాల్టీ వసూలు చేయటం రైల్వే చరిత్రలోనే తొలిసారి కావటం విశేషమని రైల్వే అధికారులు చెబుతున్నారు. సికింద్రాబాద్‌ డివిజన్‌ నుంచి ఏడుగురు, గుంతకల్, విజయవాడ డివిజన్ల నుంచి ఒక్కొక్కరి చొప్పున ఈ ఘనత సాధించారు. సికింద్రాబాద్‌ డివిజన్‌కు చెందిన చీఫ్‌ టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌ నటరాజన్‌ 12,689 మంది ప్రయాణికుల నుంచి ఏకంగా రూ.1.16 కోట్లు వసూలు చేశారు. వీరిని దక్షిణ మధ్య రైల్వే జిఎం అరుణ్‌ కుమార్‌ జైన్ విజయవాడలో ప్రత్యేకంగా అభినందించారు.

టాపిక్