Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. 6 రైళ్లు రద్దు.. 10 దారి మళ్లింపు-south central railway authorities have canceled 6 trains and diverted 10 trains due to heavy rains ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. 6 రైళ్లు రద్దు.. 10 దారి మళ్లింపు

Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. 6 రైళ్లు రద్దు.. 10 దారి మళ్లింపు

Basani Shiva Kumar HT Telugu
Sep 02, 2024 08:33 AM IST

Trains Cancelled : తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా వరంగల్- విజయవాడ మార్గంలో తిరిగే రైళ్లకు అంతరాయం ఏర్పడింది. వర్షాలు, వరదల నేపథ్యంలో.. సౌత్ సెంట్రల్ రైల్వే కొన్ని రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది.

రైళ్లు రద్దు
రైళ్లు రద్దు (HT)

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో వరదలు సంభవిస్తున్నాయి. వరదల కారణంగా పలుచోట్ల రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. దీంతో సౌత్ సెంట్రల్ రైల్వే అలెర్ట్ అయ్యింది. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 6 రైళ్లను రద్దు చేసింది. 10 రైళ్లను దారి మళ్లించింది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తాజా బులిటెన్ విడుదల చేశారు. ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

రద్దు చేసిన రైళ్ల వివరాలు..

కాజీపేట నుంచి డోర్నకల్ వెళ్లే (07753) రైలును 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రద్దు చేశారు. డోర్నకల్- విజయవాడ మధ్య తిరిగే (07755) రైలును 3, 4, 5వ తేదీల్లో రద్దు చేశారు. విజయవాడ - గుంటూరు మధ్య తిరిగే (07464) రైలును 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రద్దు చేశారు. గుంటూరు - విజయవాడ మధ్య తిరిగే (07465) రైలును కూడా 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకూ రద్దు చేశారు. విజయవాడ- డోర్నకల్ మధ్య తిరిగే (07756) రైలును కూడా 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రద్దు చేశారు. డోర్నకల్- కాజీపేట మధ్య తిరిగే (07754) రైలును 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రద్దు చేశారు.

10 రైళ్లు దారి మళ్లింపు..

ఎస్ఎంవీటీ బెంగళూరు- దానాపూర్, దానాపూర్- ఎస్ఎంవీటీ బెంగళూరు, అహ్మదాబాద్- ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, యశ్వంతాపూర్- తుగ్లక్‌బాద్, పటేల్ నగర్- రోయాపురం, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- హౌరా, కడప- విశాఖపట్నం, రామేశ్వరం- భునేశ్వర్, అలప్పా- ధునుబాద్, తిరుపతి- కాకినాడ టౌన్ మధ్య తిరిగే రైళ్లను దారి మళ్లించారు. ఈ మార్పులను ప్రయాణికులు గమనించాలని అధికారులు సూచించారు. మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె వద్ద రైల్వే ట్రాక్ ధ్వంసం అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ రైల్వే సిబ్బంది యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. పనులకు ఆంటంకం కలగకుండా కొన్ని రైళ్లను దారి మళ్లించారు.

ఉగ్ర కృష్ణమ్మ..

ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. భారీగా వరద రావడంతో.. 70 గేట్లు పూర్తిగా ఎత్తి నిటిని దిగువకు వదులుతున్నారు. వందేళ్ల చరిత్రలో ఇది రెండో అతిపెద్ద వరద అని అధికారులు చెబుతున్నారు. 2009 అక్టోబర్ 5వ తేదీన 10,94,422 క్యూసెక్కుల వరద వచ్చిందని.. ఇప్పుడు పది లక్షల క్యూసెక్కులు దాటిందని వివరిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 10,10,376 క్యూసెక్కులుగా ఉంది.