Kadapa Crime : కడప జిల్లాలో విషాదం.. మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదని గొడవ.. తండ్రిని చంపిన కుమారుడు
Kadapa Crime : కడప జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి.. ఏకంగా తండ్రినే చంపేశాడు. మద్యం తాగేందుకు తండ్రి డబ్బులు ఇవ్వలేదని.. హత్య చేశాడు. తల్లి ఫిర్యాదు మేరకు కొడుకుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని మోడంపల్లెలో దారుణం చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రొద్దుటూరు పట్టణంలోని మోడంపల్లో దళితవాడకు చెందిన రెడ్డిపోగుల వెంకటస్వామి (65), లక్ష్మీదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. వెంకటస్వామి లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వెంకటస్వామి, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో చిన్నకుమారుడు వెంకట సుబ్బయ్య ఆటోనగర్‌లోని ఓ ఐరన్ షాప్‌లో పని చేస్తున్నాడు.
బానిసై..
ఈ క్రమంలో వెంకట సబ్బయ్య ఇటీవల తాగుడుకు బానిసయ్యాడు. తాను సంపాదించుకున్న డబ్బులు సరిపోవడం లేదు. పైగా మద్యానికి బానిసవ్వడంతో సరిగా పనిలోకి వెళ్లటం లేదు. దీంతో ఆయన వద్ద సరిగా డబ్బులు ఉండటం లేదు. ఈ క్రమంలో గురువారం మద్యం తాగేందుకు తల్లి లక్ష్మీదేవిని కుమారుడు వెంకట సుబ్బయ్య డబ్బులు అడిగాడు. డబ్బులు లేవని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మధ్యలోకి వెళ్లి సముదాయించే ప్రయత్నం చేసే తండ్రి వెంకటస్వామిని ఇంట్లో ఉన్న కర్ర తీసుకుని తలపై బలంగా కొట్టాడు.
అక్కడికక్కడే..
తలకు తీవ్రగాయం కావడంతో తీవ్ర రక్తస్రావం అయింది. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆయనను కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్‌లో కర్నూలు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో వెంకటస్వామి ప్రాణాలు వదిలేశారు.
తల్లి ఫిర్యాదుతో..
వెంకటస్వామి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ప్రొద్దుటూరు సీఐ యుగంధర్ తెలిపారు. వెంకటస్వామి మృతి చెందడంతో భార్య లక్ష్మీదేవితో పాటు కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ ఘటనతో మోడంపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మత్తు.. చిత్తు..
మద్యం, జూదం, మత్తు పదార్థాలు వంటి వాటితో మానవత్వం, కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు మంటకలిసిపోతున్నాయి. వాటికి బానిసై కుటుంబాలను సైతం చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. వీటిపట్ల ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేసినప్పటికీ.. ఆశించిన ఫలితాలు రావటం లేదు. పైగా వాటికి బానిసైన వారి సంఖ్య పెరుగుతోంది. అన్నింటికి కంటే మద్యానికి బానిసైన అధిక శాతం మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)