కడప జిల్లా ప్రొద్దుటూరులో కన్నతల్లిని కొడుకు దారుణంగా హత్య చేశాడు. గొంతు కోసి ఆమె శవాన్ని బయటకు ఈడ్చుకొచ్చాడు. అంతేకాదు తర్వాత వెళ్లి టీవీ చూస్తూ కూర్చున్నాడు. ఈ ఘటన చూసిన స్థానికులు భయందోళనకు గురయ్యారు. పోలీసులు సమాచారం ఇవ్వగా.. ఘటన స్థలానికి వచ్చారు.
ప్రొద్దుటూరులోని శ్రీరామ్‌నగర్‌లో లక్ష్మీదేవి, విజయ్ భాస్కర్ రెడ్డి దంపతులు ఉంటున్నారు. వీరి కుమారుడు యశ్వంత్ రెడ్డి. లక్ష్మీదేవి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తారు. ఉన్నదాంట్లో కొడుకును బాగా చదివించాలనుకున్నారు. ఈ మేరకు చెన్నైకి పంపించి.. బీటెక్ చదివించారు. మూడేళ్ల క్రిత ఇంజినీరింగ్ పూర్తి చేశాడు యశ్వంత్. ఉద్యోగం కోసం వెతుకుతూ హైదరాబాద్‌లో ఉంటున్నాడు.
ఖర్చుల నిమిత్తం ప్రతినెలా.. డబ్బులు అడుగుతూ ఉండేవాడు. ఉద్యోగం కోసం కుమారుడు కష్టపడుతున్నాడు కదా.. అని తల్లి లక్ష్మీదేవి నెలనెలా డబ్బులు పంపిస్తూ ఉండేవారు. కొన్ని రోజుల కిందట తల్లికి ఫోన్ చేశాడు యశ్వంత్. కొన్ని డబ్బులు అడగ్గా ఆమె పంపించారు. అయితే మరోసారి ఫోన్ చేసి.. రూ.10 వేలు కావాలని అడిగాడు. ప్రతీ నెలా ఇంత మెుత్తంలో డబ్బులు పంపడం అంటే ఇబ్బంది అవుతుందని లక్ష్మీదేవి అన్నారు. అడిగిన డబ్బులు లేవని చెప్పగా ఇద్దరి మధ్య ఫోన్‌లో గొడవ జరిగింది.
తల్లి మీద యశ్వంత్ కోపం పెంచుకున్నాడు. ఎవరికీ చెప్పకుండా ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకు వచ్చాడు. వచ్చిన వెంటనే తల్లితో గొడవ మెుదలుపెట్టాడు. పెద్ద పెద్ద అరుపులతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కేకలు విని బెడ్ రూమ్‌లో ఉన్న తండ్రి విజయ్ భాస్కర్ రెడ్డి బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. కానీ తండ్రిని యశ్వంత్ గదిలోకి నెట్టి గడియపెట్టాడు.
అనంతరం కూరగాయలు కోసే కత్తితో తల్లి గొంతును కోశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న తల్లి లక్ష్మీదేవిని ఈడ్చుకుంటూ వచ్చి బయటవేశాడు. ఆ తర్వాత తలుపు వేసుకుని టీవీ చూస్తూ కూర్చొన్నాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు వెంటనే ఘటన స్థలానికి వచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీదేవి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.