Prakasam District : మానవత్వం మరిచిన కుమారుడు, కోడలు - ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను అడ్డుకున్న వైనం..!
ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను కుమారుడు, కోడలు అడ్డుకున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని కాకుటూరివారిపాలెంలో వెలుగు చూసింది. గ్రామ పెద్దల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఉదయం జరగాల్సిన అంత్యక్రియలు.. సాయంత్రం జరిగాయి.
కొన్ని సంఘటనలను మానవత్వం మంటకలిపే వేళను గుర్తు చేస్తాయి. సరిగ్గా అలాంటి ఘటనే ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను కొడుకు, కోడలు అడ్డుకున్నారు. కుమార్తెకు రాసిచ్చిన ఆస్తిని పంచాలని వాగ్వాదానికి దిగారు. స్థానికులు సాయంతో ఉదయం జరగాల్సిన అంత్యక్రియలు సాయంత్రం జరిగాయి. మృతదేహం ఎదుటే వాగ్వాదానికి దిగారు. కుమారుడి వ్యవహార శైలి చూసి స్థానిక ప్రజలు నివ్వెరపోయారు. మానవత్వాన్ని మరిచి… చనిపోయిన తండ్రి ఆత్మకు శాంతి కలగకుండా విఘాతం కలించడాన్ని చూసి ప్రజలు విస్తుపోయారు.
ఏం జరిగిందంటే…?
ఈ ఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు మండల కాకుటూరివారిపాలెంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాకుటూరివారిపాలేనికి చెందిన తొట్టెంపూడి వెంకయ్య (85)కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు వెంకట శేషయ్య హైదరాబాద్‌లో ఉంటూ గతేడాదే మృతి చెందాడు. రెండో కుమారుడు వెంకటేశ్వర్లు గ్రామంలోనే వ్యవసాయం చేస్తుంటాడు. కుమార్తె చిలుకూరి సత్యవతి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కుమార్తె కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది.
వెంకయ్యకు వృద్ధాప్యం, తల్లి లక్ష్మమ్మకు పక్షవాతం కావడంతో కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో కుమార్తె వద్ద ఉంటున్నారు. వారికి వైద్యం, పోషణ ఖర్చులంతా కుమార్తె భరించింది. అలా తల్లిదండ్రుల అవసరాలను తీర్చింది. ఈ క్రమంలో ఆదివారం వెంకయ్య మృతి చెందాడు. సొంతూరులో తండ్రి దహన సంస్కారాలు చేయాలని ఆలోచనతో మృత దేహాన్ని సోమవారం కుమార్తె కుటుంబ సభ్యులతో కలిసి తీసుకొచ్చారు. ఆ మేరకు బంధువులకు సమాచారం ఇచ్చారు.
ఆస్తి పంపకాలపై చర్చ….
వేర్వేరు ఊళ్లలో ఉన్న బంధువులంతా వచ్చారు. మంగళవారం ఉదయం అంత్యక్రియలు చేసేందుకు సిద్ధం చేస్తుండగా చిన్న కుమారుడు వెంకటేశ్వర్లు, పెద్ద కోడలు విజయలక్ష్మి ఆస్తి పంపకాల అంశంపై చర్చకు పెట్టారు. ఆస్తి పంపకాల మాటేమిటంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో మృతదేహం ఎదుటే రెండూ కుటుంబాలు వాగ్వాదానికి దిగాయి. దీంతో గ్రామస్తులు విస్తుపోయారు.
తండ్రి పేరుతో ఉన్న పొలం, ఇతర ఆస్తులను కుమార్తె తమకు తెలియకుండా అక్రమంగా రాయించుకుందని చిన్న కుమారుడు… పెద్ద కోడలు బంధువులు ముందు ఆరోపించారు. తల్లిదండ్రులును సరిగ్గా పట్టించుకోకపోవడంతోనే తన వద్ద ఉంటున్నారని, వారి వైద్యం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశానని కుమార్తె బంధువుల వద్ద విలపించింది. ఇప్పుడు ఆస్తి కోసం మాట్లాడుతున్న వారు, తల్లిదండ్రులను ఎందుకు చూడలేదని ప్రశ్నించారు. గ్రామ, కుటుంబ పెద్దలు జోక్యం చేసుకుని తండ్రి మృతి చెంది మూడు రోజులైందని.. అంత్యక్రియలు ఆలస్యం చేయకూడదని సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు.
ఆస్తి కోసం కుటుంబ సభ్యులు వాగ్వాదంతో స్థానిక ప్రజలు నివ్వెరు పోయారు. మృతదేహాన్ని ఎదుటే నానాయాగీకి దిగడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మానవత్వాన్ని మరిచిపోయి ఇలా వ్యవహరిస్తున్నారని మాట్లాడుకున్నారు. తండ్రి చనిపోయిన తరువాత కూడా ఆయనకు మనశ్శాంతి లేకుండా చేశారని, ఇది చాలా అమానవీయమని స్థానికులు చెప్పుకుంటున్నారు.
కుమారుడు, కోడలు, కుమార్తెలను గ్రామ పెద్దలు మందలించారు. ఇది పద్దతి కాదని, తండ్రి మృత దేహం ముందు ఇలా చేయకూడదని మందలించడంతో వెనక్కి తగ్గారు. అప్పుడు ఎట్టకేలకు మంగళవారం సాయంత్రానికి దహన సంస్కారాలు పూర్తయ్యాయి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం