Simhachalam Lands: సింహాచలం పంచ గ్రామాల సమస్యకు పరిష్కారం, 12,149 ఇళ్ల క్రమబద్దీకరణ.. విశాఖలో ప్రత్యామ్నయ భూకేటాయింపు
Simhachalam Lands: సింహాచలం పంచగ్రామాల ఆక్రమణల సమస్య కొలిక్కి వచ్చింది. ఆలయ భూములకు పరిహారంగా ప్రభుత్వ భూమిని దేవస్థానానికి అప్పగించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో దేవాలయ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న 12వేల మందికి లబ్ది చేకూరనుంది.
Simhachalam Lands: ఎంతో కాలం నుండి అపరిష్కృతంగా ఉన్న సింహాచలం పంచ గ్రామాల సమస్యకు త్వరలో ప్రభుత్వం పరిష్కారం చూపనున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెవిన్యూ, దేవాదాయ శాఖ అధికారులతో సచివాలయంలో జరిగిన సమావేశంలో పంచగ్రామాల సమస్యకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పంచగ్రామాల్లో సింహాచలం భూముల్లో ఉన్న 12,149 ఇళ్లను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం అమోదం తెలిపింది. ఇందుకు ప్రత్యామ్నయంగా దాదాపు రూ.5,300 కోట్ల విలువ చేసే 610 ఎకరాల ప్రభుత్వ భూమిని సింహాచల దేవస్థానానికి ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసినట్టు రెవిన్యూ మంత్రి తెలిపారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సింహచల దేవ స్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కూడా ఆమోదం తెలిపారు. ఈ సమస్యకు సంబందించి గతంలో ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.పై పలువురు కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం కోర్టులో ఉన్న ఆ కేసులను కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం త్వరలోనే చర్యలు చేపడుతుందని మంత్రి వివరించారు.
2014-19 మధ్య కాలంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడుఅక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరించేందుకు జి.ఓ.నెం. 338, 296 లను జారీ చేశామని ఈ జీవోల కింద విశాఖలో 70 వేల మంది క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు మంత్రి వివరించారు. జి.ఓల ప్రకారం రెండేళ్ల కాల వ్యవధిలో ఆ భూములపై లబ్దిదారులకు అన్ని హక్కులు దక్కేలా కన్వేయన్సు డీడ్ కూడా ఇవ్వాలని నిర్ణయించారు.
గత ప్రభుత్వం ఆ జి.ఓలను పట్టించుకోకుండా లబ్దిదారులకు న్యాయం చేసే విధంగా స్పందించ లేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని స్థానిక శాసన సభ్యులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయడంతో ఆయన సానుకూలంగా స్పందించారని మంత్రి వివరించారు.
జి.ఓ.ను 2017లో జారీ చేసిన నేపథ్యంలో అప్పటి నుండే ఈ భూములను క్రమబద్దీకరించాలని, అప్పటి నుండి రెండేళ్ల కాలవ్యవధి పూర్తి అయిన వాటికి కన్వేయన్సు డీడ్లును కూడా జారీచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అదే విధంగా రైతులు సాగు చేసుకునే భూములు, కొన్ని కాళీ స్థలాలకు సంబందించి కోర్టులో పలు కేసులు ఉన్నందున, వాటిని కూడా పరిష్కరించరించేందుకు దశల వారీగా ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.
అర్బన్ ల్యాండ్ సీలింగ్‌లో అదనపు భూములు ఏవైనా ఆక్రమణకు గురైనా, వాటిని పి.ఓ.టి. చట్టం ప్రకారం పదేళ్ల కాల వ్యవధిలో అలియనేట్ చేయాల్సి ఉందని, అయితే అటు వంటి భూములకు కూడా రెండేళ్ల కాలవ్యవధిలోనే కన్వేయన్సు డీడ్లును ఇచ్చేందుకు ఈ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
గాజువాక ఇనాం భూముల క్రమబద్దీకరణకు సంబందించి తమ ప్రభుత్వం 2018లో జి.ఓ.నెం.301 ను జారీచేయగా ఆ జి.ఓ. ప్రకారం దాదాపు 7 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఈ ప్రక్రియ కూడా పూర్తి కాకుండా అపరిష్కృతంగా ఉన్నందున, తిరిగి ఆ జి.ఓ.ను కూడా సవరించి నూతన మార్గదర్శకాలతో నూతన జి.ఓ.ను జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
420 ఎకరాల ఆక్రమణ, 12,149ఇళ్లు..
సింహాచలం దేవస్థానం భూమి సుమారు 420 ఎకరాలు ఆక్రమణకు గురై వాటిలో దాదాపు 12,149 ఇళ్లను నిర్మించుకున్నారని పల్లా శ్రీనివాసరావు చెప్పారు. ఆ ఇళ్లను క్రమబద్దీకరించేందుకు గతంలో తమ ప్రభుత్వం జి.ఓ.నెం.229 నూ జారీ చేస్తూ 420 ఎకరాల ప్రభుత్వ భూమిని మరో చోట ఇచ్చేందుకు, క్రమబద్దీకరణ క్రింద వచ్చే ఫీజును కూడా దేవస్థానానికి ఇచ్చేందుకు నిర్ణయించారని చెప్పారు.
ఆక్రమణకు గురైన దేవస్థానం భూమి విలువకు తగిన భూమిని ఇవ్వాలని కోరుతూ కొంత మంది కోర్టుకు వెళ్లారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకు 420 ఎకరాలకు బదులుగా 610 ఎకరాలు (సమాన రిజిస్ట్రేషన్ విలువతో) సింహాచలం దేవస్థానానికి బదలాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. దీని రిజిస్ట్రేషన్ విలువ దాదాపు రూ.5,300 కోట్ల వరకూ ఉందన్నారు. పెదగంట్యాడ, గాజువాక, గొల్లలపాలెం తదితర ప్రాంతాల్లో సింహాచలం దేవస్థానానికి 610 ఎకరాల భూమి ఇస్తున్నామన్నారు.
దేవస్థానానికి అవసరమైన చందనం చెట్లను పెంచుకునేందుకు అవకాశం ఉన్న చోట భూమి ఇస్తున్నామన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కోర్టులో కౌంటరు ఫైల్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రెండు మూడు మాసాల్లో ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం దొరుకుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గాజువాకలో ఇనాం భూమిని క్రమబద్ధీకరించేందుకు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ భూముల క్రమ బద్దీకరణకు సంబందించి 2015-16 సంవత్సరంలో జి.ఓ. నెం. 301 ను జారీ చేయడం జరిగిందని, దాని కట్ ఆఫ్ తేదీ 2017 తో ముగిసిందన్నారు. అయితే ఆ కట్ ఆఫ్ తేదీని 31.12.2023 వరకూ పొడిగస్తూ నూతన జి.ఓ. ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇందు వల్ల మరో ఆరు వేల మందికి లబ్ది చేకూరే అవకాశం ఉందన్నారు.