Edible Oil Prices: ముణ్ణాళ్ల ముచ్చటగా వంట నూనెల సబ్సిడీ.. మళ్లీ పెరిగిన ధరలు.. తూకంలో తగ్గించి ధరల్లో మాయాజాలం
Edible Oil Prices: ఏపీలో వంట నూనెల ధరల నియంత్రణ ముణ్ణాళ్ల ముచ్చటగా మారింది. సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గత ఏడాది ఆకస్మిక తనిఖీల పేరుతో చేసిన హంగామా అటకెక్కింది. మార్కెట్‌లో వంట నూనెల ధరలు మళ్లీ మొదటికి వచ్చాయి. సన్న బియ్యం ధరల బాటలోనే వంట నూనెల ధరలు కూడా పైకి ఎగబాకుతున్నాయి.
Edible Oil Prices: ఏపీలో వంట నూనెల ధరల నియంత్రణకు చేపట్టిన చర్యలు ముణ్ణాళ్ల ముచ్చటగా మారాయి. ఇప్పటికే మిల్లింగ్ ధరలకే సన్న బియ్యం విక్రయాలు మాయం కాగా తాజాగా వంట నూనెల ధరల నియంత్రణను కూడా ఎత్తేశారు. వంట నూనెల ప్యాకింగ్ యూనిట్లు, హోల్‌సేల్ వ్యాపారులను ఒప్పించి తగ్గింపు ధరలకు చేపట్టిన విక్రయాలు ఎక్కడా కనిపించడం లేదు. ధరల తగ్గింపులో వ్యాపారుల మాయాజాలం వెలుగులోకి వచ్చింది.
రిఫైండ్ ఆయిల్, పామాయిల్ ధరలపై గరిష్ట ధరల్ని నిర్ణయించి వాటిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన ధరలతో వంట నూనెలు విక్రయించాలని వ్యాపారులను మంత్రి నాదెండ్ల అప్పట్లో ఆదేశించారు.
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఒకే రకమైన ధరల్ని అమలు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల అప్పట్లో చెప్పారు. ఏపీలో ఇప్పుడు ఎక్కడా ఆ ధరలతో విక్రయాలు జరగడం లేదు. రిఫైండ్ ఆయిల్ ధర రూ.150-160 మధ్యలో విక్రయిస్తున్నారు.
శ్రీకాకుళంలో ఉన్న ధరలనే చిత్తూరులో కూడా ఉండాలని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల అప్పట్లో వ్యాపారులకు ఆదేశించారు. వంటనూనెల అమ్మకంలో వ్యత్యాసం లేకుండా ఒకే ధరకు అమ్మకం జరపాలని సివిల్ సప్లైస్ శాఖ ఆదేశించింది. వంట నూనెల సప్లయర్స్, డిస్ట్రిబ్యూటర్లు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, వర్తకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతి రేషన్ కార్డుపై రిఫైండ్ ఆయిల్‌ను గరిష్టంగా రూ.124కు, పామాయిల్‌ను రూ.110కు విక్రయించాలని నిర్ణయించారు. ప్రతి ఇంటికి రేషన్ కార్డుపై నెలకు సరిపడా వంట నూనెను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని నిర్ణయించారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకన్నారు.
రాష్ట్రంలోని కోటి 49లక్షల కుటుంబాలకు రేషన్ కార్డు సదుపాయం ఉండటంతో వారికి సబ్సిడీ ధరలపై వంట నూనె అందుతుందని చెప్పారు. రేషన్ కార్డులు లేని కుటుంబాలకు సబ్సిడీ ధరలతో నూనెలు విక్రయించాలని మాల్స్‌ను ఆదేశించారు. వంట నూనెల ధరల నియంత్రణ, కృత్రిమ కొరత, నిల్వలను దాచి పెట్టడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ ప్రకటనలు, చర్యలు కంటి తుడుపు చర్యలుగా మిగిలిపోయాయి.
ధర తగ్గింపులో అదే కిటుకు..
వంట నూనెల ధరల తగ్గింపులో కిటుకును హోల్ సేల్ వ్యాపారులు బయటపెట్టేశారు. ప్రభుత్వం బలవంతం చేయడంతో కొన్నాళ్ల పాటు తగ్గింపు ధరలతో విక్రయాలు జరిపారు. అదే సమయంలో ఆ నష్టం తమపై పడకుండా ఆయిల్ కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు జాగ్రత్త పడ్డారు. సాధారణంగా కిలో వంట నూనెను లీటర్లలో కొనుగోలు చేస్తే లీటర్లకు దాదాపు 910 గ్రాముల నూనె ప్యాక్ చేయాల్సి ఉంటుంది.
సబ్సిడీ ధరల ప్యాకింగ్‌లో దాని బరువు 860గ్రాములకు తగ్గించేశారు. వంట నూనెల్ని లీటర్ ప్యాకెట్‌లో పామాయిల్‌ను 860-870 గ్రాములకు పరిమితం చేసి విక్రయించారు. ఇలా కొంత కాలం విక్రయించిన తర్వాత అంతా మర్చిపోయారనుకుని మళ్లీ పాత ధరలతో వంట నూనెల విక్రయాలు ప్రారంభించారు. సివిల్ సప్లైస్ హడావుడి తగ్గిపోవడంతో మళ్లీ మార్కెట్‌లో ధరలు పెరుగుతున్నాయని విజయవాడకు చెందిన హోల్ సేల్ వ్యాపారులు చెబుతున్నారు.