Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళాలో శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం, చక్రస్నానం
మహా కుంభ మేళాలో దశాశ్వమేధ ఘాట్ వద్ద స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసస్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని పవిత్ర గంగా నది ఒడ్డున కన్నుల పండువగా నిర్వహించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహా కుంభ మేళాలో ప్రయాగ్ రాజ్ లోని దశాశ్వమేధ ఘాట్ వద్ద గురువారం స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది.

తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చకుల బృందం ఈ క్రతువు పూర్తి చేసింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసస్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని పవిత్ర గంగా నది ఒడ్డున కన్నుల పండువగా నిర్వహించింది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో నిర్వహించిన స్నపన తిరుమంజనం స్థానిక భక్తులను భక్తి పారవశ్యానికి లోను చేసింది.
ఈ సందర్భంగా వేద పండితులు శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, పురుష సూక్తం, నారాయణ సూక్తం, మొదలైన పంచ సూక్తాలను అర్చకులు వల్లించారు. అభిషేకానంతరం తులసి మాలలతో ఉత్సవ మూర్తులను అలంకరించారు. సహస్రధారాపాత్రతో అభిషేక కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
తదనంతరం శ్రీ చక్రతాళ్వార్ ను మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ గంగా నదిలోకి తీసుకువెళ్లారు. అక్కడ శ్రీ చక్రతాళ్వార్ కు ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించి చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు.
తిరుమలలో సుప్రభాత సేవ పునఃప్రారంభం:
పవిత్రమైన ధనుర్మాసం మంగళవారం ముగియడంతో బుధవారం ఉదయం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభమైంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల చేసింది.
గత ఏడాది డిసెంబరు 16వ తేదీ ఉదయం నుండి ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో డిసెంబరు 17వ తేదీ నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. అయితే జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తి అయింది. దీంతో జనవరి 15వ తేదీ నుండి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభమైంది.
కన్నుల పండువగా గోదా కల్యాణం:
టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలో గల మైదానంలో బుధవారం రాత్రి కన్నుల పండువగా గోదా కల్యాణం జరిగింది. ముందుగా శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి అర్చకస్వాములు కల్యాణ వేదిక మీద వేంచేపు చేశారు. ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆద్యంతంగా అలరించింది.
అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య సంకీర్తనలను సుమధురంగా ఆలపించింది. అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీవిష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణం, రక్షాబంధనం అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు.
సర్కారు సంకల్పం, భక్తుల సంకల్పం, మధుపర్క నివేదనం, వస్త్ర సమర్పణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు. ఆతరువాత మహా సంకల్పం, స్వామి,అమ్మవార్ల ప్రవరలు, మాంగల్యపూజ, మాంగల్య ధారణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రధాన హోమము, లాజ హోమము, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపారు. వారణమాయిరం, మాలా పరివర్తనం, అక్షతారోపణం జరిపి చివరగా నివేదన, మంగళ హారతులు నిర్వహించారు. గోవింద నామ సంకీర్తనలతో గోదా కల్యాణం కార్యక్రమం ముగిసింది.
సంబంధిత కథనం