Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్రకు స్లాట్ బుకింగ్, ఏపీలో మెడికల్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం
Amarnath Yatra : అమర్ నాథ్ యాత్ర స్లాట్ బుకింగ్ ప్రారంభం అయ్యింది. ఈ స్లాట్ బుకింగ్ కు మెడికల్ సర్టిఫికెట్ అవసరం. దీంతో ఏపీ నుంచి అమర్ నాథ్ యాత్రకు వెళ్లే వారు ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే మెడికల్ సర్టిఫికెట్ల జారీకి ఇంకా అనుమతి రాలేదని ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు అంటున్నారు.
Amarnath Yatra : హిందూ భక్తులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అమర్‌నాథ్ యాత్ర స్లాట్ బుకింగ్ ప్రారంభం అయింది. అయితే రాష్ట్రంలో మెడికల్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరుగుతుంది. ఆసుపత్రుల చుట్టూ భక్తులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదని, అనుమతి వచ్చిన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి వస్తోన్న సమాధానం.
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలంటే, స్లాట్ బుకింగ్ చేసుకున్నప్పుడే మెడికల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మెడికల్ సర్టిఫికేట్ లేకపోతే స్లాట్ బుకింగ్ అవ్వదు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో మెడికల్ టెస్టులు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత మెడికల్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. అయితే అమర్‌నాథ్ యాత్ర స్లాట్ బుకింగ్ ప్రారంభమైనప్పటికీ, రాష్ట్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిల్లో మెడికల్ టెస్ట్‌లు నిర్వహించడంలేదు. అందుకు ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదని ఆసుపత్రుల నుంచి వస్తోన్న సమాధానం.
ఆసుప్రతుల్లో మెడికల్ టెస్టులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే వారి సౌకర్యార్థం ఈనెల 14వ తేదీ (సోమవారం) నుంచి దేశవ్యాప్తంగా స్లాట్ బుకింగ్ ప్రారంభమయ్యాయి. అయితే మెడికల్ సర్టిఫికేట్ ఉన్నవారే దరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఉంటుంది. ఈ యాత్రకు వెళ్లేవారు రోజూ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లకు మెడికల్ సర్టిఫికేట్ కోసం వెళ్తున్నారు. అయితే వారికి మెడికల్ టెస్టులు చేయటం లేదు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాకనే మెడికల్ సర్టిఫికేట్ జారీ ప్రక్రియను ప్రారంభిస్తామని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు. మెడికల్ సర్టిఫికేట్ లేకుండా స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి వీలుండదని, జాప్యం జరిగే కొద్దీ రద్దీ పెరుగుతుందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జులై 3న యాత్ర ప్రారంభం
సాధారణంగా అమర్‌నాథ్ యాత్ర శ్రావణ మాసంలో నిర్వహిస్తారు. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర జులై 3న పవాల్గామ్ ట్రాక్, బాల్టాల్ నుంచి ఒకేసారి ప్రారంభమవుతుంది. ఆగస్టు 9న ముగుస్తుంది. దక్షిణ కాశ్మీర్‌లోని అమర్‌నాథ్ పవిత్ర గుహ మందిరానికి 38 రోజుల పాటు యాత్ర జరుగుతుంది. అమర్ నాథ్ యాత్ర ప్రారంభానికి ముందే ఆన్‌లైన్ హెలికాప్టర్ బుకింగ్ ప్రారంభమవుతుంది. లిడ్డర్ లోయ చివరన ఇరుకౌన లోయలో ఉన్న శ్రీ అమర్‌నాథ్ గుహ మందిరం 3,888 మీటర్ల ఎత్తులో ఉంటుంది. పవాల్గామ్ నుండి 45 కిలో మీటర్లు, శ్రీనగర్ నుండి 141 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ యాత్రకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను శ్రీ అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు (ఎస్ఏఎస్‌బీ) నిర్వహిస్తోంది.
ఇది చాలా కష్టమైన యాత్ర. ఈ యాత్రను పూర్తి చేసుకోవడం సాహసమేనని చెప్పాలి. అందుకే ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే ఈ యాత్రకు వెళ్లేలా ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వారిని యాత్రకు అనుమతించరు. అందుకే యాత్ర స్లాట్ బుకింగ్‌కు మెడికల్ సర్టిఫికేట్ తప్పనిసరి చేశారు. ఈ యాత్రకు వెళ్లాలనుకునేవారు తొలుత ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంలో మెడికల్ సర్టిఫికేట్ జారీలో జాప్యం జరుగుతోంది. దీనిపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మెడికల్ సర్టిఫికేట్ మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం