Cyber bullying: సోషల్ మీడియాలో దుష్ప్రచారం, దూషణలు.. ఒక్క రోజులో 42మందిపై కేసులు, అసలు ముఖాలను బయట పెట్టే యోచన…
Cyber bullying: ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా వేదికగా ముసుగు ముఖాలతో చెలరేగిపోతున్న సైబర్ బుల్లియింగ్‌కు అడ్డు కట్ట వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా కొన్నేళ్లుగా సాగుతున్న వ్యవహారం శృతి మించుతోంది. సైబర్ దూషణకు అడ్డు కట్ట వేసేందుకు కీలక ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Cyber bullying: శృతి మించుతున్న సోషల్ మీడియా దుష్ప్రచారాలపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నేళ్లుగా రాజకీయం సోషల్ మీడియా ప్రచారాలతోనే సాగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోడానికి కిరాయి మూకల్ని పెంచి పోషిస్తున్నాయి. పొలిటికల్ కన్సల్టెన్సీలు క్రియేటివిటీ పేరుతో ప్రత్యర్థులపై అసత్య ప్రచారం, దూషణలు, వ్యక్తిత్వ హననం చేసేలా సోషల్ మీడియా వేదికలపై దాడులు చేస్తున్నాయి. గత ఐదేళ్లలో ఈ వ్యవహారం అడ్డు అదుపు లేకుండా సాగుతోంది.
సోషల్ మీడియా దుష్ప్రచారంలో అన్ని స్థాయిల వ్యక్తులు బాధితులుగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి వంటి వారిపై ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టడంతో పాటు ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ పరిణామాలను తీవ్రంగా తీసుకున్న ప్రభుత్వం బాధ్యుల్ని గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆదివారం ఒక్క రోజే విజయవాడ కమిషనరేట్ పరిధిలో 47 కేసుల్ని నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నముసుగు ముఖాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
ఎక్స్, ఫేస్‌బుక్‌లలో ప్రత్యర్థుల్ని కించపరచడం మహిళ నాయకురాళ్లను అసభ్యంగా దూషించడం, అవాస్తవాలను ప్రచారం చేయడమే లక్ష్యంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన మహిళలు, వారి కుటుంబ సభ్యులు కూడా సైబర్ బుల్లియింగ్ బారిన పడుతున్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ అధ్యక్షుడితో విభేదించినందుకు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా ట్రోలింగ్ బారిన పడ్డారు. వైసీపీ సోషల్ మీడియా బృందాలు పెద్ద ఎత్తున షర్మిలను దూషిస్తూ ట్రోల్ చేశాయి. అదే సమయంలో జగన్ సతీమణిని టీడీపీ అనుకూల వర్గాలు ట్రోల్ చేశాయి. రాజకీయాలతో సంబంధం లేని మహిళలపై కూడా అనుచిత వ్యాఖ్యలు, అసభ్య రాతలు కొనసాగాయి. వీటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు ఏ పార్టీ చేయలేదు. ప్రత్యర్థులు చేస్తున్నారనే కారణంతో తమ వారిని అన్ని పార్టీలు ప్రోత్సహించాయి.
సోషల్ మీడియాలో మహిళల్ని ట్రోల్ చేయొద్దని జనసేన అధ్యక్షుడు పవన్ మాత్రమే పదేపేద తమ కార్యకర్తల్ని హెచ్చరించారు. మహిళలపై అసభ్యంగా ట్రోల్ చేస్తే చర్యలు తీసుకుంటామని, ఏ స్థాయి నాయకులను ఉపేక్షించనని డిప్యూటీ సిఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రకటించారు. స్వయంగా పవన్ ఆదేశించినా ఆ పార్టీ అభిమానులు పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు.
స్పీడ్ పెంచిన వైసీపీ
ఏపీలో ఎన్నికల్లో ఓటమి పాలైన వెంటనే వైసీపీ సోషల్ మీడియా బృందాలను మళ్లీ పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేశారు. బహిరంగంగా కార్యక్రమాలను నిర్వహించడం కంటే సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ఎండగట్టడం మేలని ఆ పార్టీ భావించినట్టు తెలుస్తోంది. దీంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియా బృందాలతో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఏ అవకాశం వచ్చిన వదులుకోకూడదన్నట్టు వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని మంత్రుల్ని, కీలక నాయకుల్ని విమర్శించే పేరుతో వ్యక్తిగత విమర్శలు చేయడం ఎక్కువైంది. రాజకీయ పార్టీల సానుభూతిపరుల పేరుతో కొందరు, వేతనాలకు పనిచేస్తున్న వారు మరికొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, మంత్రుల కుటుంబ సభ్యులను అసభ్యంగా దూషిస్తూ ట్రోల్ చేస్తున్నారు.
ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా గత రెండ్రోజులుగా పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని మారుపేర్లతో ట్రోల్ చేస్తున్న వారిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో 42 మందిపై కేసులు నమోదు చేశారు. విజయవాడ వెస్ట్ డివిజన్లో 5, సౌత్ డివిజన్లో 3, నార్త్ డివిజన్లో 3, సెంట్రల్ డివిజన్లో 6, సైబర్ పోలీస్ స్టేషన్లో 9, నందిగామ డివిజన్లో 14, మైల వరం డివిజన్‌లో 2.. కలిపి మొత్తం 42 కేసులు పెట్టారు. ఇప్పటి వరకు ఈ తరహా కేసులు మొత్తం 47 నమోదు చేశారు.
నిందితుల ఐడెంటిటీ బహిర్గతం చేసే యోచన…
మారుపేర్లతో సైబర్ బుల్లియింగ్ పాల్పడుతున్న వారిని గుర్తించి వారి జాబితా రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు ఎక్కడెక్కడి నుంచో సోషల్ మీడియాలో అసభ్య రాతలతో చెలరేగిపోతున్న వారి జాబితాను, వారి అసలు ముఖాలు, ఐడెంటిటీలతో బహిర్గతం చేయాలని యోచిస్తున్నారు. ఇది ఆచరణలోకి వస్తే సోషల్ మీడియాలో అసభ్యంగా ప్రవర్తించే వారిపై కేసులతో పాటు సైబర్ బుల్లియింగ్ జాబితాలో చోటు దక్కించుకుని శాశ్వతంగా రికార్డులకెక్కుతారు. వారి క్రిమినల్ హిస్టరీ పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చే ఆలోచన కూడా చేస్తున్నారు. రకరకాల పేర్లతో పోస్టులు పెడుతున్న వారిని సాంకేతిక పరిజ్ఞానం సాయంతో గుర్తించేందుకు కసరత్తు చేస్తున్నారు.