Annamayya District : టాస్క్ ఫోర్స్ పోలీసుల భారీ ఆపరేషన్ - రూ. 4.20 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత-six tons of red sandalwood seized in annamayya district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Annamayya District : టాస్క్ ఫోర్స్ పోలీసుల భారీ ఆపరేషన్ - రూ. 4.20 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత

Annamayya District : టాస్క్ ఫోర్స్ పోలీసుల భారీ ఆపరేషన్ - రూ. 4.20 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత

HT Telugu Desk HT Telugu
Published Feb 06, 2025 04:04 PM IST

అన్న‌మ‌య్య జిల్లాలో టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీ ఎర్ర చంద‌నం ఆప‌రేష‌న్‌ చేపట్టారు. ఏకంగా రూ.4.20 కోట్ల విలువైన ఎర్ర‌చందనం దుంగ‌లను స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మంది అంత‌రాష్ట్ర స్మ‌గ్ల‌ర్లను అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.

అన్న‌మ‌య్య జిల్లాలో భారీగా ఎర్ర చంద‌నం పట్టివేత
అన్న‌మ‌య్య జిల్లాలో భారీగా ఎర్ర చంద‌నం పట్టివేత

అన్న‌మ‌య్య జిల్లాలో ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ల‌ు పట్టుబడ్డారు. మొత్తం ఆరుగురు అంత‌రాష్ట్ర స్మ‌గ్ల‌ర్ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారి వ‌ద్ద‌న నుంచి భారీస్థాయిలో దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4.20 కోట్లుగా ఉంది. ఒక కారు, మోట‌ర్ సైకిల్ ను సీజ్ చేశారు.

ముమ్మర తనిఖీలు….

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం కొమిటోని చెరువు వద్ద తిరుప‌తికి చెందిన ఆర్ఎస్ఏఎస్టీఎఫ్ బృందం ఆకస్మికంగా త‌నిఖీలు నిర్వ‌హించింది. బుధ‌వారం టాస్క్‌ఫోర్సు సిబ్బందికి వ‌చ్చిన స‌మాచారం మేర‌కు ఈ త‌నిఖీలు ముమ్మ‌రంగా చేప‌ట్టారు.

సానిపాయలో కొమిటోని చెరువు సమీపంలో ఒక కారు, ఒక మోటారు సైకిల్ ఆగి ఉన్నాయి. కారులో కొంత‌మంది వ్య‌క్తులు ఎర్ర‌చంద‌నం దుంగ‌లు లోడు చేస్తున్నారు. అది గమనించిన టాస్క్ ఫోర్సు పోలీసులు వారిని వెంబడించారు. మొత్తం ఎనిమిది మందిని ప‌ట్టుకోగా… మిగిలిన వారు ప‌రార‌య్యారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ ప్రాంతంలో త‌నిఖీ చేప‌ట్టారు.

కారు, ప‌ల్స‌ర్ మోట‌ర్ సైకిల్‌తో పాటు ఎర్ర‌చంద‌నం దుంగ‌లు స్వాధీనం చేసుకున్నారు. ప‌ట్టుబడిన ఎమిమిది మంది నిందితుల‌ను విచారించ‌గా వారు త‌మిళ‌నాడు రాష్ట్రం తిరువ‌న్నామ‌లై జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి… వారిపై కేసు న‌మోదు చేశారు.

నిందితుల సమాచారంతో…..

ఈ కేసులోని నిందితులు విచార‌ణ‌లో తెలిపిన స‌మాచారం మేర‌కు టాస్క్‌ఫోర్స్ పోలీసులు క‌ర్ణాట‌కలోని హోస్కోట తాలుక క‌టిక‌నిల్లి గ్రామం స‌మీపం గ‌ల నీల‌గిరి తోట‌కు చేరుకున్నారు. అక్క‌డ దాచి ఉంచిన 185 ఎర్ర చంద‌నం దుంగ‌ల‌ను స్వాధీనం చేసుకుని తిరుప‌తికి తర‌లించారు.

ప్రధాన స్మగ్లర్లను అరెస్టు చేయడానికి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. పట్టుబడిన మొత్తం 195 ఎర్రచందం దుంగల విలువ సుమారు రూ.4.20 కోట్ల ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసును చేదించడంలో ప్రతిభ కనబరిచిన తిరుపతి టాస్క్ ఫోర్స్ సిబ్బందిని టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్‌. సుబ్బారాయుడు అభినందించారు. అధికారులు, సిబ్బందికి రివార్డులు ప్రకటించారు.

రిపోర్టింగ్: జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం