Nellore Boat Accident : బోటు తిరగబడి ఆరుగురు మృతి.. మంత్రి కాకాణి స్వగ్రామంలో విషాదఛాయలు
Nellore Boat Accident : నెల్లూరు పడవ ప్రమాదంలో ఆరుగురు యువకులు దుర్మరణం చెందారు. 10 మంది చెరువులో షికారుకి వెళ్లగా.. పడవలోకి నీరు చేరడంతో.. నలుగురు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు. మిగతా ఆరుగురికి ఈత రాకపోవటంతో.. చెరువులో మునిగిపోయారు. గాలింపు చర్యలు చేపట్టి.. మృతదేహాలను బయటకు తీశారు.
Nellore Boat Accident : నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బోటు తిరగబడి ఆరుగురు యువకులు దుర్మరణం చెందారు. పడవలో మొత్తం పది మంది ఉండగా.. నలుగురు యువకులు ఈతకొట్టుకుంటూ సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన ఆరుగురు గల్లంతయ్యారు. వీరి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. చెరువులో నుంచి ఆరుగురు యువకుల మృతదేహాలను బయటకు తీశారు. విగతజీవులుగా మారిన యువకులను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికంగా అందరినీ తీవ్రంగా కలచివేసిన ఈ ఘటన.. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడేరు శాంతినగర్ లోని రత్నగిరి చెరువులో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రత్నగిరి చెరువులో ఆదివారం సాయంత్రం పది మంది స్నేహితులు బోటు షికారుకి వెళ్లారు. చెరువు మధ్యలోకి వెళ్లాక.. బోటులోకి నీరు వచ్చి చేరింది. ఈ విషయాన్ని గమనించిన నలుగురు యువకులు... నీటిలోకి దూకేశారు. ఈతకొట్టుకుంటూ ఒడ్డుకు చేరారు. మిగిలిన వారికి ఈత రాకపోవటంతో.. బోటులోనే ఉండిపోయారు. నీరు ఎక్కువై బోటు ఒక్కసారిగా తిరగబడంతో... ఆరుగురు యువకులు చెరువులో గల్లంతయ్యారు. బయటకు వచ్చిన నలుగురు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకి తెలియజేయడంతో... సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు చెరువు మొత్తం గాలించి... ఆరుగురు యువకుల మృతదేహాలను బయటకు తీశారు.
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలోని రత్నగిరి చెరువులో ఆదివారం సాయంత్రం జరిగిన బోటు ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. తన స్వగ్రామానికి చెందిన పది మంది యువకులు బోటు ప్రమాదంలో చిక్కుకున్నారని తెలిసి ఇతర రాష్ట్రంలో అధికారిక పర్యటనలో ఉన్న మంత్రి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు పరిస్థితి సమీక్షించారు. గాలింపు చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సోమవారం తెల్లవారుజామున మళ్లీ ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్థులతో... మీడియాతో మాట్లాడారు. మృతదేహాలను ఒడ్డుకు చేర్చగా.. విగత జీవులుగా మారిన యువకులను చూసి మంత్రి కాకాణి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన చాలా సేపు వరకు ఘటనా స్థలంలోనే ఉన్నారు. కుటుంబ సభ్యుల రోదనల చూసి.. మంత్రి కూడా కన్నీటి పర్యంతం అయ్యారు.
యువకులంతా సరదాగా చెరువులోకి వెళ్లడం, అక్కడే వారు మృత్యువాత పడటంతో తోడేరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎదిగొచ్చిన బిడ్డలు తమ కళ్లముందే శవాలుగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.