విజయవాడ, జూన్ 17, 2025: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)పై ఏ.ఆర్. హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సిట్ కార్యాలయం ఈరోజు ఒక పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది. మద్యం కుంభకోణం దర్యాప్తును బలహీనపరిచేందుకు, సిట్ అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు కొన్ని "అదృశ్య శక్తులు" కుట్రలు పన్నుతున్నాయని సిట్ ఆరోపించింది. ఈ కుట్ర కోణాన్ని బయటపెట్టి, న్యాయస్థానం ముందు ఉంచుతామని సిట్ కార్యాలయం తేల్చి చెప్పింది.
మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా, గత పదేళ్లుగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డికి గన్‌మెన్ (PSO)గా పనిచేసిన ఏ.ఆర్. హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డిని సిట్ విచారించింది. అయితే, మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, సిట్ అధికారులు తనపై ఒత్తిడి తెచ్చి, "చెవిరెడ్డికి కేసుతో సంబంధం ఉందని చెప్పమని, తాము చెప్పినట్లు రాసి సంతకం చేయమని" డిమాండ్ చేశారని మదన్ రెడ్డి ఆరోపించారు. తప్పుడు వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించినందుకు తనను సిట్ అధికారులు బెదిరించి, కొట్టారని కూడా ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలను సిట్ కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేసింది.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై మంగళగిరి సీఐడీ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం. 21/2024 కింద ఐపీసీ సెక్షన్లు 409, 420, 120(B) R/w 34 & 37 తో పాటు అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్లు 7, 7A, 8, 13(1),(b), 13(2) కింద కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు కోసమే ప్రత్యేకంగా 'స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్' (SIT) ఏర్పాటైంది. అప్పటి నుండి ఈ కేసులో పలువురు సాక్షులను, అనుమానితులను విచారించింది. ముఖ్య నిందితుడు కెస్సిరెడ్డి రాజశేఖర రెడ్డి అలియాస్ రాజ్‌తో సహా చాలామందిని అరెస్టు చేశారు.
ఈ దర్యాప్తులో భాగంగా సేకరించిన ఆధారాల ప్రకారం, మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన భారీ మొత్తంలో ముడుపులు కెస్సిరెడ్డి రాజశేఖర రెడ్డి అలియాస్ రాజ్ నుండి చంద్రగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డికి అందాయి. ఈ డబ్బును ఎన్నికల సమయంలో ప్రజలకు పంచినట్లు కూడా తెలిసిందని సిట్ తన ప్రకటనలో పేర్కొంది.
దాదాపు పదేళ్లుగా చెవిరెడ్డి భాస్కర రెడ్డికి పర్సనల్ గన్‌మెన్‌గా పనిచేసిన తిరుపతి జిల్లా ఏ.ఆర్.హెచ్.సి. 2189ని (మదన్ రెడ్డి) విచారణ నిమిత్తం సిట్ కార్యాలయానికి పిలిచారు. అయితే, విచారణ సమయంలో మదన్ రెడ్డి సిట్ అధికారులకు సహకరించలేదని, పైగా విచారిస్తున్న సిట్ అధికారులనే "మీ పేర్లు రాసి చనిపోతాను" అని బెదిరించారని సిట్ పేర్కొంది.
'స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్' మొదటి నుంచీ చాలా పారదర్శకంగా, నిబద్ధతతో దర్యాప్తు చేస్తోందని సిట్ స్పష్టం చేసింది. తమ కార్యకలాపాల్లో మానవ హక్కుల ఉల్లంఘనకు ఎప్పుడూ పాల్పడలేదని సిట్ తెలిపింది. కేవలం డాక్యుమెంటరీ ఆధారాలు, టెక్నికల్ ఆధారాలు, వివిధ వ్యక్తుల వాంగ్మూలాల ఆధారంగా మాత్రమే నిష్పాక్షికంగా దర్యాప్తు జరుగుతోందని, అబద్ధాలకు, కట్టు కథలకు సిట్‌లో చోటు లేదని తేల్చి చెప్పింది.
ఇప్పటివరకు దాదాపు 200 మందికి నోటీసులు ఇచ్చి సిట్ కార్యాలయానికి పిలిపించి విచారించారు. అయితే, ఇప్పటివరకు ఎవరి నుంచీ ఎటువంటి ఆరోపణలు రాలేదని సిట్ వెల్లడించింది. కానీ, మదన్ రెడ్డి అనే హెడ్ కానిస్టేబుల్ ఈరోజు ఒక కొత్త డ్రామాకు తెరతీశాడని సిట్ అభిప్రాయపడింది. తనను పోలీసులు వేధించారని తప్పుడు ఆరోపణలతో డీజీపీకి ఒక లేఖ ఇచ్చారని, దానిని కొన్ని ఛానెల్స్‌లో వైరల్ చేశారని, హైకోర్టులో కూడా పిటిషన్ వేశారని సిట్ పేర్కొంది.
"దీని వెనుక కుట్ర కోణం ఉందని మా ప్రగాఢ నమ్మకం" అని సిట్ ప్రకటించింది. ఈ మధ్యనే చెవిరెడ్డి భాస్కర రెడ్డితో సంబంధం ఉన్న బాలాజీ కుమార్ యాదవ్ అనే వ్యక్తిని సిట్ పోలీసులు అక్రమ నిర్బంధం చేశారని హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేశారని, ఇది కూడా పచ్చి అబద్ధం అని సిట్ కొట్టిపారేసింది.
ఈ రెండు ఘటనలు చూస్తుంటే, సిట్ పనిని అడ్డుకోవడానికి, సిట్ అధికారులపై ఒత్తిడి తెచ్చి తద్వారా ఈ కేసు దర్యాప్తును బలహీనపరచాలనే ఉద్దేశంతో కొన్ని అదృశ్య శక్తులు కుట్రలు పన్నుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుందని సిట్ ఆరోపించింది. ఈ కుట్ర కోణాన్ని బహిర్గతం చేసి, న్యాయస్థానం ముందు ఉంచుతామని, మదన్ రెడ్డి డ్రామాను ఎండగడతామని సిట్ కార్యాలయం స్పష్టం చేసింది. సిట్ ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ అని, ఎవరి బెదిరింపులకూ లొంగదని, ఈ స్కాంలో ఎంత పెద్ద దోషులైనా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి చట్టం ముందు నిలబెడతామని సిట్ దృఢంగా ప్రకటించింది.
హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అయినప్పటికీ, సిట్ తన నిబద్ధతను, పారదర్శకతను నిరూపించుకోవడానికి డీజీపీని ఒక సీనియర్ అధికారి తో ఉన్నత స్థాయి విచారణ చేయించమని అభ్యర్థించింది. తప్పు ఎవరిదైనా కఠినమైన డిపార్ట్‌మెంటల్ చర్యలు తీసుకోవాలని కూడా కోరింది.