AP Liquor Shortage : మందుబాబులకు తప్పని తిప్పలు.. ఏపీలో మద్యం, బీర్ల కొరత!
AP Liquor Shortage : ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ అందుబాటులోకి వచ్చి చాలా రోజులు అయ్యింది. అన్ని బ్రాండ్లను అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు అన్ని అందుబాటులో లేవనే టాక్ వినిపిస్తోంది. కొన్ని రోజులుగా మద్యం, బీర్లకు కొరత ఏర్పడింది. దీంతో లిక్కర్ ప్రియులు అసంతృప్తిగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం దుకాణాల్లో కొన్ని బ్రాండ్ల మద్యం, బీర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. మద్యం వ్యాపారులు ఆర్డర్లు పెడుతున్నా.. కొన్ని బ్రాండ్ల మద్యం, బీర్లు షాపులకు సరఫరా కావడం లేదు. ముఖ్యంగా మద్యం విషయంలో ఇంపీరియల్ బ్లూ (ఐబీ), మెక్ డొవెల్స్ బ్రాండ్లకు కొరత ఉంది. ఇక బీర్ల విషయానికొస్తే.. కింగ్‌ఫిషర్, బడ్‌వైజర్ బీర్ల కొరత తీవ్రంగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. 10 కేసులు ఆర్డర్ పెడితే.. కనీసం ఒక్క కేసు కూడా వచ్చే పరిస్థితి లేదని మద్యం వ్యాపారులు చెబుతున్నారు.
ఆశించిన స్థాయిలో లేదు..
ఏపీలో మద్యం షాపుల వ్యాపారం ఆశించిన స్థాయిలో లేదని వ్యాపారులు అంటున్నారు. వైన్ షాపులను దక్కించుకోవడానికి మద్యం వ్యాపారులు లక్షల్లో వెచ్చించారు. కొన్ని చోట్ల ఎంతో కష్టపడి షాపులను ఏర్పాటు చేసుకున్నారు. కానీ.. ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగడం లేదు. దీంతో ఆఫర్లు ప్రకటిస్తూ.. మందుబాబులను ఆకర్షిస్తున్నారు. ఎలాగైన మద్యం అమ్మకాలు పెంచుకోవాలని చూస్తున్నారు. ఆఫర్లు ప్రకటించాక అమ్మకాలు కాస్త పెరిగినట్టు తెలుస్తోంది.
ఆఫర్లు..
అన్నమయ్య జిల్లా, రాజంపేట ప్రాంతాల్లో మద్యం దుకాణాల ముందు ఆఫర్ల బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. 'ఈ షాపులో క్వాటర్ కొంటే.. మందు తోపాటు ఓ గుడ్డు, ఓ గ్లాసు, ఓ వాటర్ ప్యాకెట్ ఫ్రీ' అని బ్యానర్లు పెట్టారు. లిక్కర్ సేల్స్ పెంచుకోవడానికి వైన్ షాపుల నిర్వాహకులు ఈ ప్లాన్ వేశారని తెలుస్తోంది. ఈ ఆఫర్ ప్రకటించిన తర్వాత ఆయా షాపుల్లో లిక్కర్ సేల్స్ పెరిగాయని అంటున్నారు.
సీఎం వార్నింగ్..
ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని.. రెండు కంటే ఎక్కువసార్లు కేసులు నమోదైతే.. లైసెన్స్ రద్దు చేస్తామని ఏకంగా సీఎం వార్నింగ్ ఇచ్చారు. దీంతో పెట్టుబడి పోనూ లాభాలు రావాలంటే ఈ తిప్పలు తప్పడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఎలాగైనా సేల్స్ పెంచుకొని లాభాలు సాధించాలని ఆరాటపడుతున్నారు.