MLC Anantha Babu video: ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో వ్యవహారంలో.. అదిరిపోయే ట్విస్ట్
MLC Anantha Babu video: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత బాబు వీడియో వ్యవహారం.. ఏపీ రాజకీయాల్లో రచ్చ చేస్తోంది. దీనిపై టీడీపీ సైటైర్లు వేస్తోంది. తాజాగా ఈ ఇష్యూలో ఎమ్మెల్సీ అనంతబాబు ట్విస్ట్ ఇచ్చారు. ఆ వీడియో గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత బాబు.. అనుచితమైన హావభావాలు చూపిస్తున్న వీడియో ఒకటి వివాదాస్పదమైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై టీడీపీ, ఇతర పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 2022లో కారు డ్రైవర్ హత్య కేసులో అనంత బాబు ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈ వీడియో వ్యవహారం రాజకీయ రచ్చ చేస్తోంది. ఈ వీడియో వ్యవహారంపై తాజాగా అనంత బాబు స్పందించారు.
'మార్ఫింగ్ వీడియోతో నన్ను బ్లాక్ మెయిల్ చేశారు. స్నేహితుడి కుమారుడి పుట్టిన రోజున వీడియో కాల్‌లో ముద్దులు పెట్టా. ఆ వీడియో కాల్‌ను మార్ఫింగ్ చేసి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే రంపచోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశా. తెలంగాణకు చెందిన కొందరు నన్ను డబ్బుల కోసం భయపెడుతున్నారు' అని ఎమ్మెల్సీ అనంతబాబు స్పష్టం చేశారు.
అది పుట్టినరోజు వీడియో..
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎడిట్ చేసిన వీడియో అని అనంత బాబు తోసిపుచ్చారు. దీనిపై విచారణ జరపాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఆరు నెలలుగా తెలంగాణకు చెందిన కొందరు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వకుంటే వీడియో బయటపెడతానని బెదిరిస్తున్నారని అనంత బాబు వివరించారు. పుట్టినరోజు పార్టీలో తన ఫుటేజీని ఇతర కంటెంట్‌తో కలిపారని చెప్పారు. తనను బ్లాక్ మెయిల్ చేసిన వారికి డబ్బులు చెల్లించినప్పటికీ.. వారు బెదిరిస్తూనే ఉన్నారని వాపోయారు.
అడ్డతీగల పోలీసులకు ఫిర్యాదు..
తెలంగాణ వ్యక్తుల వేధింపులపై అడ్డతీగల సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు జూన్ 1న సమాచారం అందించామని.. ఎమ్మెల్సీ అనంతబాబు వివరించారు. వారు ఉపయోగించిన ఫోన్ నంబర్ తన దగ్గర లేదని చెప్పారు. అనంత బాబు ఫిర్యాదుపై రంపచోడవరం ఏఎస్పీ స్పందించారు. సమగ్ర విచారణ కోసం సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్సీని కోరినట్లు చెప్పారు. పూర్తి వివరాలు రాగానే పోలీసులు విచారణ ప్రారంభిస్తారని స్పష్టం చేశారు.
పార్టీకి తలనొప్పి..
గతంలోనే హత్యానేరం ఆరోపణలు ఎదుర్కొన్న అనంత బాబు.. తాజాగా ఈ వివాదంలో చిక్కుకోవడం పార్టీకి తలనొప్పిగా మారింది. రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటే.. తిప్పికొట్టలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం కూడా పార్టీకి నష్టం చేసింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకుంది. ఇప్పుడు అనంత బాబు వ్యవహారంలో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతోంది.