Jagan vs Sharmila : మీ అవివేకానికి, అజ్ఞానానికి ఇదే నిదర్శనం.. జగన్‌కు మళ్లీ కౌంటర్ ఇచ్చిన షర్మిల!-sharmila counters ys jagan in the backdrop of ap assembly session ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jagan Vs Sharmila : మీ అవివేకానికి, అజ్ఞానానికి ఇదే నిదర్శనం.. జగన్‌కు మళ్లీ కౌంటర్ ఇచ్చిన షర్మిల!

Jagan vs Sharmila : మీ అవివేకానికి, అజ్ఞానానికి ఇదే నిదర్శనం.. జగన్‌కు మళ్లీ కౌంటర్ ఇచ్చిన షర్మిల!

Basani Shiva Kumar HT Telugu
Nov 11, 2024 12:22 PM IST

Jagan vs Sharmila : అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరంగా ఉండటంపై షర్మిల ఘాటుగా స్పందించారు. మరోసారి జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ అవివేకానికి, అజ్ఞానానికి ఇదే నిదర్శనం అని ట్వీట్ చేశారు. అటు కూటమి ప్రభుత్వంపైనా షర్మిల విమర్శలు గుప్పించారు. షర్మిల కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

షర్మిల
షర్మిల

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి తన సోదరుడు జగన్‌పై సెటైర్లు వేశారు. వైసీపీ తీరు.. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుందని విమర్శించారు. అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసింది.. ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది అని ట్వీట్ చేశారు.

'మీ స్వయం కృతాపరాధం మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకి దూరం చేస్తే... ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనం. అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయం. ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చే గొప్ప అవకాశం' అని షర్మిల వ్యాఖ్యానించారు.

'కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేదు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. మహిళలపై దాడులు ఆగడం లేదు. ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. బెల్టు షాపుల దందాను అరికట్టలేదు. 5 నెలలైనా ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదు. రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతోంది' అని షర్మిల ఆరోపించారు.

'ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుక అయ్యే అవకాశం వైసీపీకి ప్రజలు ఇస్తే... ప్రతిపక్షం ఇస్తేనే వస్తాం అనడం సిగ్గు చేటు. ప్రతిపక్షం లేకుంటే సభలోనే ప్రజాపక్షం అవ్వాలని ఇంగితం కూడా లేకపోవడం బాధాకరం. 1994లో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకే పరిమితం అయినా.. కుంగిపోలేదు. మీ లెక్క హోదా కావాలని మారం చేయలేదు. 26 మంది సభ్యులతో సభలో ప్రజల పక్షంగా నిలబడ్డాం. ఎన్నో సమస్యలపై ఆనాడు టీడీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించింది కాంగ్రెస్ పార్టీ' అని షర్మిల ట్వీట్ చేశారు.

'2014లో కేంద్రంలో 44 సీట్లకే పరిమితం అయినా, 2019లో 52 సీట్లే వచ్చినా ప్రతిపక్ష హోదా కావాలని అడగలేదు. హోదా లేకున్నా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించారు. మోదీ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. దేశ ప్రజల సమస్యలపై కాంగ్రెస్ గొంతుకగా మారింది' అని వివరించారు.

'ఇప్పటికైనా మీ పిచ్చితనాన్ని పక్కన పెట్టి అసెంబ్లీకి వెళ్ళండి. కూటమి నిర్లక్ష్యాన్ని ఎండగట్టండి. అసెంబ్లీకి వెళ్ళే దమ్ము ధైర్యం లేకుంటే వైసీపీ శాసనసభా పక్షం మొత్తం రాజీనామాలు చేయండి. అప్పుడు ఇంట్లో కాదు.. ఎక్కడైనా కూర్చుని తాపీగా మాట్లాడుకోండి' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Whats_app_banner