Guntur : గుంటూరు జీజీహెచ్‌లో విద్యార్థినులకు తప్పని లైంగిక వేధింపులు.. ల్యాబ్ టెక్నీషియన్, డాక్టర్‌పై ఫిర్యాదు
Guntur : గుంటూరు జీజీహెచ్‌లో విద్యార్థినులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. బ్లడ్‌బ్యాంక్‌లో ల్యాబ్ టెక్నిషియన్, డాక్టర్ వేధింపులకు అంతు లేదని సిబ్బంది చెబుతున్నారు. వీరిద్దరిపై ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై కమిటీ చేశారు. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

గుంటూరు జీజీహెచ్‌లో విద్యార్థినులపై లైంగిక వేధింపుల వ్యవహారం.. శనివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఐదుగురు విద్యార్థినులు తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి.. గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఎన్.వి సుందరాచారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జీజీహెచ్‌లోని బ్లడ్‌బ్యాంక్‌లో పని చేస్తున్న టెక్నికల్ సూపర్‌వైజర్ శివ శంకర్‌పై.. ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చదువుతున్న విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. తమను అనవసరంగా తాకుతున్నాడని, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని విద్యార్థినులు ఆరోపించారు.
డాక్టర్‌పై ఫిర్యాదు..
బ్లడ్‌బ్యాంక్‌లో రాత్రి సమయంల్లో అవసరం లేకపోయినా ఓ డాక్టర్ అక్కడ తిష్టవేసి.. తమతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని మహిళ సిబ్బంది కూడా ఆరోపించారు. అందుకు బ్లడ్‌బ్యాంక్‌లో చేతులు కోసుకున్న ఘటనను ఉదాహరణగా చెబుతున్నారు. రెండు నెలల కిందట బ్లడ్ బ్యాంక్‌లో పని చేస్తున్న సిబ్బందిలో ఇద్దరు ఓ డాక్టర్ తనవాడంటే, తన వాడంటూ చేతులు కోసుకున్న సంఘటన కలకలం సృష్టించింది. దీనిపై విచారించిన అధికారులు సదరు డాక్టర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆయన రాసలీలకు అడ్డు లేదని సిబ్బంది అంటున్నారు.
అవసరాన్ని ఆసరాగా చేసుకొని..
ఇప్పుడు లైంగిక వేధింపుల సంఘటన వెలుగులోకి వచ్చింది. బ్లడ్‌బ్యాంక్‌లో మెడికల్ ఆఫీసర్ చేయాల్సిన పనులన్నీ ఓ కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ చేస్తున్నారు. సిబ్బంది సదరు ఉద్యోగిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సెలవులు మంజూరు చేయాలన్నా.. ఆయన నచ్చినట్లు ఉండాలని.. ఏదైనా అవసరం పడితే, దాన్ని ఆసరాగా తీసుకుని లైంగిక వేధింపులకు పాల్పడతారనే ఆరోపణలు ఉన్నాయి.
కమిటీ ఏర్పాటు..
విద్యార్థుల ఫిర్యాదు, బ్లడ్‌బ్యాంక్ సిబ్బంది ఆరోపణలు జీజీహెచ్‌లో కలకలం సృష్టించాయి. దీనిపై గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి సుందరాచారి స్పందించారు. విద్యార్థులు, సిబ్బంది ఫిర్యాదు నేపథ్యంలో విచారణకు ఆదేశించామని చెప్పారు. విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించామన్నారు. ఆ కమిటీ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రక్షాళన చేయాలని..
ల్యాబ్ టెక్నీషియన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికపై నియామకం అయిన ల్యాబ్ టెక్నీషియన్.. విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడడం దారుణమని విద్యార్థినుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ రాసలీలకు అడ్డాగా మార్చుకున్న బ్లడ్‌బ్యాంక్‌ను ప్రక్షాళన చేయాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరాజపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)