Visakhapatnam : విశాఖ జిల్లాలో ఘోరం.. మతిస్థిమితం లేని బాలికపై లైంగికదాడి
Visakhapatnam : విశాఖ జిల్లాలో ఘోరమైన సంఘంటన చోటు చేసుకుంది. మతిస్థితం లేని చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఇప్పటివరకు ఆ వ్యక్తిపై కేసు నమోదు కాకపోవడం గమనార్హం.
విశాఖపట్నం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దారుణం జరిగింది. మతిస్థిమితం లేని బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. 12 ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో కలిసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటుంది. ఆ బాలికకు మతిస్థిమితం లేదు. బాలిక ఉన్న వీధిలోనే వాడమదుల జోగారావు (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. జోగారావు 45 ఏళ్లు ఉన్నా ఇంకా వివాహం కాలేదు. ఆయన కుంటుంబంతోనే ఉంటున్నాడు.
జోగారావు ఇంటికి బాధిత బాలిక ఆడుకోవడానికి తరచూ వెళ్తుంటుంది. దీంతో బాలిక తల్లిదండ్రులకు కూడా ఎటువంటి అనుమానం రాలేదు. బాలిక తరచూ ఇంటికి రావడంతో జోగారావు బాలికపై కన్నేశాడు. ఎప్పటి నుంచో బాలికను ఎలాగైన లోబర్చుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే బాలికను దగ్గరకు తీసుకునేవాడు. రెండు రోజుల కిందట బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఏం జరగనట్లు వ్యవహరించాడు.
బుధవారం ఉదయం బాలిక అస్వస్థతకు గురై బాధపడుతుంది. దీంతో ఏం జరిగిందోనని బాధపడుతూ తల్లిదండ్రులు వైజాగ్‌లోని కేజీహెచ్‌కి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. బాలికపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని వన్‌టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఈ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి గురించి అడిగారు. అయితే బాలికకు మతిస్థిమితం లేకపోవడంతో.. చెప్పలేకపోయింది.
కానీ.. నిందితుడి ఫొటోను బాలికకు చూపిస్తే, అప్పుడు ఆమె గుర్తుపట్టింది. ఆయననే తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది. వెంటనే పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే.. ఈ ఘటనను పోలీసులు గోప్యంగా ఉంచారు. ఇప్పటి వరకు ఎటువంటి కేసు నమోదు కాలేదు.
శ్రీసత్యసాయి జిల్లాలో..
శ్రీసత్యసాయి జిల్లాలో బాలికపై ఒక వ్యక్తి లైంగిక దాడికి యత్నించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా, పుట్టపర్తి మండలంలోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ గ్రామంలో బాలిక ఐదో తరగతి చదువుతోంది. బుధవారం సాయంత్రం పాఠశాల ముగిసిన తరువాత ఇంటికి చేరుకున్న బాలిక బహిర్బూమి నిమిత్తం బయటకు వెళ్లింది. అదే గ్రామానికి చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తి ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. సూర్యనారాయణకు పెళ్లై భార్య, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
బాలిక రాకను పసిగట్టిన నిందితుడు సూర్యనారాయణ, బాలికను ఎత్తుకుని రోడ్డు పక్కనే ఉన్న బాత్‌రూంలోకి తీసుకెళ్లాడు. బాలికపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఆ చిన్నారి పట్ల వికృతంగా ప్రవర్తించాడు. బాలిక భయపడి పెద్దగా కేకలు వేసింది. వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక ఇంటికి వెళ్లి జరిగిన విషయం కుటుంబ సభ్యలకు వివరించింది. తల్లిదండ్రులు వేరే గ్రామానికి చెందిన ఒక ప్రైవేట్ వైద్యుడికి బాలికను చూపించారు. అక్కడే వైద్యం చేయించారు.
ఈ ఘటన గురించి పోలీసులకు తెలిసింది. పోలీసులు బాధితురాలి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. గురువారం బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)