BIRRD Surgeries : బర్డ్‌లోఏడుగురు చిన్నారులకు గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు-seven kids successfully operated for cleft lip and cleft palate in birrd ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Birrd Surgeries : బర్డ్‌లోఏడుగురు చిన్నారులకు గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు

BIRRD Surgeries : బర్డ్‌లోఏడుగురు చిన్నారులకు గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు

HT Telugu Desk HT Telugu
Dec 10, 2022 01:18 PM IST

BIRRD Surgeries తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోన్న బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రిసెర్చ్ అండ్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌ ఫర్‌ డిసెబుల్డ్‌ సెంటర్‌ బర్డ్‌లో ఒకేరోజు ఏడుగురు చిన్నారులకు గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు నిర్వహించారు.

బర్డ్‌లో చిన్నారులకు శస్త్ర చికిత్సలు
బర్డ్‌లో చిన్నారులకు శస్త్ర చికిత్సలు

BIRRD Surgeries టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న బర్డ్‌లో ఏడుగురు చిన్నారులకు గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు నిర్వహించారు. బెంగళూరు నుండి వైద్యనిపుణులు చిన్నారులకు శస్త్ర చికిత్సలు నిర్వహించారు. సర్జరీలు చేసిన వైద్యబృందానికి టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి అభినందనలు తెలిపారు.

టిటిడికి చెందిన బర్డ్‌ ఆసుపత్రిలో ఒకేరోజు ఏడుగురు చిన్నారులకు విజయవంతంగా గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఇందుకు గాను వైద్యబృందానికి టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి అభినందనలు తెలియజేశారు. శస్త్రచికిత్సలు చేసిన ఏడుగురు చిన్నారులను శుక్రవారం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా డిశ్చార్జి చేసినట్లు బర్డ్‌ ప్రత్యేకాధికారి డాక్టర్‌ రెడ్డెప్పరెడ్డి తెలిపారు.

ఆసుపత్రిలో ఈ ఏడాది సెప్టెంబరులో గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు ప్రారంభించారు. ఇప్పటివరకు 20 మంది చిన్నారులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించారు.

ఇందులోభాగంగా లోహిత(6 నెలలు), తన్విష్‌(9 నెలలు), నాగహేమ(9 నెలలు), నాగలక్ష్మి(ఒక సంవత్సరం), రేఖ(2 సంవత్సరాలు), జాహ్నవి(3 సంవత్సరాలు), నవీన్‌(12 సంవత్సరాలు) అనే చిన్నారులు డిసెంబరు 5న శస్త్రచికిత్సల కోసం ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారు. డిసెంబరు 7న వీరికి గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు చేశారు.

శస్త్ర చికిత్సలు చేసిన వారిలో ఇద్దరికి మాత్రం పెదవికి, అంగిలికి, నోటిలోపల భాగంలో రెండింటికీ శస్త్రచికిత్సలు చేశారు. చిన్నారుల్ని శుక్రవారం డిశ్చార్జి చేశారు. బెంగళూరుకు చెందిన విజిటింగ్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ ప్రీతమ్‌శెట్టి, డాక్టర్‌ దీపేష్‌ ఎన్‌.రావు, బర్డ్‌ ఆసుపత్రి ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ఝాన్సీ కలిసి ఈ శస్త్రచికిత్సలు చేశారు.

రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన చిన్నారులకు ఈ ఆసుపత్రి ఒక వరం లాంటిదని, మరింత మంది నిరుపేదలు ఈ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని బర్డ్‌ ప్రత్యేకాధికారి డాక్టర్‌ రెడ్డెప్పరెడ్డి కోరారు.

టాపిక్