NRI Prostitution: అమెరికాలో వ్యభిచారం అభియోగాలతో ఐదుగురు తెలుగు యువకులు సహా ఏడుగురు భారతీయుల అరెస్ట్-seven indians arrested in prostitution sting including five telugus from denton texas ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nri Prostitution: అమెరికాలో వ్యభిచారం అభియోగాలతో ఐదుగురు తెలుగు యువకులు సహా ఏడుగురు భారతీయుల అరెస్ట్

NRI Prostitution: అమెరికాలో వ్యభిచారం అభియోగాలతో ఐదుగురు తెలుగు యువకులు సహా ఏడుగురు భారతీయుల అరెస్ట్

Sarath chandra.B HT Telugu
Aug 22, 2024 09:52 AM IST

NRI Prostitution: అమెరికాలో వ్యభిచార కార్యకలాపాలపై టెక్సాస్‌ పోలీసులు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో భారతీయులు దొరకడం కలకలం సృష్టించింది. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లిన భారతీయ యువకులు వ్యభిచార కేసుల్లో చిక్కుకోవడం సంచలనం సృష్టించింది. టెక్సాస్ పోలీసులు నిందితుల ఫోటోలను విడుదల చేశారు.

అమెరికాలోని టెక్సాస్‌లో వ్యభిచారం ఆరోపణలపై ఐదుగురు తెలుగు యువకుల అరెస్ట్
అమెరికాలోని టెక్సాస్‌లో వ్యభిచారం ఆరోపణలపై ఐదుగురు తెలుగు యువకుల అరెస్ట్ (AFP)

NRI Prostitution: దేశం కానీ దేశంలో ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం వెళ్లి న తెలుగుయువకులు వ్యభిచారం కేసుల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. స్థానిక చట్టాలపై అవగాహనా రాహిత్యంతో చేసిన పనులకు కటకటాల పాలయ్యారు. రెండు రోజుల క్రితం ఆగస్ట్ 22 తెల్లవారుజామున టెక్సాస్‌ పోలీసులు జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో 18మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పలువురు వ్యభిచారం చేస్తూ పట్టుబడినట్టు అభియోగాలు మోపారు. టెక్సాస్‌ పోలీసులు పట్టుకున్న వారిలో ఐదుగురు తెలుగు యువకులు సహా, ఏడుగురు భారతీయులు ఉన్నారు. మిగిలిన వారిలో ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు.

టెక్సాస్‌లోని డెంటన్‌కు చెందిన ఐదుగురు తెలుగు యువకులతో సహా ఏడుగురు భారతీయులను వ్యభిచార కార్యకలాపాలపై నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.

డెంటన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం నిర్వహించిన వ్యభిచార కార్యకలాపాల నిరోధక స్టింగ్ ఆపరేషన్‌లో ఐదుగురు తెలుగు మూలాలు ఉన్న వ్యక్తులతో సహా ఏడుగురు భారతీయులు అరెస్ట్ అయ్యారు. అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న వారిని లైంగిక చర్యల కోసం అభ్యర్థించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

అమెరికాలో వ్యభిచారం ఆరోపణలతో అరెస్టైన వారిలో టెక్సాస్‌లోని డెంటాన్‌కు చెందిన బండి నిఖిల్‌, గల్లా మోనిష్‌, లిటిల్ ఎమ్‌కు చెందిన అమిత్ కుమార్‌, డెంటాన్‌కు చెందిన కుమ్మరి నిఖిల్, జైకిరణ్ రెడ్డి, రాయపాటి కార్తీక్, శ్రేష్టనబీన్‌ ఉన్నారు.

డెంటన్ కౌంటీలో వ్యభిచారాన్ని అరికట్టడానికి ఉద్దేశించిన స్టింగ్ ఆపరేషన్ ‌లో నార్త్ టెక్సాస్‌కు చెందిన 18 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు గత మంగళవారం టెక్సాస్‌ షెరీఫ్ కార్యాలయం వార్తా ప్రకటన విడుదల తెలిపింది. ఈ ఆపరేషన్‌కు హాయ్‌ల్యాండ్ విలేజ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ మద్దతు ఇచ్చినట్టు వివరించారు.

డెంటన్ నుండి అరెస్టయిన తెలుగు యువకులు…

• నిఖిల్ బండి - అరెస్టును తప్పించుకోడానికి ప్రయత్నించారని అభియోగాలు మోపారు.

• మోనిష్ గల్లా - వ్యభిచారాన్ని కోరినట్లు అభియోగాలు మోపారు.

• నిఖిల్ కుమ్మరి - అరెస్టును తప్పించుకున్నారని అభియోగాలు మోపారు.

• జైకిరణ్ మేకలా - 18 ఏళ్లలోపు మైనర్‌ను వ్యభిచారం చేయమని కోరడం మరియు అరెస్టును తప్పించుకోవడం వంటి అభియోగాలు మోపబడ్డాయి.

• కార్తీక్ రాయపాటి - వ్యభిచారం చేస్తున్నారని అభియోగాలు మోపారు.

ఈ ఆపరేషన్ సమీపంలోని నగరాలకు చెందిన ఇతర వ్యక్తులపై ఆరోపణలకు దారితీసింది. వ్యభిచారాన్ని కోరడం టెక్సాస్‌ రాష్ట్ర చట్టాల ప్రకారం జైలు శిక్షలకు అర్హమైన నేరంగా వర్గీకరించారు. మైనర్‌తో లైంగిక సంబంధం కోసం అభ్యర్థించడం రెండవ డిగ్రీ నేరంగా పరిగణిస్తారు. అరెస్టును తప్పించుకోవడం, చట్టవిరుద్ధంగా ఆయుధాన్ని తీసుకెళ్లడాన్ని క్లాస్ A దుష్ప్రవర్తనగా పరిగణిస్తారు.

టెక్సాస్‌లో భారతీయ యువకుల అరెస్టులు స్థానిక సమాజంలోని ఆందోళనలను హైలైట్ చేశాయి. ముఖ్యంగా డెంటన్‌లోని అభియోగాలకు గురై అరెస్టైన వ్యక్తులలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. వ్యభిచార కార్యకలాపాలలో నిమగ్నమైన ఇతరులను గుర్తించేందుకు మానవ అక్రమ రవాణా విభాగం ద్వారా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించినట్టు షెరీఫ్ కార్యాలయం వివరించింది. భారతీయ యువకులు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి వ్యభిచార కార్యకలాపాల్లో అరెస్టు కావడం సంచలనం సృష్టించింది.