Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. అతివేగంతో ముగ్గురు యువకులు బలి-serious road accident in chittoor district three youths killed due to over speeding ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. అతివేగంతో ముగ్గురు యువకులు బలి

Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. అతివేగంతో ముగ్గురు యువకులు బలి

HT Telugu Desk HT Telugu
Jul 19, 2024 11:21 AM IST

Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ద్విచ‌క్ర వాహ‌నాన్ని అతి వేగంగా వ‌చ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో అక్క‌డిక్క‌డే ముగ్గురు మృతి చెందారు.

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల మృతి
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల మృతి

Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ద్విచ‌క్ర వాహ‌నాన్ని అతి వేగంగా వ‌చ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో అక్క‌డిక్క‌డే ముగ్గురు మృతి చెందారు. లారీ డ్రైవ‌ర్ అతి వేగం కార‌ణంగా ముగ్గురు ప్రాణాలు గాలిలో క‌లిసిపోయాయి. మ‌రొక‌రికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఈ ఘోర ఘ‌ట‌న గురువారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో చిత్తూరు-క‌ర్నూలు జాతీయ ర‌హ‌దారిపై దామ‌ల‌చెరువు పంచాయ‌తీ ప‌త్తిపాటివారి ప‌ల్లి అక్క‌గార్ల గుడి వ‌ద్ద జ‌రిగింది. ఐరాల మండ‌లం వేద‌గిరివారి ప‌ల్లి పంచాయ‌తీ రామ‌తీర్థ‌సేవాశ్ర‌మ ఎస్టీ కాల‌నీ నుంచి దామ‌ల‌చెరువ‌కు ద్విచ‌క్ర వాహ‌నంపై న‌లుగురు యువ‌కులు బ‌య‌లుదేరారు. అయితే పాత అక్క‌గార్ల గుడి వ‌ద్దకు వ‌చ్చే స‌రికి వారు ప్ర‌యాణిస్తున్న ద్విచ‌క్ర వాహ‌నాన్ని ఎదురుగా అతివేగంతో వ‌చ్చిన తమిళనాడుకు చెందిన లారీ ఢీకొట్టింది.

అంతేకాకుండా ఆ ద్విచ‌క్ర వాహ‌నాన్ని దాదాపు 150 మీట‌ర్ల మీర ముందుకు ఈడ్చుకుంటూ వెళ్లి మ‌ర్రి చెట్టు వ‌ద్ద ఆగింది. అతివేగం కార‌ణంగానే డ్రైవ‌ర్ అదుపులో లారీ లేకుండా పోయింది. ద్విచ‌క్ర వాహ‌నంతో పాటు దానిపై ప్ర‌యాణిస్తున్న‌ యువ‌కుల‌ను కూడా ఈడ్చుకుపోయింది. ఈ రోడ్డు ప్ర‌మాదంలో రామ‌తీర్థ‌సేవాశ్ర‌మ ఎస్టీ కాల‌నీకి చెందిన నారాయ‌ణ (34), జ‌య‌చంద్ర (38), చుక్కావారి ప‌ల్లి ఎస్టీ కాల‌నీకి చెందిన నాగ‌మ‌ల్ల‌య్య (14) అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. లారీ కింద వారి మృత‌దేహాలు ల‌భ్యం అయ్యాయి. లారీ కింద మృత‌దేహాలు న‌లిగిపోయి ఉన్నాయి.

వీరిలో మ‌నోజ్ అనే యువ‌కుడు తీవ్ర గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. తీవ్ర గాయాలు పాలైన మ‌నోజ్‌ను 108 అంబులెన్స్ ఎక్కించి కొత్త‌పేట ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఈ రోడ్డు ప్ర‌మాదంతో ఆ ప్రాంత‌మంతా భ‌యాన‌క వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పించింది. చిమ్మ‌చీక‌ట్లో ఏం జ‌రిగిందో అక్క‌డి వారికి తెలియ‌లేదు. ఆ ర‌కంగా విషాదం ఘ‌ట‌న చోటు చేసుకుంది. స‌మాచారం అందుకున్న పాకాల పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. అక్క‌డ ఘ‌ట‌న జ‌రిగిన తీరును పరిశీలించారు.

లారీ డ్రైవ‌ర్ అతివేగం, ద్విచ‌క్ర వాహ‌నంపై ప‌రిమితికి మించి ప్ర‌యాణించ‌డం వ‌ల్లే ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్నారు. మృతుడు జ‌య‌చంద్రకు భార్య‌తో పాటు ఇద్ద‌రు అమ్మాయిలు, ఇద్ద‌రు అబ్బాయిలు ఉన్నారు. నారాయ‌ణ‌కు భార్య శైలు, ఆమె ప్ర‌స్తుతం గ‌ర్భిణి. నాగ‌మ‌ల్ల‌య్య‌కు త‌ల్లిదండులు ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌తో వారి కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. కుటుంబ స‌భ్యులు రోద‌న‌లు మిన్నంటాయి.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)Ht

Whats_app_banner