నంబాల కేశవరావును వారే పట్టించారు.. మావోయిస్టుల సంచలన లేఖ.. 9 ముఖ్యమైన అంశాలు-sensational letter from maoists about nambala keshava rao encounter 9 key points ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  నంబాల కేశవరావును వారే పట్టించారు.. మావోయిస్టుల సంచలన లేఖ.. 9 ముఖ్యమైన అంశాలు

నంబాల కేశవరావును వారే పట్టించారు.. మావోయిస్టుల సంచలన లేఖ.. 9 ముఖ్యమైన అంశాలు

నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ తర్వాత కీలక విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా మావోయిస్టులు సంచలన లేఖ విడుదల చేశారు. నంబాల కేశవరావును కొందరు కుట్రపూరితంగా పట్టించారని ఆరోపించారు. కీలక సభ్యుడి సమాచారంతోనే నంబాల ఎన్‌కౌంటర్ సులభం అయ్యిందన్నారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన 9 అంశాలు ఇలా ఉన్నాయి.

నంబాల కేశవ రావు (ఫైల్ ఫొటో)

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్‌ సరిహద్దులో.. ఈ నెల 21న ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బస్వరాజ్‌ అలియాస్‌ బీఆర్‌ దాదా అమరులయ్యారు. ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని.. ఆ పార్టీ దండకారణ్యం ప్రత్యేక జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్‌ ఆరోపించారు.

ముఖ్యమైన 9 అంశాలు..

1.వికల్ప్‌ పేరిట ఒక ప్రకటన విడుదలైంది. 21న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అందులో నంబాల కేశవరావు సహా 28 మంది మావోయిస్టులు చనిపోయారు. వారిలో ఒకరి మృతదేహాన్ని తాము తీసుకెళ్లామని వికల్ప్ స్పష్టం చేశారు.

2.నంబాల కేశవరావు అబూజ్‌మడ్‌లో ఉన్నట్లు ఆరు నెలల ముందే పోలీసులకు తెలుసు. లొంగిపోయిన కొందరు మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో ఆయన్ను లక్ష్యంగా చేసుకొని.. జనవరి, ఫిబ్రవరి నెలల్లోనూ పోలీసులు దాడులు చేసినా ఫలించలేదని వికల్ప్ వివరించారు.

3 ఈ నేపథ్యంలో మరో ఆరుగురు సభ్యులు పోలీసులకు లొంగిపోయారు. వారిలో నంబాలకు రక్షణ కల్పిస్తున్న యూనిట్‌లోని కీలక సభ్యుడు ఉన్నాడు. అతనితో పోలీసుల పని సులువైందని వికల్ప్ లేఖలో ఆరోపించారు.

4.ఓర్సా నుంచి నారాయణపుర్, కండగావ్‌ల వైపు డీఆర్‌జీ సిబ్బందిని మే 17న మోహరించారు. 18న దంతెవాడ, బీజాపుర్‌ల వైపు నుంచి బలగాలు లోనికి ప్రవేశించాయి. 19న ఉదయం 9 గంటలకు వారు కేశవరావుకు రక్షణ కల్పిస్తున్న యూనిట్‌కు సమీపించారు. అప్పుడు కాల్పులు మొదలయ్యాయి.

5.అదే రోజు మొత్తం ఐదు ఎన్‌కౌంటర్లు జరిగాయి. కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈలోపు మరో 20 వేల మంది పోలీసులు నంబాల కేశవరావు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు.. అని వికల్ప్ లేఖలో వివరించారు.

6.సాయుధ బలగాలు పెద్దఎత్తున కాల్పులు మొదలుపెట్టారు. వారికి హెలికాప్టర్ల ద్వారా ఆహారం, నీరు అందింది. లోపల చిక్కుకున్న విప్లవకారులు 60 గంటలుగా తిండీ, నీరు లేక అలమటించారు. 35 మంది మాత్రమే ఉన్నప్పటికీ.. కేశవరావును సురక్షిత ప్రాంతంలో ఉంచి ప్రతిఘటించారు. కొంత విరామం తర్వాత తమవైపు కమాండర్‌ చందన్‌ మరణించారని లేఖలో చెప్పారు.

7.అనేక మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో తమ సభ్యులు కొందరు ఒక బృందంగా ఏర్పడి ముందుకు సాగుతూ... భద్రతా వలయాన్ని ఛేదించగలిగారు. కానీ భారీ కాల్పుల కారణంగా వెనుకవైపున్న మిగతా సభ్యులు ముందుకు రాలేకపోయారు. ఈ క్రమంలో 35 మందిలో 28 మంది చనిపోయారు. కేశవరావును సజీవంగానే పట్టుకొని కాల్చి చంపారు. ఏడుగురు సురక్షితంగా తప్పించుకున్నారు.. అని వికల్ప్ వివరించారు.

8.నంబాల కేశవరావును రక్షించుకోవడంలో పార్టీ విఫలమైందన్న విషయాన్ని అంగీకరిస్తున్నాం. ఆయనకు రక్షణగా 60 మంది సభ్యులుంటే.. వ్యూహంలో భాగంగానే ఆ సంఖ్యను 35కు తగ్గించాం. ఎన్‌కౌంటర్‌ సమయంలో సురక్షిత ప్రాంతానికి తరలించాలని చూసినప్పటికీ.. ఆయన అంగీకరించలేదు.. అని వికల్ప్ స్పష్టం చేశారు.

9.తాను ఈ బాధ్యతను రెండు, మూడేళ్లు మాత్రమే చూడగలనని.. తన గురించి ఆలోచించకుండా భవిష్యత్తులో పార్టీని నడిపించాల్సిన యువ నాయకత్వం భద్రతపై శ్రద్ధ పెట్టాలని నంబాల కేశవరావు సూచించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆయన చివరి నిమిషం వరకు పోరాడుతూ.. అందరికీ మార్గదర్శనం చేశారు అని వికల్ప్ తన లేఖలో వివరించారు.

సంబంధిత కథనం