వేసవి సెలవుల్లో ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతలు చేపట్టనున్నారు. ఈలోపు జిల్లాల వారీగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా తయారు చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులను ఇప్పటికే ఆదేశించింది. అందులో భాగంగానే అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులు ఉపాధ్యాయ సీనియరిటీ జాబితా తయారు చేశారు. వాటిని జిల్లా స్థాయిల్లోనే విడుదల చేశారు.
తొలుత ఫిబ్రవరి 20న అన్ని జిల్లాల్లో సీనియారిటీ జాబితాను విడుదల చేశారు. అయితే ఆయా జాబితాల్లో తప్పులు తడకలుగా ఉండటంతో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తంచేశాయి. దీంతో రాష్ట్ర స్థాయిలో విద్యా శాఖ కమిషనర్ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో సీనియారిటీ జాబితాల్లో తప్పులను సరిదిద్దాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో తప్పులను తడకలను సరిదిద్ది మళ్లీ జాబితాను విడుదల చేయాలని రాష్ట్ర విద్యా శాఖ కమిషనర్ అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారి (డీఈవో), రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్‌జేడీ) ఆదేశాలు ఇచ్చారు.
దీంతో విద్యా శాఖ అధికారులు తలమునకలై మళ్లీ సీనియారిటీ జాబితాను తయారు చేశారు. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (టీఐఎస్) ద్వారా ఉపాధ్యాయులు వ్యక్తిగత, సర్వీసుకు సంబంధించిన సమగ్ర వివరాల ఆధారంగా జాబితాను తయారు చేశారు. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, పుర పాలక, నగరపాలక పాఠశాల్లో పని చేసే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను రూపొందించారు. వీటిని జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈవో), రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్‌జేడీ) కార్యాలయ వెబ్‌సైట్‌లతో పాటు, నోటీసు బోర్డులలో అందుబాటులో ఉంచారు.
ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే ఈనెల 26వ తేదీలోపు డీఈవో, ఆర్‌జేడీ కార్యాలయంలో లిఖితపూర్వకంగా అందజేయాల్సి ఉంటుంది. అభ్యంతరం తెలిపే ఉపాధ్యాయుడి పూర్తి పేరు, హోదా, సీనియారిటీ జాబితాలో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనడంతో పాటు సంబంధిత ఆధారాలు జత చేయాల్సి ఉంటుంది. గడువు ముగిశాక వచ్చే అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోరు. గడువులోపు వచ్చిన అభ్యంతరాలను ఫిర్యాదుల కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు.
రాష్ట్రంలో 44 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 1.80 లక్షల మంది ఉపాధ్యాయులు విధుల్లో ఉన్నారు. అయితే రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలో గత కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. గత ప్రభుత్వం చేసిన ఉపాధ్యాయ బదిలీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసింది. దీంతో గత ప్రభుత్వం చేసిన బదిలీలు కూడా ఆగిపోయాయి. అప్పటి నుంచి ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే అనేక అడ్డంకులు నేపథ్యంలో బదిలీలు తాత్కాలికంగా వాయిదా పడుతూ వస్తున్నాయి.
అయితే వచ్చే వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖ అధికారులు తయారు చేశారు. ఈ కసరత్తును ఉమ్మడి జిల్లాల నోడల్ అధికారి కేడర్‌లో ఉన్న డీఈవోల ఆధ్వర్యంలో జరిగింది. ఆయా జిల్లాల్లో సీనియారిటీ జాబితాను తయారు చేయడానికి వివిధ కేడర్ ఉపాధ్యాయులతో కూడిన ప్రత్యేక బృందాలను నియమించారు. ఒక్కో బృందానికి ఇద్దరు చొప్పున ఏర్పరచుకుని తప్పులు దొర్లకుండా చూశారు. అనంతరం డీఈవో కార్యాలయాల్లో ఆన్‌లైన్‌లో అప్లోడ్ ప్రక్రియ చేశారు.
1989 సంవత్సరం డీఎస్సీ నుంచి 2018 సంవత్సరం డీఎస్సీ వరకు కేడర్ వారీగా సీనియారిటీ జాబితాలను సిద్ధం చేశారు. ఉపాధ్యాయుల నుంచి వారి విద్యార్హత, డీఎస్సీ పోటీ పరీక్షలో లభించిన మార్కులు తదితర వివరాల ఆధారంగా సీనియారిటీ జాబితాను తయారు చేశారు.
సంబంధిత కథనం