Dy CM Pawan: పవన్ పర్యటనలో భద్రతా వైఫల్యం, మన్యంలో నకిలీ ఐపీఎస్ హల్‌చల్, విచారణకు ఆదేశించిన హోంమంత్రి
Dy CM Pawan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం జిల్లా పర్యటనలో భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. ఇటీవల మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా నకిలీ ఐపీఎస్ పవన్ పర్యటన ఆద్యంతం హంగామా చేయడం వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతంపై విచారణకు జరుగుతోంది.
Dy CM Pawan: జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవలి మన్యం జిల్లా పర్యటనలో నకిలీ IPS హల్‌చల్ చేయడం కలకలం రేపింది. పవన్ కళ్యాణ్ పర్యటన ఆసాంతం నకిలీ ఐపీఎస్ అధికారి వెన్నంటి ఉన్నాడు. భద్రతా సిబ్బందితో ఫోటోలకూ కేటుగాడు ఫోటోలకు ఫోజులిచ్చారు.
వై కేటగిరీ భద్రతలో ఉన్న డిప్యూటీ సీఎం పర్యటనలో భధ్రతా లోపాలను సోషల్ మీడియాలో కొందరు వెలుగులోకి తీసుకురావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణకు ఆదేశించారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో పర్యటించారు. పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఆయన వెన్నంటే ఉండి ఐపీఎస్ అధికారిలా యూనిఫాంతో ఓ వ్యక్తి కలియతిరిగాడు.
పర్యటన అనంతరం కింది స్థాయి సిబ్బందితో ఫోటోలుకు ఫోజులు ఇచ్చాడు. ఈపర్యటన తర్వాత ఫోటోలు బయటకు రావడంతో అగంతకుడు ఎవరా అని మన్యం జిల్లా పోలీసులు విచారణ జరిపారు. అతను నకిలీ IPS ఆఫీసర్ అని నిర్దారణ కావడంతో శుక్రవారం రాత్రి విజయనగరం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. .
జిల్లాలోని గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్య ప్రకాష్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు జిల్లా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 'మన్యం' పర్యటనలో భద్రతా లోపంపై హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వై కేటగిరీ భద్రతలో ఉన్న పవన్ కళ్యాణ్ చుట్టూ బలివాడ సూర్యప్రకాశరావు పోలీస్ యూనిఫాంలో సంచరించిన గుర్తించలేకపోవడంపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఐపీఎస్ యూనిఫాంలో ఉన్న వ్యక్తికి సెల్యూట్ కొట్టి, ఫోటోలు కూడా దిగడంతో ఉన్నతాధికారులు అవాక్కయ్యారు. నిందితుడు ఎందుకిలా చేశాడో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉపముఖ్యమంత్రి భద్రత లోపంపై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి ఆదేశించారు.