Vande Bharat Express : ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అప్డేట్ - వందే భారత్ కోచ్‌లు డబుల్, భారీగా పెరిగిన సీట్లు..!
AP Telangana Vande Bharat Express : సంక్రాంతి రద్దీ వేళ రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ - విశాఖపట్నం వందేభారత్ కోచ్‌ల సంఖ్యను మరింత పెంచింది. దీంతో సీట్లు భారీగా పెరిగాయి. జనవరి 13 (సోమవారం) నుంచి ఈ అదనపు కోచ్‌లు అందుబాటులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది.
సంక్రాంతి పండగ వేళ తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. రైల్వే స్టేషన్లతో పాటు బస్ స్టాండ్లు, ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా… దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. విశాఖ - సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ రైలు కోచ్ ల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ బోగీలు జనవరి 13వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపింది.
భారీగా పెరిగిన సీట్లు…
హైదరాబాద్ - విశాఖపట్నం - హైదరాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20707/20708) లో కోచ్‌ల ను 8 నుంచి 16కు పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్య 530గా ఉంది. అయితే కొత్త కోచ్ ల జోడింపుతో సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లో సీట్లు సంఖ్య 1128కి పెరగనుందని ప్రకటించింది.
ఇప్పటి వరకు రోజూ 8 బోగీల్లో(1 ఎగ్జిక్యూటివ్, 7 చైర్‌కార్ కోచ్‌లు) 530 మంది ప్రయాణిస్తున్నారు. అయితే తాజా నిర్ణయంతో సీట్ల సంఖ్య 1,128కు చేరనుంది. ఇక నుంచి 14 చైర్‌కార్ కోచ్‌లలో 1,024 మంది, 2 ఎగ్జిక్యూటివ్ కోచ్‌లలో 104 మంది జర్నీ చేస్తారు. ఈ కొత్త బోగీలన్నీ రేపట్నుంచే అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.
సంక్రాంతి రద్దీ వేళ దక్షిణ మధ్య రైల్వే అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రయాణికులకు మరిన్ని సేవలు అందించేలా ఏర్పాట్లు చేశారు. ఓవైపు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురాగా…. అవసరాన్ని బట్టి మరికొన్నింటిని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ప్రధాన రైల్వే స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు, ఎంక్వైరీ కౌంటర్లు ఏర్పాట్లు చేయటంతో పాటు రద్దీని బట్టి పెంచుతున్నారు.
కొనసాగుతున్న వాహనాల రద్దీ:
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు ప్రయాణాలతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ కొనసాగుతోంది. అబ్దుల్లాపూర్మెట్ ఓఆర్ఆర్ వద్ద భారీగా వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. కొత్తగూడెం వరకు ఇదే పరిస్థితి ఉంది.
చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. 10 టోల్ బూత్‌ల ద్వారా ఆంధ్రా వైపు వెళ్తోన్న వాహనాలను పంపిస్తున్నారు. చౌటుప్పల్ చౌరస్తాలో అండర్‌పాస్ పనుల కారణంగా ట్రాఫిక్ జామ్ పెరిగింది. ఇవాళ కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. రద్దీ దృష్ట్యా ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఎంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్ లోని ఎంజీబీస్, జేబీఎస్, దిల్‌సుఖ్ నగర్ బస్టాండ్ లు, ఎల్బీ నగర్ చౌరస్తా రద్దీగా మారాయి.
ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోకుండా తొందరగా వెళ్లేందుకు ఏపీ వైపు వెళ్లే వాహనదారులకు పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నారు. పెద్ద అంబర్ పేట్ (EXIT-11) నుంచి చౌటుప్పల్ మీదుగా చిట్యాల వరకు వాహనాల రద్దీ ఎక్కువగా ఉందని పోలీసులు తెలిపారు. ఘట్కేసర్ (EXIT-9) నుంచి భువనగిరి-వలిగొండ- రామన్నపేట మీదుగా చిట్యాల చేరుకోవచ్చని పోలీసులు వాహనదారులకు సూచించారు. గుంటూరు వైపు వెళ్లేవాళ్లు బొంగులూరు [EXIT-121] గేటు నుంచి ఇబ్రహీంపట్నం-మాల్ - దేవరకొండ మీదుగా గుంటూరు చేరుకోవచ్చని తెలిపారు.
హైదరాబాద్ నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే వాహనదారులు నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై ప్రయాణిస్తూ ఉంటారు. వీళ్లు విజయవాడ హైవే మీదుగా వస్తే హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, చౌటుప్పల్, పంతంగి టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకునే అవకాశం ఉంది.
సంబంధిత కథనం