Police Act: విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాలో సెక్షన్ 30, BNSS 163 అమలు..ఎన్నికలు, పరీక్షల నేపథ్యంలో మే 12 వరకు అమలు
Police Act: విజయవాడ నగరంతో పాటు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్‌ను ప్రకటించారు. ఏప్రిల్ 3 వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికలు, టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఆంక్షలు అమలు చేయనున్నారు.సమావేశాలు,ధర్నాలపై ఆంక్షలు కొనసాగుతాయి.

ఏప్రిల్ 3వరకు విజయవాడలో పోలీస్ ఆంక్షలు
Police Act: విజయవాడలో రెండు నెలల పాటు సెక్షన్ 30 అమలు చేస్తున్నట్టు పోలీస్ కమిషనర్ ప్రకటించారు. పోలీస్ కమీషనరేట్ పరిధిలో ప్రజా జీవనానికి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా మే 12 వరకు ఆంక్షలు కొనసాగుతాయి. శాంతిభద్రతలు పరిరక్షించడానికి ఆంక్షలు విధించినట్టు ప్రకటించారు. పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఫిబ్రవరి 13 నుంచి మే 12 వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్1861 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి.
- నిషేధాజ్ఞలు అమలు ఉన్న సమయంలో పోలీస్ కమీషనరేట్ పరిధి లో ఎటువంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు, నిరసన మరియు ధర్నా కార్యక్రమాలను అనుమతించరు.
- ముందస్తు అనుమతి లేకుండా నిర్వహించకూడదు. నిషేధాజ్ఞలు అతిక్రమించి నిర్వహించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.
- సెక్షన్ 30తో పాటు పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారతీయ నాగరిక సురక్ష సహిత -2023 (BNSS) సెక్షన్ 163 క్రింద నిషేధాజ్ఞలు అమలు చేస్తారు.
- కృష్ణా, గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికలు, టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆంక్షలు విధించారు. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా మరియు సజావుగా శాంతిభద్రతలు కాపాడటానికి ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 3 వరకు బిఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 అమలు చేస్తారు.
- నిషేధాజ్ఞలు అమలులో ఉన్న సమయంలో పోలీస్ కమీషనరేట్ పరిధిలోని ఇబ్రహింపట్నం, భవానిపురం, వన్ టౌన్, టూటౌన్, ఎస్.ఎన్.పురం, ఏ.ఎస్.నగర్, నున్న, గవర్నర్ పేట, సూర్యారావు పేట, కృష్ణలంక, మాచవరం, గుణదల మరియు పటమట పోలీస్ స్టేషన్ల పరిధిలో నలుగురు లేదా అంతకుమించి ఎక్కువ మంది జనం బహిరంగ ప్రదేశాలలో గుమిగూడరాదు.
- కర్రలు,రాళ్ళు మరియు యితర మారణాయుధాలు పట్టుకుని తిరగరాదు. ఈ నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు.