AP Degree Admissions : ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు రెండో విడత కౌన్సిలింగ్ - రిజిస్ట్రేషన్లకు ఆగస్టు 24 ఆఖరు తేదీ
ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది.ఆగస్టు 22 తేదీ నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు అందుబాటులోకి వస్తాయి. ఆగస్టు 24వ తేదీతో ఈ గడువు ముగియనుంది. ఆగస్టు 29వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి రెండో విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఆగస్టు 24 రిజిస్ట్రేషన్లకు ఆఖరు తేదీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, అన్ఎయిడెడ్, అటానమస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సులకు ప్రవేశాలకు సీట్లను భర్తీ చేస్తారు. ఆయా కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీఎంఎస్, బీఎఫ్ఏ, ఒకేషనల్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దాదాపు 800 కాలేజీల్లో బీబీఏ, బీసీఏ, బీఎంఎస్ కోర్సులు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, అటానమస్ డిగ్రీ కాలేజీలు 1,237 ఉన్నాయి. అందులో 3,33,757 అందుబాటులో ఉన్నాయి. అయితే తొలి దశ కౌన్సిలింగ్‌లో 1,27,659 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 2,08,098 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ సీట్లకు రెండో విడత కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సిద్ధమయ్యింది. రెండో దశ పూర్తి అయిన తరువాత మూడో దశ కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తారు.
రెండో దశ కౌన్సిలింగ్ షెడ్యూల్
ఆగస్టు 22 నుంచి 24 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆగస్టు 23 నుంచి 25 వరకు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేస్తారు. అలాగే ఆగస్టు 23 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్ ప్రక్రియ ఉంటుంది. ఆగస్టు 26న వెబ్ ఆప్షన్‌లో ఏమైనా మార్పులు చేసుకోవచ్చు. ఆగస్టు 29న సీట్లు కేటాయింపు చేస్తారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 మధ్య సీటు కేటాయించిన కాలేజీలకు వెళ్లి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://oamdc-apsche.aptonline.in/OAMDC202425/Index లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
అప్లికేషన్ దాఖలు చేసేటప్పుడు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.400, బీసీ విద్యార్థులు రూ.300, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.200 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు చేసేటప్పుడు విద్యార్థులు తమ ఇంటర్మీడియట్ మర్కుల జాబితా, ఇంటర్మీడియట్ టీసీ, పదో తరగతి మార్కుల జాబితా, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్లు, కుల ధ్రువీకరణ పత్రం, ఇతర అవసరమైన పత్రాలు స్కాన్ చేసే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.