సూదూర ప్రయాణికుల కోసం రైల్వే కొత్త సర్వీస్.. చర్లపల్లి-రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి వరకు పొడిగింపు-scr announces new tirupati train connectivity for long distance passengers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  సూదూర ప్రయాణికుల కోసం రైల్వే కొత్త సర్వీస్.. చర్లపల్లి-రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి వరకు పొడిగింపు

సూదూర ప్రయాణికుల కోసం రైల్వే కొత్త సర్వీస్.. చర్లపల్లి-రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి వరకు పొడిగింపు

Anand Sai HT Telugu

దక్షిణ మధ్య రైల్వే(SCR) సెప్టెంబర్ చివరి నుండి చర్లపల్లి-రక్సౌల్-చర్లపల్లి ఎక్స్‌ప్రెస్‌ను తిరుపతి వరకు పొడిగించింది. ఇది యాత్రికులు, సుదూర ప్రయాణికులకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.

ప్రతీకాత్మక చిత్రం

దక్షిణ మధ్య రైల్వే (SCR) చర్లపల్లి–రక్సౌల్–చర్లపల్లి ప్రత్యేక రైలు టెర్మినల్‌లో మార్పును ప్రకటించింది. దాని సేవలను తిరుపతి వరకు పొడిగించింది. ఈ కొత్త సర్వీస్ ఇప్పుడు సికింద్రాబాద్, చర్లపల్లి మీదుగా తిరుపతి–రక్సౌల్–తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా నడుస్తుంది.

సెప్టెంబర్ నెలాఖరు నుండి చర్లపల్లి-రక్సౌల్-చర్లపల్లి ఎక్స్‌ప్రెస్‌ను తిరుపతి వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తిరుపతి–రక్సౌల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (07051) సెప్టెంబర్ 27 నుండి నవంబర్ 29 వరకు ప్రతి శనివారం తిరుపతి నుండి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో, రక్సౌల్–తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్ (07052) సెప్టెంబర్ 30 నుండి డిసెంబర్ 2 వరకు నడుస్తుంది.

ఈ సర్వీస్ రేణిగుంట, కడప, గుంతకల్, ఆదోని, సికింద్రాబాద్, చర్లపల్లి మీదుగా నడుస్తుంది. తరువాత రక్సౌల్ వైపు వెళుతుంది. చర్లపల్లి, రక్సౌల్ మధ్య సమయాల్లో ఎటువంటి మార్పు ఉండదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. తిరుపతి నుండి యాత్రికులు, సుదూర ప్రయాణికులకు కనెక్టివిటీని మెరుగుపరచడం ఈ సర్వీస్ లక్ష్యం అని SCR తెలిపింది.

దక్షిణ మధ్య రైల్వే స్టేషన్ ప్రకారం, రైలు నెం. 07051 తిరుపతి-రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 27 నుండి నవంబర్ 29, 2025 వరకు ప్రతి శనివారం ఉదయం 8:15 గంటలకు తిరుపతి నుండి బయలుదేరి, సోమవారం మధ్యాహ్నం 1:30 గంటలకు రక్సౌల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నెం. 07052 రక్సౌల్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 30 నుండి డిసెంబర్ 2, 2025 వరకు ప్రతి మంగళవారం ఉదయం 8:30 గంటలకు రక్సౌల్ నుండి బయలుదేరి, గురువారం సాయంత్రం 6:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

ఈ పొడిగింపు ప్రధాన పుణ్యక్షేత్రమైన తిరుపతి, భారతదేశం-నేపాల్ సరిహద్దులో ఉన్న రక్సౌల్ మధ్య ప్రత్యక్ష రైలు కనెక్టివిటీని అందిస్తుందని, తద్వారా భక్తులు, వ్యాపారులు, సుదూర ప్రయాణికులకు సౌలభ్యం మెరుగుపడుతుందని భావిస్తున్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.