AP MLC Elections : ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలపై ఈసీ కసరత్తు - ఓటరు నమోదు షెడ్యూల్ విడుదల
AP MLC Elections 2024: ఉభయగోదావరి జిల్లాల్లోని ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి తాజా ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది.నవంబర్ 1లోగా తుది జాబితాను రూపొందించాలని నిర్ణయించింది.
AP MLC Elections 2024: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నిక ఓటరు నమోదు ప్రక్రియకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. తూర్పు-పశ్చిమగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ(శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ) నియోజకవర్గాల ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది.
ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు సెప్టెంబరు 30వ తేదీన ప్రకటన జారీ చేయనున్నారు. అర్హత కలిగిన వారి నుంచి నవంబరు 6 వరకు అప్లికేషన్లను స్వీకరించనున్నారు.
నవంబరు 23వ తేదీన ముసాయిదా జాబితాను వెల్లడిస్తారు. దీనిపై నవంబరు 9వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అన్నింటిని పరిశీలించిన తర్వాత…. నవంబరు 30న తుది జాబితాను అందుబాటులోకి తీసుకురానున్నారు.
తూర్పు-పశ్చిమగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీల పదవీకాలం వచ్చే ఏడాదిలో మార్చిలో పూర్తి కానుంది. వీరితో పాటే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ (శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ)నియోజకవర్గ ఎమ్మెల్సీ పదవీకాలం కూడా ముగుస్తుంది. ఆయా స్థానాల నుంచిఇళ్ల వెంకటేశ్వరరావు, కేఎస్ లక్ష్మణరావు, పాకలపాటి రఘువర్మ ఎమ్మెల్సీలుగా ఉన్నారు.
వచ్చే ఏడాది వీరి పదవీకాలం ముగుస్తుంది. కాబట్టి ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో… ముందస్తుగానే ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ఖరారు చేసింది. ఈ వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వెల్లడించారు.