SC Categorisation: ఏపీలో జిల్లా యూనిట్‌గానే ఎస్సీ వర్గీకరణ, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
SC Categorisation: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా యూనిట్ ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని కూటమి పార్టీల ఎస్సీ ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమాలోచనలు జరిపారు. ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం కోసం కమిషన్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు ఎమ్మెల్యేలకు వివరించారు.
SC Categorisation: ఎస్సీ వర్గీకరణపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో పాటు ఎమ్మార్పీఎస్ డిమాండ్ల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. దీనిపై కూటమి పార్టీలకు చెందిన దళిత ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఎస్సీ వర్గీకరణపై అనుసరించాల్సిన వ్యూహాన్ని చంద్రబాబు ఎమ్మెల్యేలకు వివరించారు.
వర్గీకరణ అమలు చేయడం ద్వారా దళిత ఉపకులాలందరికీ సమాన అవకాశాలు దక్కుతాయని, జానాభా దామాషా పద్దతిలో జిల్లా యూనిట్ గా వర్గీకరణ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు చంద్రబాబు వివరించారు. విద్యా, ఉద్యోగ, నైపుణ్యాభివృద్ది, వ్యాపార అవకాశాలు కల్పించడం ద్వారా సమగ్ర అభివృద్ది సాధ్యమవుతుందన్నారు.
దళిత ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కూటమి పార్టీల దళిత ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చర్చించారు. వర్గీకరణ అమలు ద్వారా దళితుల్లోని ఉప కులాలందరికీ దామాషా ప్రకారం సమాన అవకాశాలు కల్పించి వారికి ఊతం ఇచ్చేలా పనిచేయాల్సిన అవసరం ఉందని సిఎం అన్నారు.
వర్గీకరణపై ఎన్నికల హామీ….
వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పుతో పాటు...ఎన్నికల హామీ కూడా ఉన్నందున కార్యాచరణపై ఎమ్మెల్యేలతో సిఎం చర్చించారు. జనాభా దామాషా పద్దతిలో జిల్లా ఒక యూనిట్ గా వర్గీకరణ అమలు చేస్తామన్నారు. సమైఖ్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు వర్గీకరణ అమలు చేశామని...తరువాత న్యాయ సమస్య కారణంగా ఆ కార్యక్రమం నిలిచిపోయిందని సిఎం గుర్తు చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు వర్గీకరణను అమలు చేయడానికి సిద్ధమయ్యాయని...ఎవరికీ అన్యాయం జరగకుండా జిల్లా ఒక యూనిట్ గా వర్గీకరణ అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సిఎం తెలిపారు.
తెలుగుదేశం దళితులకు మొదటి నుంచీ అండగా ఉందని సిఎం అన్నారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపామని సిఎం గుర్తు చేశారు. 2014 తరువాత జీవో నెంబర్ 25 ద్వారా దళితులకు జనాభా దామాషా ప్రకారం నిధులు ఖర్చుపెట్టామని అన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణపై స్పష్టత వచ్చింది కాబట్టి దీనికి అవసరమైన కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సిఎం తెలిపారు. వర్గీకరణ అమలుపై కమిషన్ వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనితో పాటు దళిత వర్గాన్ని పైకి తెచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాల్సి ఉందని సిఎం అన్నారు.
సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యం…
విద్యా, ఉద్యోగ, నైపుణ్యాభివృద్దితో పాటు వ్యాపార అవకాశాలు కల్పించడం ద్వారా దళిత జాతి సమగ్రాభివృద్ది సాధ్యమవుతుందని సిఎం అన్నారు. 2014లో బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్ తో పాటు అనేక కార్యక్రమాలు అమలు చేసిన విషయాన్ని ఎమ్మెల్యేలు గుర్తు చేశారు. చంద్రన్న బాట పేరుతో ప్రతి దళితవాడలో నాడు సిమెంట్ రోడ్లు వేశారని ఎమ్మెల్యేలు గుర్తుచేశారు. గత 5 ఏళ్లలో దళిత వాడల్లో ఒక్క రోడ్డు కూడా వెయ్యలేదని...ఒక్క టాయిలెట్ కట్టలేదని ఎమ్మెల్యేలు అభిప్రాయ పడ్డారు.
దళిత కుటుంబాల్లో పెద్ద ఎత్తున మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన విషయాన్ని ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. గత 5 ఏళ్లలో దళిత జాతి తీవ్ర అణచివేతకు, వివక్షకు గురయ్యిందని...గత ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాలతో తమ వర్గ ప్రజల జీవన ప్రమాణాలు తీవ్రంగా పడిపోయాయని ఎమ్మెల్యేలు సిఎంకు వివరించారు. అవన్నీ దళిత జాతి ప్రజలు గుర్తు పెట్టుకున్నారని....అందుకే 2019లో జరిగిన తప్పును సరిదిద్దుకుని రెండు తప్ప అన్ని దళిత నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్ధులను గెలిపించారని ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. నేడు గ్రామాల్లో దళితులు కౌలు రైతులుగా సాగు చేస్తున్నారని..వారికి ప్రభుత్వ ప్రయోజనాలు, పథకాలు అందేలా చూడాలని ఎమ్మెల్యేలు కోరారు.
వచ్చే ఐదేళ్లకు కార్యాచరణ…
వచ్చే 5 ఏళ్లలో దళిత వర్గాన్ని నిలబెట్టేందుకు ఏం చేయాలి...వారి సమగ్ర అభివృద్దికి ఎటువంటి విధానాలు అమలు చేయాలనే విషయంపై ప్రత్యేక ఆలోచనలు చేస్తున్నామని సిఎం అన్నారు. మీరంతా స్వశక్తితో ఎదిగి ఇక్కడి వరకు వచ్చారు....నేడు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నారు...మీకు వచ్చిన అవకాశాల ద్వారా దళిత ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిఎం అన్నారు.
మొన్నటి ఎన్నికల్లో 29 ఎస్సీ సీట్లకు గాను 27 నియోజకవర్గాల్లో ప్రజలు గెలిపించారని...వారి నమ్మకాన్ని నిజం చేస్తామని సిఎం అన్నారు. మళ్లీ మీ అందరినీ 2029లో ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటానని సిఎం అన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా ఉంటారా...కంటిన్యూగా ఎమ్మెల్యేగా ఉంటారా అనే విషయం మీ చేతిల్లో కూడా ఉంటుందంటూ సిఎం నవ్వుతూ వ్యాఖ్యానించారు. గెలిపించిన ప్రజల కోసం నిరంతరం పనిచేయాలని ఎమ్మెల్యేలకు సిఎం సూచించారు.