Satysai Crime : స‌త్యసాయి జిల్లాలో దారుణం, ప‌దో తరగతి విద్యార్థినిపై స్కూల్ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు-satya sai district school principal arrested for harassment of 10th grade student ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Satysai Crime : స‌త్యసాయి జిల్లాలో దారుణం, ప‌దో తరగతి విద్యార్థినిపై స్కూల్ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు

Satysai Crime : స‌త్యసాయి జిల్లాలో దారుణం, ప‌దో తరగతి విద్యార్థినిపై స్కూల్ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు

HT Telugu Desk HT Telugu

Satysai Crime : శ్రీసత్యసాయి జిల్లాలో పదో తరగతి విద్యార్థినిపై ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. రాత్రుళ్లు గదికి పిలిచి అసభ్యకరంగా ప్రవర్తి్స్తూ, ఎక్కడ పడితే అక్కడ తాకేవాడు. హాస్టల్ లో ఉన్న బాలికను చూసేందుకు తల్లి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

స‌త్యసాయి జిల్లాలో దారుణం, విద్యార్థినిపై స్కూల్ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు

Satysai Crime : శ్రీ‌స‌త్యసాయి జిల్లాలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. విద్యార్థినిపై ప్రైవేట్ పాఠ‌శాల ప్రిన్సిపల్ లైంగిక వేధింపుల‌కు పాల్పడ్డాడు. రాత్రుళ్లు త‌న గ‌దికి బాలిక పిలిపించుకుని అస‌భ్యక‌రంగా ప్రవ‌రిస్తూ ఎక్కడ ప‌డితే అక్కడ తాక‌డం వంటి చేష్టల‌కు దిగాడు. కుమార్తె ప‌రీక్షలు ఎలా రాస్తోందో తెలుసుకోవ‌డానికి వెళ్లిన‌ త‌ల్లి వ‌ద్ద బాలిక బోరున విల‌పించింది. బాధిత త‌ల్లి ఫిర్యాదు మేర‌కు ప్రైవేట్ పాఠ‌శాల ప్రిన్సిపల్ పై పోక్సో కేసు న‌మోదు చేశారు.

ఈ ఘ‌ట‌న శ్రీ‌స‌త్యసాయి జిల్లా గోరంట్ల మండ‌ల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న మంగ‌ళ‌వారం వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం గోరంట్లలోని హిందూపురం రోడ్డులో ల‌క్ష్మీప‌తి కొన్నేళ్లుగా ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్నారు. ఆ పాఠ‌శాల‌లో అదే మండ‌లానికి చెందిన ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థిని అక్కడే హాస్టల్‌లో ఉంటోంది. ఆ బాలిక ప‌ట్ల ల‌క్ష్మీప‌తి అస‌భ్యక‌రంగా ప్రవ‌ర్తిస్తూ ఎక్కడ ప‌డితే అక్కడ తాక‌డం చేస్తున్నాడు. రాత్రుళ్లు పేరెంట్స్ నుంచి ఫోన్ వ‌చ్చిందంటూ గ‌దిలోకి ర‌మ్మని పిలిచేవాడు. అక్కడ ఒంట‌రిగా ఉన్న బాలిక‌పై అస‌భ్యక‌రంగా ప్రవ‌ర్తించేవాడు. అంతేకాకుండా బాలిక శరీర భాగాల‌పై తాక‌డం వంటివి చేసేవాడు.

దీంతో బాలిక తీవ్ర మ‌న‌స్తాప‌న‌కు లోనైంది. త‌న‌లోతానే కుమిలిపోయింది. త‌న బాధ‌ను ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియ‌క నిరంతరం మ‌ద‌న‌ప‌డుతూ దిగ‌మింగుకుంటుంది. అయితే ల‌క్ష్మీప‌తి ఆగడాలు అంతులేకుండా పోయాయి. మరోవైపు ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షలు రాస్తోన్న ఆ బాలిక చ‌దువు మీద దృష్టి పెట్టలేక న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తోంది. త‌న కుమార్తె ప‌రీక్షలు ఎలా రాస్తోంద‌న‌ని తెలుసుకోవ‌డానికి త‌ల్లి మంగ‌ళ‌వారం హాస్టల్‌కు వెళ్లింది.

తల్లి హాస్టల్ కు రావడంతో వెలుగులోకి

త‌ల్లిని చూసిన ఆ బాలిక బోరున విలపిస్తూ ఆమె వ‌ద్దకు వెళ్లింది. త‌ల్లిని గ‌ట్టిగా హ‌త్తుకుని ఏడుస్తూ తాను హాస్టల్‌లో ఉండ‌లేన‌ని చెప్పింది. దీంతో త‌ల్లి ఏం జ‌రిగింద‌ని బాలిక‌ను ఆరా తీసింది. బాలిక త‌న‌కు ఎదురైన లైంగిక వేధింపుల గురించి త‌ల్లికి వివ‌రించింది. వెంట‌నే త‌ల్లి స్థానిక పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. బాధిత బాలిక త‌ల్లి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి, దర్యాప్తు చేప‌డుతున్నారు.

పెనుకొండ డీఎస్పీ వెంక‌టేశ్వర్లు, మ‌డ‌క‌శిర ట్రైనీ డీఎస్పీ ఉద‌య‌పావ‌ని, స్థానిక సీఐ శేఖ‌ర్ పాఠ‌శాల‌కు వెళ్లి విచార‌ణ జ‌రిపారు. సీఐ ప‌ర్యవేక్షణ‌లో పాఠ‌శాల‌లో సీసీటీవీ పుటేజీలు సేక‌రించారు. నిందితుడు ల‌క్ష్మీప‌తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడిపై క‌ఠినంగా చ‌ర్యలు తీసుకోవాల‌ని బాధిత కుటుంబ స‌భ్యులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే డీఎస్పీ వెంక‌టేశ్వర్లుకు బంజారా సంఘం విన‌తి ప‌త్రం అంద‌జేసి, నిందితుడిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసింది.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

HT Telugu Desk

సంబంధిత కథనం