Sankranthi Celebrations : ఆ గ్రామంలో సంక్రాంతి పండగను జరుపుకోరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Sankranthi Celebrations : సంక్రాంతి.. ఈ పండగ ఏపీలో చాలా స్పెషల్. కానీ.. ఓ గ్రామంలో మాత్రం సంక్రాంతి పూట పచ్చడి మెతుకులే తింటారు. కనీసం స్నానం చేయరు. ఇళ్లు కూడా శుభ్రం చేసుకోరు. అదే అనంతపురం జిల్లాలోని పి.కొత్తపల్లి గ్రామం. ఆ గ్రామంలో సంక్రాంతి ఎందుకు జరుపుకోరో ఓసారి చూద్దాం.
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి చాలా పెద్ద పండగ. ఈ పండుగను ప్రతీ గ్రామంలో ఘనంగా, వైభవంగా జరుపుకుంటారు. వృత్తి ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో స్థిరపడిన వారంతా సొంతూర్లకు వస్తారు. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, భోగి మంటలు, కోడి పందాలు, హరిదాసు కీర్తనలతో పల్లెల్లో సందడి వాతావరణం ఉంటుంది. కానీ.. ఓ గ్రామం మాత్రం సంక్రాంతి పండగను జరుపుకోవడం లేదు.

అతి సాధారణంగా..
రాష్ట్రంలోని ప్రతీ పల్లెల్లో సంక్రాంతి సందడి నెలకొంది. కానీ.. అనంతపురం జిల్లా పి.కొత్తపల్లి గ్రామంలో మాత్రం అసలు పండగ వాతావరణమే కనిపించడం లేదు. ఈ గ్రామ ప్రజలు మామూలు రోజులకంటే అతి సాధారణంగా కనిపిస్తున్నారు. ఆత్మకూరు నుంచి కల్యాణదుర్గం వెళ్లే మార్గంలో ఈ పి.కొత్తపల్లి గ్రామం ఉంటుంది. దాదాపు 300 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి.
సంతకు వెళ్లి..
ఈ గ్రామంలో చాలా ఏళ్లుగా సంక్రాంతి పండుగను జరుపుకోవడం లేదు. దీనికి ఓ కారణాన్ని చెబుతున్నారు పి.కొత్తపల్లి గ్రామస్తులు. చాలా ఏళ్ల కిందట పి.కొత్తపల్లి గ్రామంలో కూడా సంక్రాంతి పండగను జరుపుకునే వారు. ఓసారి సంక్రాంతి పండగ సరుకుల కోసం ఓ వ్యక్తి ఆత్మకూరు సంతకు వెళ్లారు. అక్కడ ఉన్నట్టుండి ఆ కుప్పకూలి ప్రాణం వదిలాడు. ఈ ఘటనను అందరూ సాధారణ ఘటనగానే భావించారు.
మరో ముగ్గురు..
ఆ తర్వాతి రోజు అలాగే సంతకు వెళ్లిన మరో ముగ్గురు కూడా మరణించారు. దీంతో ఆ గ్రామస్థుల్లో భయం మొదలైంది. ఆ తర్వాత వరుసగా పండగకు సంతకు వెళ్లిన వాళ్లు.. వెళ్లినట్లే ప్రాణాలతో తిరిగి రాలేదు. దీంతో వారికి సంక్రాంతి అంటే భయం మొదలైంది. అప్పటి నుంచి సంక్రాంతి పండుగ చేసుకుంటే తమ గ్రామస్థులకు ఏదో ఒక అనర్థం జరుగుతుందని భయపడిపోయారు. అప్పట్నుంచి తమ ఊళ్లో సంక్రాంతి పండగను జరుపుకోవద్దని గ్రామపెద్దలు తీర్మానించుకున్నారు.
తరాలు మారినా..
ఎన్నో తరాలు మారాయి. అయినా.. తమ గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని పి.కొత్తపల్లి గ్రామస్థులు ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. తమ పూర్వీకులు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తున్నారు. అందుకే సంక్రాంతి పండుగ జరిగే మూడు రోజుల పాటు ఇల్లు, వాకిలిని శుభ్రం చేసుకోబోమని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. ఇంటి ముందు ముగ్గులు కూడా వేయరు. పిండి వంటలు చేసుకోరు. కనీసం స్నానాలు కూడా చేయరని అంటున్నారు.