Sankranti Celebrations : సంక్రాంతి సంద‌డంతా గోదావ‌రి జిల్లాల్లోనే-సోష‌ల్ మీడియాలో పండుగ జోష్‌-sankranti celebrations starts in godavari districts social media reels josh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sankranti Celebrations : సంక్రాంతి సంద‌డంతా గోదావ‌రి జిల్లాల్లోనే-సోష‌ల్ మీడియాలో పండుగ జోష్‌

Sankranti Celebrations : సంక్రాంతి సంద‌డంతా గోదావ‌రి జిల్లాల్లోనే-సోష‌ల్ మీడియాలో పండుగ జోష్‌

HT Telugu Desk HT Telugu
Jan 11, 2025 07:38 PM IST

Sankranti Celebrations : గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా సొంతూళ్లకు చేరుకుంటున్నారు. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఏర్పాట్లపై సోషల్ మీడియాలో రీల్స్ హల్ చల్ చేస్తున్నాయి.

సంక్రాంతి సంద‌డంతా గోదావ‌రి జిల్లాల్లోనే-సోష‌ల్ మీడియాలో పండుగ జోష్‌
సంక్రాంతి సంద‌డంతా గోదావ‌రి జిల్లాల్లోనే-సోష‌ల్ మీడియాలో పండుగ జోష్‌

Sankranti Celebrations : మ‌ర్యాద‌లు, ఆతిథ్యం విష‌యంలో గోదారోళ్లా మ‌జాకా అనిపిస్తారు. సంక్రాంతి సంద‌డంతా గోదావ‌రి జిల్లాల్లోనే ఉంటుంది. ఆట‌లు పాటలు, కోడి పందేలు అస‌లు తగ్గేదేలే అంటూ సంబ‌రాలు జ‌రుపుతారు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా సొంతూళ్లకు చేరుకుని ఎంజాయ్ చేస్తారు. మ‌రోవైపు సంక్రాంతి పండుగ‌ ద‌గ్గర ప‌డుత‌న్న స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో పండుగ జోష్ మ‌రింత పెరిగింది.

yearly horoscope entry point

సంక్రాంతి వ‌స్తోంద‌నంటే గోదావ‌రి మ‌ర్యాద‌లే గుర్తొస్తాయి. ఎక్కెడెక్కడో ఉన్న వారంతా పండ‌క్కి వారం రోజుల నుంచి రెండు మూడు రోజుల ముందే వ‌చ్చేస్తారు. వారున్నన్ని రోజులూ వారికి ఎటువంటి లోటూ రాకుండా చూసుకుంటారు. న‌చ్చిన వంట‌కాల‌ను, అరిటాకులో విందు భోజ‌నాలు పెడ‌తారు. ఇంటికి వ‌చ్చిన అతిథుల‌కు గుమ్మం వ‌ద్దే చెంబుల‌తో చేతికి నీళ్లందించి కాళ్లు క‌డుక్కోమ‌ని మ‌ర్యాదుల‌ను ప్రారంభిస్తారు. చేతులు తుడుచుకోవ‌డానికి భుజాల‌పై ట‌వ‌ల్స్ అందిస్తారు. ప్రయాణం బాగా సాగిందా అంటూ మ‌నసు నిండా అభిమానంతో మాట‌లు ప్రారంభిస్తారు. కోడి పందేలు, జాత‌ర‌లు, సినిమాలు, ప‌ల్లె అందాల‌తో సంతోషంగా గ‌డుపుతారు.

ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇత‌ర ప్రాంతాల్లో ఉన్నవారు సంక్రాంతి జ‌రుపుకొనేందుకు రెక్కలు క‌ట్టుకుని ఇక్కడ వాలిపోతున్నారు. వీరితో పాటు తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, ఒరిస్సా, మ‌హారాష్ట్రల‌కు చెందిన వారు కూడా ఈ పండుగ‌కు అతిథులుగా వ‌స్తారు. విదేశాల్లోనూ ముఖ్యంగా గ‌ల్ఫ్ దేశాల్లో ఉపాధి, ఉద్యోగాలు పొందుతున్నవారు సైతం పండుగ స‌మ‌యానికి సొంతూరు వ‌చ్చేలా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

బావ‌ల‌ను ఆట ప‌ట్టిస్తున్న మ‌ర‌ద‌ళ్లు

సంక్రాంతి వ‌స్తోందంటే కొత్తగా పెళ్లైన ఇళ్లల్లో సంద‌డికి అంతులేదు. త‌మ స్తోమ‌త‌కు త‌గ్గుట్టుగా అల్లుడికి తొలి పండుగ గుర్తిండిపోయేలా అత్తింటి వారు మ‌ర్యాద‌లు చేస్తారు. వినూత్న రీతిలో అల్లుడికి స్వాగ‌తం ప‌లుకుతారు. విందులో ఎన్నెన్నో వంట‌కాల‌ను వ‌డ్డించి త‌మ అభిమానాన్ని చాటుకుంటారు. గ‌త ఏడాది భీమ‌వ‌రానికి చెందిన ఒక వ్యాపార వేత్త కుటుంబం త‌మ అల్లుడికి ఏకంగా 173 ర‌కాల వంట‌ల‌తో విందు భోజ‌నం ఏర్పాటు చేసింది. హౌసింగ్ బోర్డు కాల‌నీకి చెందిన మ‌రో కుటుంబం త‌మ‌కు కాబోయే అల్లుడికి వంద ర‌కాల పిండి వంట‌ల‌తో విందు ఏర్పాటు చేశారు.

పండ‌క్కి మొద‌టిసారి వ‌స్తున్న అల్లుడిని భీమ‌వరానికి చెందిన అత్తింటివారు డోలు, స‌న్నాయి మేళంతో ఎడ్ల బండిపై ఊరేగిస్తూ ఇంటికి ఆహ్వానించారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన 29 వంట‌కాల‌తో అల్లుడికి విందు ఏర్పాటు చేసి అబ్బుర‌ప‌రిచారు. కొత్త అల్లుడు మొద‌టిసారిగా పండుగ‌కు ఇంటికి వ‌చ్చే అల్లుళ్ల కోసం ప‌ల్లెల్లో అత్తలు చేసే హ‌డావుడి అంతాఇంతా కాదు. సున్నుండ‌లు, క‌జ్జికాయ‌లు, అరిసెలు, పోకుండాలు, గోరుమిటీలు వంటి ర‌క‌ర‌కాల పిండి వంట‌లు సిద్ధం చేస్తుంటారు. తామేమీ త‌క్కువ తిన్నామా అంటూ మ‌ర‌ద‌ళ్లు బావ‌ల‌ను స‌ర‌దా ప‌ట్టిస్తారు. గాజుల‌తో గారెలు, గోళీల‌తో పొంగ‌డాలు, ఘాటైన మిర‌ప‌కాయ‌ల‌తో బ‌జ్జీలు చేసి బావ‌ల‌ను ఆట‌ప‌ట్టిస్తారు. కొత్త అల్లుడికి ఆతిథ్యంలో త‌క్కువ రానియ్య‌రు. బంధువుల‌కు, బంధాల‌కు గోదారోళ్లు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉంటారు.

పెరిగిన రీల్స్ హడావుడి

సంక్రాంతి పండుగ‌ ద‌గ్గర ప‌డుత‌న్న స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో పండుగ జోష్ మ‌రింత పెరిగింది. సంక్రాంతి సంద‌ర్భంగా గోదావ‌రి జిల్లాల్లో జ‌రిగే ప్రతి కార్యక్రమంపై ఇప్పుడు సోష‌ల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు. ఇళ్లల్లో పిండి వంట‌లు, ఇళ్ల ముందు రంగ‌వ‌ల్లులు, వీధుల్లో గంగిరెద్దులు, హ‌రిదాసుల సంద‌ళ్లు, భోగి మంట‌లు, పిల్లల‌కు పోసే భోగి ప‌ళ్లు, ప‌ట్టు ప‌రికిణిల్లో ప‌డుచు పిల్లల సంద‌డి, గోవు పిడ‌క‌లు, ప్రభ‌ల తీర్థాలు, అమ్మవారి ఆల‌యాల వ‌ద్ద మొక్కులు తీర్చుకోవ‌డం ఇలా ప్రతి ఒక్కటీ రీల్స్‌గా మారి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు.

కోడి పందేలు, గుండాట వంటి క్రీడ‌లు, రికార్డింగ్ డ్యాన్సులు సైతం రీల్స్‌గా మారిపోతున్నాయి. రీల్స్‌కు త‌గిన విధంగా తెలుగు సినిమా పాట‌లు, హాస్య న‌టుల‌తో గోదావ‌రి జిల్లాల సంక్రాంతి మీమ్స్ కూడా న‌వ్వులు పూయిస్తున్నాయి. గోదారోళ్లు యూకే (లండ‌న్‌) టీం గోదారోళ్ల సంక్రాంతి సంబ‌రాలు-2025 పేరుతో వెబ్ పేజీ డిజైన్ చేసింది. సంక్రాంతి పండుగ ఇక ఎన్ని రోజులు, ఎన్ని గంట‌లు, ఎన్ని నిమిషాలు అంటూ కౌంట్‌డౌన్ మొద‌లు పెట్టారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం