శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం జరుగనున్నట్లు పేర్కొంది.
ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘’అభిద్యేయక అభిషేకం’’ అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు.
3 రోజులపాటు శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించిన తరువాత చివరిరోజు ఉభయ దేవేరులతో కలసి శ్రీమలయప్పస్వామివారు బంగారు కవచంలో దర్శనమిచ్చి భక్తులను అలరిస్తారు. జ్యేష్ఠాభిషేకం చివరిరోజు సాయంత్రం సహస్రదీపాలంకరణ సేవ అనంతరం స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు.
మరోవైపు శ్రీవారి మెట్టువద్ద నుండి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. శ్రీవారి మెట్టు వద్ద నుంచి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ కి మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నూతన కౌంటర్లు ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. టోకెన్ల లభ్యత మేరకు ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ప్రారంభం కానుంది.
ఆధార్ చూపించి దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులు శ్రీవారి మెట్టులోని 1200వ మెట్టు దగ్గర స్కాన్ చేసుకోవాలి. శనివారం శ్రీవారి దర్శనం నిమిత్తం శుక్రవారం సాయంత్రం దివ్య దర్శనం టోకెన్లు మంజూరు చేస్తారు. మరోపక్క ఎస్ ఎస్ డి టోకెన్లను కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో వాటి కొరకు నిర్దేశించిన కౌంటర్లలో అందిస్తారు.