Sajjala On MLC Results: అంతా అయిపోలేదన్న సజ్జల.. రాబోయే రోజుల్లో ఆ సీన్ రీపిట్ అంటూ కామెంట్స్ -sajjala ramakrishna reddy reaction mlc election results 2023 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Sajjala Ramakrishna Reddy Reaction Mlc Election Results 2023

Sajjala On MLC Results: అంతా అయిపోలేదన్న సజ్జల.. రాబోయే రోజుల్లో ఆ సీన్ రీపిట్ అంటూ కామెంట్స్

HT Telugu Desk HT Telugu
Mar 19, 2023 06:07 AM IST

AP MLC Results: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. మండలి తమదే అన్న ప్రజలంతా తమ వెంటే ఉన్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ సంబరాలు చేసుకోవడంతోనే అంతా అయిపోలేదన్నారు.

సజ్జల రామకృష్ణారెడ్డి
సజ్జల రామకృష్ణారెడ్డి

Sajjala Ramakrishna Reddy Comments : రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము మంచి ఫలితాలను సాధించామన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడిన ఆయన... టీచర్ల మద్దతును చూరగొన్నామని... రెండు చోట్లా తామే గెలిచామని చెప్పారు. ఈ ఎన్నికల్లో సహజంగా కమ్యూనిస్టులు, యూనియన్లు యాక్టివ్‌గా ఉంటాయని.. కానీ ఈసారి వారంతా తెలుగుదేశానికి మద్దతు పలికినట్లున్నారని వ్యాఖ్యానించారు. పీడీఎఫ్‌ లాంటి వేదికలు తెలుగుదేశం పార్టీకి ఓట్లను బదిలీ చేశాయని... ఈ ఫలితాలను చూసి ఎవరూ సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. జగన్మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు అందుకున్న ఓటర్లు దీంట్లో పాల్గొనలేదని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

"2007లో ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ గెలిచినా.. 2009 సాధారణ ఎన్నికలపై ప్రభావం పడలేదు కదా..? రానున్న రోజుల్లో కూడా అదే సీన్‌ రిపీట్‌ అవుతుంది. 2 స్థానాల గెలుపుతోనే శక్తి పెరిగిందని సంబరాలు చేసుకుంటే చేసుకోనివ్వండి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ పెట్టాక.. సరదాగా పెట్టాం అని అనలేరుగా..? తెలంగాణాలో ఇలానే పోటీ పెట్టి.. ఓటుకు నోటు ఇచ్చి దొరికిపోయారు. టీడీపీ వ్యవస్థల్లోకి ఎలా దూరాలో, ఏ విధంగా దుర్వినియోగం చేయాలనే ఎప్పుడూ ప్రయత్నిస్తుంటుంది. రాయలసీమ పశ్చిమ పట్టభద్రుల నియోజకవర్గంలోనూ ఓట్ల బండిల్స్‌ లో అవకతవకలు చేసినట్లు నిరూపణ అయింది. దానిపై రీకౌంటింగ్‌ కోసం ఫిర్యాదులు కూడా ఇచ్చారు..ఫైనల్‌ కౌంటింగ్‌ అయిపోయిన తర్వాత దాన్ని పరిగణలోకి తీసుకుంటారా లేదా అన్నది చూడాలి. మేము అయితే ఎన్నికల కమిషన్‌ కి కూడా ఫిర్యాదు చేశాం. ఈ ఎన్నిక అన్ని వర్గాలకూ ప్రాతినిథ్యం వహించదు. ఈ ఎన్నిక అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం వహించేది కాదు. ఇది కేవలం ఒక చిన్న విభాగానికి సంబంధించిన ఎన్నిక మాత్రమే. సహజంగా ఎప్పుడూ ఇలాంటి ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు, యూనియన్లు, అసోసియేషన్లు యాక్టివ్‌ గా ఉంటాయి. వారికి ప్రధాన రాజకీయ పార్టీలు సపోర్ట్‌ చేస్తుండేవి. ప్రతిపక్ష పార్టీలు గతంలో ఈ ఎన్నికల్లో పాల్గొన్నా.. అధికార పార్టీగా మేం మొదటి సారిగా పాల్గొన్నాం. పట్టభద్రులు, టీచర్స్‌ విషయంలో మేం ప్రయోగం చేశాం. టీచర్ల నుంచి మంచి ఆదరణ లభించింది.. తొలిసారి మేం పోటీ చేసినా వారు మమ్మల్ని ఆదరించారు." అని సజ్జల చెప్పారు.

పట్టభద్రుల విషయంలో క్షేత్ర స్థాయిలోకి తమ మెసేజ్‌ తీసుకెళ్లడం, ఆ ప్రత్యేక ఓటర్లను రీచ్‌ కావడంలో కొంత ఇబ్బంది జరిగినట్టు ఉందని సజ్జల వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు మొత్తం సమాజాన్ని ప్రతిబింబిస్తాయి అని తాము అనుకోవడం లేదని... అలా అని దీన్ని తగ్గించాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో మరింత గేర్‌ అప్‌ అవుతామని... ఈసారి కమ్యూనిస్టు పార్టీలతో ఎక్కువగా ఉండే పీడీఎఫ్‌ లాంటి వేదికలు తెలుగుదేశం పార్టీకి ఓట్లను బదిలీ చేశాయని చెప్పారు. వచ్చినవన్నీ తెలుగుదేశం పార్టీ ఓట్లు కావు అని...వారి అభ్యర్థులు కూడా ఎవరికీ పెద్దగా తెలియదని చెప్పారు. వాళ్ల మధ్య ఉన్న అవగాహన వల్ల అన్ని శక్తులు ఏకమవ్వడంవల్ల తెలుగుదేశం పార్టీ లాభపడి ఉంటుందన్నారు.

"మన దగ్గర ఉన్న గ్యాడ్యుయేట్లందరూ ఓట్లు నమోదు చేయించుకోలేదు. జరిగిన నమోదు చాలా తక్కువ. ఇలాంటి వాటిలో చైతన్యంగా ఉండే వారే ఓటు నమోదు చేసుకుంటారు. పీడీఎఫ్‌ లాంటి వారు ఇలాంటి ఎన్నికల్లో మొదటి నుంచి ఉన్నారు. మేం ఇప్పుడే కొత్తగా ఈ ఎన్నికల్లోకి దిగాం. పట్టభద్రులు మినహా ఎన్నికలు జరిగిన అన్నింటినీ గెలుచుకున్నాం..అదనంగా టీచర్లు మాకు మద్దతు పలికారు. 2007లో టీడీపీ గెలిచినా 2009 సాధారణ ఎన్నికలపై దాని ప్రభావం పడలేదు కదా..? 2007లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం టీడీపీ రెండు స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో దాని ప్రభావం ఎమైనా పడిందా...?. లేదు కదా..? పవన్‌ కళ్యాణ్‌తో పొత్తు వల్లనో, ఇంకే కారణంతోనో వాళ్ళ బలం పెరుగిందని సంబరాలు చేసుకుంటే వాళ్ల ఖర్మ. ఈ రెండు స్థానాల గెలుపుతోనే.. వాళ్ళ శక్తి పెరిగిందని సంబరాలు చేసుకుంటే వాళ్ల ఆనందం వాళ్లని పొందనివ్వండి. సమాజంలోని అన్ని రంగాల వారు ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు మాకు ఎటువంటి మద్దతు ఉందనేది పరిగణలోకి తీసుకోవాలి. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డికి ఎంత మద్దతు ఉందో స్పష్టంగా కన్పించింది. రానున్న రోజుల్లో కూడా అదే సీన్‌ రిపీట్‌ అవుతుంది. ఇది ప్రభుత్వ వ్యతిరేకత కానే కాదు..వారంతా ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలతో సంబంధం లేని వర్గాలు. అయినా పట్టభద్రుల ఎన్నికల్లోనూ మాకు తక్కువ ఓట్లేమీ రాలేదు" అని అన్నారు.

తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే లక్షా 30 ఉద్యోగాలు కొత్తగా నియామకాలు చేపట్టడం సాధారణ విషయం కాదన్నారు సజ్జల. ఆ తర్వాత 40వేలకు పైగా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలు, మొన్నటి 6వేలకు పైగా పోలీసు ఉద్యోగాలు ఇచ్చామన్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం