YSRCP : సజ్జలకు మరోసారి జగన్ పట్టం..! వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియామకం
వైసీపీలో కీలక నేతగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ పార్టీ అధినేత జగన్ మరోసారి కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా నియమించారు. ఈ మేరకు వైసీపీ అధినాయకత్వం ఆదేశాలను జారీ చేసింది. మొన్నటి వరకు అటు పార్టీలో, మరోవైపు ప్రభుత్వంలో సజ్జల కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీలో ప్రక్షాళన కొనసాగుతోంది. కొత్త కమిటీలను ప్రకటించటమే కాకుండా… నియోజకవర్గాల బాధ్యులను కూడా మారుస్తున్నారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ఇక పార్టీ అనుబంధంగా ఉండే కమిటీలను కూడా పూర్తిస్థాయిలో మారుస్తున్నారు.
రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా సజ్జల - జగన్ ఆదేశాలు
తాజాగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డిని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా నియమించారు. నిజానికి వైసీపీలో అత్యంక కీలక నేతల్లో సజ్జల ఒకరిగా ఉన్నారు. మొన్నటి ప్రభుత్వంలో జగన్ తర్వాత… సజ్జలనే కీలకంగా వ్యవహరించానే టాక్ కూడా ఉంది.
జగన్ క్యాంప్ కార్యాలయం వ్యవహారాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో కూడా సజ్జల కీలకంగా ఉన్నారు. పార్టీ తీసుకునే నిర్ణయాలతో పాటు ప్రభుత్వ నిర్ణయాలను కూడా దాదాపుగా ఆయనే వెల్లడించే పరిస్థితులు ఉండేవి. దీనికితోడు ఆయన ప్రభుత్వ సలహాదారుడిగా కూడా వ్యవహరించారు. ఓ రకంగా ఆయన షాడో సీఎంగా వ్యవహరించన్న అభిప్రాయాలు కూడా అప్పట్లో వ్యక్తమయ్యాయి.
ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవి చూసింది. 175 స్థానాలకుగాను కేవలం 11 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందడానికి సజ్జల ప్రధాన కారణం అన్న చర్చ కూడా జరిగింది. పార్టీ అధినేత జగన్ ను కలవకుండా అడ్డుగోడలా వ్యవహరించే వారన్న చర్చ కేడర్ లో జరిగింది. సజ్జలపై సొంత పార్టీ కార్యకర్తలతో పాటు జగన్ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో సజ్జలను జగన్ పక్కనపెట్టేస్తారనే చర్చ పార్టీలో జోరుగా జరిగింది. అయితే కానీ అందుకు భిన్నంగా… సజ్జలకు మరోసారి వైఎస్ జగన్మోన్ రెడ్డి పట్టం కట్టారు. పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించారు. రాష్ట్రస్థాయి కోఆర్డినేటర్ పదవిని కట్టబెడుతూ ఆదేశాలను జారీ చేశారు. సజ్జల నియామకం పార్టీలో మరోసారి చర్చనీయాంశంగా కూడా మారింది.
సజ్జల నియామకంతో పాటు మరికొందరికి కూడా జగన్ కొత్త బాధ్యతలు అప్పగించారు.ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చింతాడ రవికుమార్ ను నియమించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కు బాధ్యతలు కట్టబెట్టారు. ఇక ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చుండూరు రవిబాబును నియమించారు.