మద్యం కేసుల్లో అక్రమాలకు పాల్పడిన కేసులో బెయిల్‌పై ఉన్న చంద్రబాబు తమ మీద తప్పుడు కేసులు పెడుతున్నారని, గతంలో చేసిన అక్రమాలను జస్టిఫై చేసుకుంటూ అక్రమాలను కొనసాగించడానికి కేసులు పెడుతున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకోడానికి కేసులు పెడుతున్నారని, జూన్ 4న ఏపీలో వెన్నుపోటు దినంగా నిరసనలకు పిలుపునిచ్చారు.
వైఎస్సార్సీపీ జగన్‌కు పోరాటాలు కొత్త కాదని, అప్పట్లో అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇబ్బందులు పెడితేనే వైఎస్సార్సీపీ పార్టీ పుట్టిందని గుర్తు చేశారు. చంద్రబాబు కేసులు కప్పి పుచ్చేందుకు ఈ కేసులు పెట్టారని ఆరోపించారు. భేతాళ విక్రమార్క కేసులతో ఏమి జరగదన్నారు. చంద్రబాబుకు మొట్టికాయలు తప్పవన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు, షాపులు మొత్తం తీసేసి, దుకాణాలకు ఇచ్చే కమిషన్లను పెంచడం స్కామ్ కాదా అని ప్రశ్నించారు. ప్రైవేట్ మాఫియాకు మద్యం దుకాణాలను అప్పగించిన తర్వాత వారి కమిషన్ పెంచడంలో స్కామ్ కాదా అని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రశ్నించారు.
బేవరేజీస్ కార్పొరేషన్ సత్యప్రసాద్ సాధారణ ఉద్యోగి, అనూష ఔట్ సోర్సింగ్ క్లరికల్ ఉద్యోగి అని వాళ్లను బెదిరించి వాంగ్మూలాలు తీసుకున్నారని, ఎండీ వాసుదేవ రెడ్డి ప్రభుత్వం తనను వేధిస్తోందని హైకోర్టులో మూడుసార్లు యాంటిసిపేటరీ బెయిల్ దరఖాస్తు చేశాడని, చివరకు అతడిని బెదిరించి లొంగదీసుకుని, స్టేట్‌మెంట్ ఇచ్చిన తర్వాత వారికి అనుకూలంగా స్టేట్‌మెంట్ తీసుకున్న తర్వాత బదిలీపై వెళ్లడానికి ఎన్వోసి ఇచ్చారని, వాటికి విలువ ఏముంటుందని ప్రశ్నించారు.
విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయాడని, మూడున్నరేళ్ల సమయం ఉండగానే చంద్రబాబుకు మేలు చేసేందుకు రాజ్యసభకు రాజీనామా చేశాడని, వైఎస్సార్సీపీకి బలం లేదని, మళ్లీ వైసీపీ రాజ్యసభకు వెళ్లే అవకాశం లేదని తెలిసే చంద్రబాబు ప్రలోభాలకు లోనై అమ్ముడుపోయాడని జగన్ ఆరోపించారు. సాయిరెడ్డి లాంటి వాళ్లు ఇచ్చే ప్రకటనలకు ఏమి విలువ ఉంటుందన్నారు.
లిక్కర్ స్కామ్‌లో మరో నిందితుడిగా చెబుతున్న రాజ్ కసిరెడ్డికి బేవరేజీస్ కార్పొరేషన్‌కు ఏమి సంబంధం ఉందని జగన్ ప్రశ్నించారు.అతను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో ఒకరని, రెండేళ్ల తర్వాత ఎక్స్‌టెన్షన్ ఇచ్చింది లేదని, రాజ్ కసిరెడ్డి ప్రస్తుతం టీడీపీ ఎంపీ కేశినేని చిన్నితో కలిసి వ్యాపారాలు చేసేంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఇద్దరు కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయని జగన్ ఆరోపించారు.
రాజ్ కసిరెడ్డికి టీడీపీతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో అతడిపై ఒత్తిడి తీసుకొచ్చి, ప్రలోభాలు పెట్టి అప్రూవర్‌గా మార్చి, వ్యతిరేకంగా అబద్దాలు చెప్పమని ఒత్తిడి చేసినా చెప్పకపోవడం వల్ల అరెస్ట్ చేసినట్టు సుప్రీం కోర్టులో పిటిషన్ ఫైల్ చేసినట్టు జగన్ ఆరోపించారు.
ప్రభుత్వం కోరినట్టు స్టేట్‌మెంట్ ఇచ్చి ఉంటే వాసుదేవరెడ్డి మాదిరే రాజ్ కసిరెడ్డిని కూడా వదిలేసి ఉండేవారన్నారు. అందరూ కలిసినట్టు గూగుల్ టేకౌట్స్‌లో నిరూపించాలని సవాలు చేశారు. తప్పుడు వాంగ్మూలాలతో కుట్రలు చేసి భేతాళ కుట్రలు చేసి అరెస్ట్‌లు చేయాలని చూస్తున్నారని, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఏమి సంబంధం ఉందని ప్రశ్నించారు. లోక్‌సభలో ఫ్లోర్‌లీడర్‌కు లిక్కర్ స్కామ్‌తో ఏమి సంబంధం ఉంటుందన్నారు.
ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డిలకు లిక్కర్ స్కామ్‌లతో ఏమి సంబంధం ఉందని ప్రశ్నించారు. ఒక్క ఫైల్ సిఎంఓకు వచ్చినట్టు నిరూపించగలరా అని ప్రశ్నించారు. ధనుంజయ్ రెడ్డికి ఎక్సైజ్ శాఖతో సంబంధం లేదని, సిఎంఓలో ఫైల్ సర్క్యూలేట్ అయినట్టు చంద్రబాబు నిరూపించాలన్నారు.
బాలాజీ గోవిందప్ప మల్టీ నేషనల్ కంపెనీలో పూర్తి స్థాయి డైరెక్టర్‌గా ఉన్నారని, ఆయన ఏపీలో ఉండరని, తన పనులు చక్కబెట్టేంత ఖాళీ ఉండదని, వికాన్ అనే యూరోప్ కంపెనీకి ఫుల్ టైమ్ డైరెక్టర్‌గా ఉన్నారని చెప్పారు. తన వ్యాపారాలను తన కంపెనీ డైరెక్టర్లతో చేయించుకోగలనని, భారతి సిమెంట్స్‌లో వాటాలు ఉన్నాయనే కారణంతో బాలాజీని వేధిస్తున్నారని జగన్ చెప్పారు.
కూటమి వచ్చాక జిందాల్‌ను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారని, 12దేశాల్లో ఆపరేషన్స్ చేసే కంపెనీ డైరెక్టర్‌ను అరెస్ట్ చేసి ఏమి చెప్పాలని అనుకుంటున్నారని జగన్ ప్రశ్నించారు. యూరోప్‌లో టాప్ సిమెంట్ కంపెనీకి డైరెక్టర్‌ను అక్రమ కేసులో అరెస్ట్ చేశారని, ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేల దెబ్బకు కుమార మంగళ బిర్లా రాష్ట్రానికి నమస్కారం పెట్టారని జగన్ ఎద్దేవా చేశారు.
ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మచ్చలేని అధికారులని, వారి పిల్లలకు పెళ్లి చేసే సమయంలో అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు.పిఎస్సార్ ఆంజనేయులు డీజీ స్థాయి అధికారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని, గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని, పిఎస్సార్ రెండో కొడుక్కి పెళ్లి ఖరారైందని అవతలి వారు ఏమనుకుంటారోనని పిఎస్సార్ సతీమణి ఆందోళన చెందుతుందన్నారు.
ఏపీలో డీజీ సునీల్, అడిషనల్ డీజీ సంజయ్, ఏఎస్పీ విజయ్‌పాల్, ఐజీ కాంతిరాణా, విశాల్ గున్నీ, జాషువా, రవిశంకర్ రెడ్డి, ఐజీ రఘురామిరెడ్డి, రిషాంత్ రెడ్డి సహా 199మందిని పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు డిఎస్పీలు 42, అడిషనల్ ఎస్పీలు 27, సీఐలు 11మందికి పోస్టింగులు లేవన్నారు. ఈ తరహా వేధింపులు గతంలో ఎప్పుడూ లేవన్నారు.
సంబంధిత కథనం