SAAP: ఆరు నెలలుగా జీతాల్లేవ్.. కోచ్‌లు ఇక్కట్లు.. జీవో ఇచ్చి నెల గడుస్తున్న చర్యలు శూన్యం
SAAP: రాష్ట్రంలో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే కోచ్‌లకు ఆరు నెలలుగా జీతాలు లేవు. దీంతో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఉన్న 100 మంది కోచ్‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ముఖ్యమంత్రిని కలిసి విన్నవించినా జీతాలు వేయడం లేదని కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న 100 మంది కోచ్‌లకు ఆరు నెలలుగా జీతాలు అందలేదు. దీంతో కోచ్‌లు, వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. 2017 నుంచి 97మంది కోచ్‌లు ఔట్ సోర్సింగ్ ద్వారా కనీస వేతనాలకు నోచుకోక తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. ఔట్ సోర్సింగ్ కోచ్‌లకు మినిమం టైం స్కేల్ పద్ధతిలో వేతనాలు ఇవ్వాలని యువజన సంఘాలు, కోచ్‌లు అనేకసార్లు ఆందోళన చేశారు.
ఆందోళనలు చేసినా పట్టించుకునే నాధుడే లేడు. ఆరు నెలలుగా జీతాలు లేక.. కుటుంబ పోషణ భారంగా మారిందని కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోచ్‌లకు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు బదిలీలు చేయడం వల్ల.. వారికి ఇచ్చే రూ. 19,500 వేతనం ఏ మాత్రం సరిపోవడం లేదని చెబుతున్నారు. ఛార్జీలు, తిండి ఖర్చులకే సగం జీతం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం క్రీడల్లో వెనుకబడి ఉంది. ఇలాగే కోచ్‌ల పట్ల నిర్లక్ష్యం చేస్తే.. మరింత దిగజారే పరిస్థితి ఏర్పడుతుందని క్రీడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శాప్ పరిధిలో కేవలం 15 మంది మాత్రమే పర్మినెంటు ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం కాంట్రాక్టులో 35 మంది, ఔట్ సోర్సింగ్‌లో 97 మంది కోచ్‌లు పని చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం శాప్‌లో 100 మంది ఔట్ సోర్సింగ్ కోచ్‌ల నియామకానికి జీవో జారీ చేశారు. ఆ జీవో ప్రకారం కాలపరిమితి నాలుగేళ్లు. అయితే.. ఆరు నెలల కిందటే ఆ గడువు ముగిసింది. ఈ సమయంలో.. పునరుద్ధరణకు అనుమతి కోరడంలో శాప్ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫలితంగా జీవో పునరుద్ధరణ జరలేదు. దీంతో కోచ్‌ల జీతాలు ఆపేశారు. ఈ క్రమంలోనే శాప్ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బదిలీ కావడంతో.. ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రద్యుమ్న ఇంఛార్జ్ ఎండీగా వ్యవహరిస్తున్నారు.
జీవో పునరుద్ధరణ కోసం ఇటీవల కోచ్‌లు ధర్నా చేపట్టారు. వెంటనే స్పందించిన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఇంఛార్జ్ ఎండీ ప్రద్యుమ్న జీవో పునరుద్ధరణ చేశారు. 100 మంది కోచ్‌ల ఉద్యోగాలను ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జీవో అయితే ఇచ్చారు కానీ.. జీతాలు మాత్రం ఇవ్వటం లేదు. జీవో ఇచ్చి నెల రోజులు కావస్తున్నప్పటికీ జీతాలు మాత్రం రాలేదని కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు పడకపోవడానికి సీఎంఎఫ్ఎస్ ఖాతాలో నిధులు లేకపోవడమే కారణమని తెలుస్తోంది. సీఎంఎఫ్ఎస్ ఖాతాలో నిధులు జమ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కోచ్‌లు కోరుతున్నారు.
( రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు )