RTGS IVRS: ఆర్టీజీఎస్‌లో అప్పుడు ఇప్పుడు అదే తంతు.. రియల్‌ టైమ్‌ ఫీడ్‌బ్యాక్‌ పేరుతో టోకరా-rtgs is the same thread then and now tokara in the name of real time feedback ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rtgs Ivrs: ఆర్టీజీఎస్‌లో అప్పుడు ఇప్పుడు అదే తంతు.. రియల్‌ టైమ్‌ ఫీడ్‌బ్యాక్‌ పేరుతో టోకరా

RTGS IVRS: ఆర్టీజీఎస్‌లో అప్పుడు ఇప్పుడు అదే తంతు.. రియల్‌ టైమ్‌ ఫీడ్‌బ్యాక్‌ పేరుతో టోకరా

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 06, 2024 11:20 AM IST

RTGS IVRS: రియల్‌ టైమ్ గవర్నెన్స్‌… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక… రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సచివాలయం నుంచి రాష్ట్రంలో ఏ మూల ఏమి జరిగినా క్షణాల్లో తెలుసుకునేలా వ్యవస్థల్ని అనుసంధానించిన టెక్నాలజీ. 2019కు ముందు ఈ వ్యవస్థ ముఖ్యమంత్రి చంద్రబాబును మభ్య పెట్టిందనే విమర్శలు కూడా ఉన్నాయి.

ఏపీలో ప్రహసనంగా మారిన ప్రజల ఫీడ్ బ్యాక్‌ వ్యవహారం
ఏపీలో ప్రహసనంగా మారిన ప్రజల ఫీడ్ బ్యాక్‌ వ్యవహారం

RTGS IVRS: రియల్‌ టైమ్ గవర్నెన్స్‌… ప్రభుత్వ పాలన, ప్రజా సమస్యల పరిష్కారం, పాలనా పరమైన సమస్యల్ని పరిష్కరించడంలో టెక్నాలజీని వినియోగించడంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దేశంలో ముందుంటారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత పౌరసేవల్ని అందించడంలో మిగిలిన రాష్ట్రాలకు చంద్రబాబు ముందుచూపు ఆదర్శంగా నిలుస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రనబాబు ఆలోచనలకు అనుగుణంగా ఏర్పాటైన సాంకేతిక వ్యవస్థల్లో రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ ఒకటి.

yearly horoscope entry point

ప్రభుత్వ యంత్రాంగాలు, శాఖలు అన్నింటిని ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఏక కాలంలో ఏ శాఖలో ఏ అంశాన్నైనా పరిశీలించేలా ఆర్టీజీఎస్‌ వ్యవస్థను తీర్చిదిద్దారు. క్లుప్తంగా చెప్పాలంటే విశాఖ సముద్ర తీర ప్రాంతంలో సముద్ర కెరటాలు, అటుపోట్లను కూడా వెలగపూడిలో కూర్చుని పర్యవేక్షించే అవకాశం ఆర్టీజీఎస్‌లో ఉండేది. తీర ప్రాంతాల్లో అలల తీవ్రత అధికంగా ఉన్న సమయంలో సందర్శకులు ప్రమాదానికి గురైతే ఆర్జీజీఎస్‌ కెమెరాల్లో పరిశీలించి విశాఖ పోలీసుల్ని అప్రమత్తం చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. 2017లో ఆర్టీజీఎస్‌ ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి సమావేశాలు నిర్వహించడానికి మొగ్గు చూపేవారు.

ఆర్టీజీఎస్‌‌కు మరో కోణం కూడా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు టెక్నాలజీ వినియోగంపై ఉన్న మక్కువను కొందరు తప్పుదోవ పట్టించారనే విమర్శలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, పౌర సేవలపై ప్రజల నుంచి నిరంతర ఫీడ్ బ్యాక్ తీసుకోవడాన్ని పాలనలో భాగం చేశారు. ఈ క్రమంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడంలో రికార్డు స్థాయిలో సానుకూల ప్రజాభిప్రాయలు వచ్చినట్టు నివేదికలు అందేవి.

తుఫానులు, ప్రకృతి విపత్తులు, నష్ట పరిహారం, పంటల నష్టం, రైతు సాయం వంటి ఏ విషయంలోనైనా 80శాతం అనుకూల ఫలితాలు వచ్చేవి. వాటిని ముఖ్యమంత్రి కూడా పరిగణలోకి తీసుకునే వారు. ప్రభుత్వం తలపెట్టిన ఏ కార్యక్రమంపై అయినా ఐవీఆర్‌ఎస్ , ప్రజాభిప్రాయ సేకరణ, సంతృప్తి స్థాయిలో ప్రజల మద్దతు తతంగం కొనసాగేది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు ఈ ప్రజాభిప్రాయాలకు ఏమాత్రం పొంతన ఉండేది కాదు. ఈ పొరపాటు ఎక్కడ జరుగుతుందనేది కూడా గుర్తించలేకపోయారు.

మళ్లీ మళ్లీ అదే తంతు…

మెరుగైన పౌర సేవల కోసం నేరుగా లబ్ధిదారుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఇటీవల నిర్ణయించారు. ఐవిఆర్ఎస్ విధానాన్ని విస్తృతంగా ఉపయోగించాలని, ఏ అంశంపైనైనా ప్రజలు చెప్పిందే ఫైనల్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో పాటు క్షేత్ర స్థాయిలో సిబ్బంది పనితీరు ఇబ్బందులు తప్పడం లేదు.

ప్రభుత్వం అమలు చేసే పథకాలపై IVRS పద్ధతిలో ఫోన్లు చేయడం ద్వారా ఆయా కార్యక్రమాల అమలు తీరును తెలుసుకుంటోంది. లబ్ధిదారులకే నేరుగా కంప్యూటర్ బేస్డ్ ఫోన్ కాల్స్ ద్వారా ఆ పథకం వల్ల ప్రయోజనం, దాని అమలు, సేవల్లో నాణ్యత వంటి అంశాలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనుంది. లబ్ధిదారుల నుంచి ఆయా పథకాల అమలుపై వారి అభిప్రాయం కోరుతూ IVRS కాల్స్ వెళతాయి.

ప్రజలు ఇచ్చే రేటింగ్ ఆధారంగా ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసుకుని పని చేయనుంది. ఇంటింటికీ పింఛన్లు, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి పథకాల లబ్దిదారుల నుంచి ఈ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. పింఛను సక్రమంగా ఇంటి వద్దనే అందుతుందా లేదా.....దీపం పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వంటి ప్రశ్నల ద్వారా లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు.

పౌర సేవలపైనా అభిప్రాయ సేకరణ

పథకాలతో పాటు ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీల అమలుపైనా ప్రజాభిప్రాయం తెలుసుకోనున్నారు. ఉచిత ఇసుక విధానం అమలు, మద్యం కొత్త పాలసీ, అమ్మకాలపైనా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. పథకాలు, కార్యక్రమాలతో పాటు రానున్న రోజుల్లో రెవెన్యూ, మునిసిపల్, విద్యుత్ వంటి పలు కీలక శాఖల్లో ప్రజలు పొందుతున్న పౌరసేవలపై కూడా IVRS ద్వారా ప్రజల నుంచి సమాచారం సేకరించనున్నారు.

ప్రజల నుంచి వచ్చే ఈ సమాచారంలో ప్రజలు ఎక్కడైనా అసంతృప్తి వ్యక్తం చేస్తే.. వాటికి గల కారణాలు విశ్లేషించి సేవలను మరింత మెరుగు పరచనున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల్లో కూడా బాధ్యత పెంచి మంచి సేవలు ప్రజలకు అందేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలు చెప్పిందే ఫైనల్ అనే విషయం ప్రాతిపదికన ప్రభుత్వం పనిచేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు ప్రజలు ఒపిగ్గా తమ అభిప్రాయాలు చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుతున్నారు. ఈ ఫోన్ కాల్స్ కు ప్రజలు వెచ్చించే ఒకటి రెండు నిముషాల సమయంతో ప్రభుత్వ నుంచి ఉత్తమ సేవలు పొందే అవకాశం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు.

ఈ క్రమంలో పబ్లిక్ గ్రివెన్స్‌లో ప్రజలు అందించిన ఫిర్యాదులు పరిష్కరించేసినట్టు ఐవీఆర్‌ఎస్‌ కాల్స్ వస్తున్నాయి. ఫిర్యాదులు పరిష్కరించకపోయినా, యథాతథంగా అలాగే ఉన్న వాటిని కూడా గ్రివెన్స్‌ రిడ్రెస్డ్‌ క్యాటగిరీలో చేర్చేస్తున్నారు. ఫిర్యాదుల్ని నిర్దిష్ట వ్యవధిలో పరిష్కరించాలనే నిబంధనలు ఉండటంతో పరిష్కారమైనా లేకపోయినా అర్జీలను ముగిస్తున్నారు. దీంతో ఇదంతా ప్రహసనంగా మారింది.

Whats_app_banner