RTGS ChandraBabu: మళ్లీ అదే తంతు.. చంద్రబాబు మనసెరిగి ఆర్టీజీఎస్‌ నివేదికలు.. కొన్ని శాఖల్లో 90శాతం సంతృప్తి-rtgs chandrababu rtgs reports 90 percent satisfaction in some ap govt departments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rtgs Chandrababu: మళ్లీ అదే తంతు.. చంద్రబాబు మనసెరిగి ఆర్టీజీఎస్‌ నివేదికలు.. కొన్ని శాఖల్లో 90శాతం సంతృప్తి

RTGS ChandraBabu: మళ్లీ అదే తంతు.. చంద్రబాబు మనసెరిగి ఆర్టీజీఎస్‌ నివేదికలు.. కొన్ని శాఖల్లో 90శాతం సంతృప్తి

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 28, 2025 03:15 AM IST

RTGS ChandraBabu: ఏపీ సీఎం చంద్రబాబు మనసెరిగి ప్రవర్తించడం తెలిసిన కొందరు అధికారులు మళ్లీ 2014-19 నాటికి చంద్రబాబును తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్నెల్ల ప్రభుత్వ పనితీరును సమీక్షించే క్రమంలో కొన్ని శాఖల్లో ఆహాఓహో అనేలా నివేదికలు ఇచ్చారు.

ఆర్టీజీఎస్‌పై సమీక్షలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఆర్టీజీఎస్‌పై సమీక్షలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు

RTGS ChandraBabu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనసెరిగి ప్రవర్తించడం ఎలాగో కిటుకు తెలిసిన ఐఏఎస్ అధికారులు ఆల్‌ ఈజ్‌ వెల్ నివేదికలతో సీఎంను ప్రసన్నం చేయడం మొదలు పెట్టారు. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిండా ముంచిన ఆర్టీజీఎస్‌ మళ్లీ పాత పల్లవి అందుకుంది. సచివాలయంలో జరిగిన ఆర్టీజీఎస్‌ సమీక్షలో కొన్ని ప్రభుత్వ శాఖల్లో 90శాతం సంతృప్తి వ్యక్తం అయినట్టు నివేదికలు ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై ప్రజల అభిప్రాయంపై RTGS లో సీఎం సమీక్షించారు. పథకాల లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరును సమీక్షించారు. 10 అంశాలపై ఐవిఆర్ఎస్‌తో పాటు వివిధ రూపాల్లో నేరుగా లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలను సేకరించారు.

పింఛన్ల పంపిణీ, దీపం పథకం అమలు, అన్న క్యాంటీన్ నిర్వహణ, ఇసుక సరఫరా, ఆసుపత్రులు, దేవాయాల్లో సేవలపై వివిధ రూపాల్లో సమాచారం సేకరించినట్టు ఆర్టీజీఎస్‌ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఏపీలో పింఛన్లు పంపిణీపై 90.20 శాతం మంది లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేశారని, ధాన్యం సేకరణలో 89.92 శాతం మంది రైతుల నుంచి సంతృప్తి చెందారని, ..గోనె సంచుల విషయంలో 30 శాతం అసంతృప్తి చెందారని, దేవాలయాల్లో దర్శనాలపై 70 శాతం మంది సంతృప్తి...వసతులపై 37 శాతం భక్తుల్లో అసంతృప్తి వ్యక్తం చేశారని నివేదికలు ఇచ్చారు.

ప్రజలే ఫస్ట్ నినాదంతో

ప్రజలే ఫస్ట్ అనే విధానంలో ప్రజల అభిప్రాయాలు, అంచనాల మేరకు ప్రతి ఉద్యోగి, ప్రతి అధికారి, ప్రతి విభాగం పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్‌ సమీక్షలో సూచించారు. ప్రభుత్వ సేవలపై నేరుగా లబ్ధిదారులు ఏమంటున్నారు అనే అంశంపై ఐవిఆర్ఎస్‌తో పాటు వివిధ రూపాల్లో సర్వేలు నిర్వహించారు. ఈ సర్వే రిపోర్టుల ఆధారంగా సిఎం శాఖల వారీగా సమీక్ష చేశారు.

ఎవరు ఏం చెప్పినా లబ్ధిదారుల మాటే ఫైనల్ అని, ప్రజలు క్షేత్ర స్థాయి నుంచి ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌నే ప్రామాణికంగా తీసుకుంటామని అధికారులకు సిఎం స్పష్టం చేశారు. కొన్ని శాఖల్లో కింది స్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి వరకు విధానాల అమల్లో ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తం అవ్వడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ఆ శాఖల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ వల్ల ఈ ఫలితాలు వచ్చాయని అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. ఇదే సమయంలో కొన్ని శాఖల్లో 7 నెలల కాలంలో అనుకున్న స్థాయిలో మార్పు రాకపోవడంపై సిఎం లోతుగా సమీక్షించారు. కారణాలు తెలుసుకుని దానికి అనుగుణంగా మార్పులు తేవాలని అధికారులకు సూచించారు.

మొత్తం 10 అంశాల్లో నిర్వహించిన సర్వేల ఆధారంగా సమీక్ష నిర్వహించిన సిఎం...ప్రభుత్వ సేవల్లో వేగం, నాణ్యత పెరగాలని, పథకాల పంపిణీలో 1 శాతం కూడా అవినీతి ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రజల సంతృప్తి అంశంలో క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వ యంత్రాంగం పని చేయాలని సూచించారు.

శాఖల వారీగా సంతృప్తి

పింఛన్లు పంపిణీ :- 1వ తేదీన ఇంటివద్దే ఫింఛన్ అందుతుందా అనే ప్రశ్నకు 90.20 శాతం మంది లబ్ధిదారుల నుంచి సంతృప్తి వ్యక్తమైంది. పింఛను అందించిన ఉద్యోగుల ప్రవర్తనపై 87.48 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. మీరు పింఛను తీసుకుంటున్నప్పుడు అవినీతి గమనించారా అన్న ప్రశ్నకు...15.60 శాతం మంది అక్కడక్కడా అవినీతి జరుగుతుందని ఫిర్యాదు చేశారు.

అన్న క్యాంటీన్ :- అన్న క్యాంటీన్‌లో పారిశుధ్యంపై 82 శాతం మంది, ఆహారంలో నాణ్యతపై 91 శాతం మంది, సమయపాలనపై 84 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.

ధాన్యం సేకరణ :- ధాన్యం సేకరణ విధానంపై 89.92 శాతం మంది రైతుల నుంచి సంతృప్తి వ్యక్తమైంది. గోనె సంచుల విషయంలో 30 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యతకు తగ్గ ధర లభించిందని 84 శాతం మంది అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

దేవాలయాల్లో దర్శనాలు :- రాష్ట్రంలోని 7 ప్రధాన ఆలయాల్లో దర్శనాల తీరుపై సర్వే నిర్వహించగా 70 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. వసతులపై 37 శాతంమంది భక్తుల్లో అసంతృప్తి కనిపించింది. ప్రసాదంపై మాత్రం 81 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. గతకొద్ది కాలంగా తీసుకున్న చర్యలతో ఈ విషయంలో సంతృప్తి పెరిగింది.

ఎన్టీఆర్ వైద్య సేవ :- ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో ఆసుపత్రుల్లో అడ్మిషన్‌పై 90 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. సేవల విషయంలో 87 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యమిత్రల పనితీరుపై 87 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రులు :- వైద్యులు, సిబ్బంది అందుబాటుపై 65 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతి జరుగుతుందని 37 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

దీపం2 :- దీపం-2 పథకంలో భాగంగా సిలిండర్ అందుకున్న 48 గంటల్లో డబ్బులు తమ అకౌంట్లలో జమ అవుతున్నాయని 48 శాతం మంది చెప్పారు. ఈ విషయంలో సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించి నిర్థేశిత సమయంలో డబ్బులు అకౌంట్లో పడేలా చూడాలని సిఎం ఆదేశించారు.

ఆర్టీసీ:- ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం అని 88 శాతంమంది భావిస్తున్నారు. అయితే గమ్యస్థానాలను నిర్థేశించిన సమయానికి చేరుకునే విషయంలో 27 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. బస్‌స్టాండ్‌లలో మౌలిక వసతులపై 63 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇకపోతే ఇసుక, ఎరువుల విషయంలో సంతృప్తి స్థాయి మరింత పెరగాలని సిఎం అధికారలుకు సూచించారు. ఇసుక లభ్యతపై 78 శాతం మంది, రిజిస్ట్రేషన్ ప్రక్రియపై 79 శాతం, రవాణా ఛార్జీలపై 75 శాతం మంది లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక విధానం మరింత మెరుగుపడాలని....నూరు శాతం సంతృప్తి కనిపించాలని సిఎం అధికారులను ఆదేశించారు.

మభ్య పెట్టే గణంకాలు..

ఆర్టీజీఎస్‌ నివేదికలు, ఫలితాలు, సంతృప్తి స్థాయిల మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. 2017-19 మధ్య కాలంలో చంద్రబాబును మభ్యపెట్టి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా ముందుకు సాగడంలో ఆర్టీజీఎస్‌ కీలక పాత్ర పోషించిందనే అపవాదు ఉంది. ఐదేళ్ల తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తిరిగి అదే వ్యవస్థపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఆధారపడటంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులు, ఎన్టీఆర్ వైద్య సేవలు, ఇసుక లభ్యత, మద్యం ధరలు, రెవిన్యూ సేవలు, పారిశుధ్యం వంటి విషయాల్లో ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ప్రజల్లో అసంతృప్తి ఉన్నా ఆల్‌ ఈజ్‌ వెల్ అని నివేదికలు ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం