Rs.99 Liquor Sales: సోమవారానికి ఏపీలో డిపోలకు చేరనున్న రూ.99 మద్యం, తొలి విడత 20వేల కేసుల సరఫరా-rs99 liquor to reach depots in ap on monday supply of 20 000 cases in first installment ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rs.99 Liquor Sales: సోమవారానికి ఏపీలో డిపోలకు చేరనున్న రూ.99 మద్యం, తొలి విడత 20వేల కేసుల సరఫరా

Rs.99 Liquor Sales: సోమవారానికి ఏపీలో డిపోలకు చేరనున్న రూ.99 మద్యం, తొలి విడత 20వేల కేసుల సరఫరా

Rs.99 Liquor Sales:

ఏపీలో విక్రయించే రూ.99 మద్యం బ్రాండ్ ఇదే...

Rs.99 Liquor Sales: ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ దుకాణాల్లో మద్యం విక్రయాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాల కేటాయింపు పూర్తై రెండ్రోజులు పూర్తైనా ఇంకా దుకాణాలు పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. మద్యం దుకాణాల దక్కిన వారు ప్రభుత్వానికి కట్టాల్సిన ఫీజుల చెల్లింపులో జాప్యం, దుకాణాల ఏర్పాటు చేసే స్థలాల లభ్యత, ఇతర సాంకేతిక కారణాలతో పూర్తి స్థాయిలో దుకాణాలు ఏర్పాటు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 3396 మద్యం దుకాణాలను రెండు రోజుల క్రితం లాటరీలో కేటాయించారు.

ఏపీలో నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందిస్తామన్న ఎన్నికల హామీకి కట్టుబడి ప్రభుత్వం రూ.99 మద్యాన్ని ప్రైవేట్ దుకాణాల్లో విక్రయించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే సోమవారం నాటికి 20,000 కేసుల మద్యం రాష్ట్రానికి చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు.

అక్టోబర్‌ నెలలో కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మద్యం విక్రయాలకు సిద్ధం చేస్తామని ఎక్సైజ్ డైరెక్టర్ నిషాంత్ కుమార్‌ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా రూ.99లకు క్వార్టర్ బాటిల్ మద్యం అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.

మద్యం తయారీ విక్రయాలలో జాతీయ స్దాయిలో పేరు ప్రతిష్టలు కలిగిన 5 సంస్దలు ఆంధ్రప్రదేశ్‌లో ఈ ధరకు మద్యం విక్రయాలు చేసేందుకు సిద్దం అయ్యాయని వివరించారు. గురువారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పదివేల కేసుల రూ.99 ఖరీదు చేసే మద్యం మార్కెట్ కు చేరిందని, సోమవారం నాటికి రోజువారీ సరఫరా 20వేల కేసులకు చేరుతుందని వివరించారు.

దశల వారిగా సరఫరా పెరిగి ఈ నెలాఖరు నాటికి 2,40,000 కేసుల మద్యం రాష్ట్రంలో అందుబాటులో ఉంటుందని వివరించారు. ఈ క్రమంలో మొత్తంగా కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మధ్యం ఈ నెలలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మద్యం వినియోగాన్ని అనుసరించి తదుపరి రానున్న నెలలలో బ్రాండ్ల వారీగా ఎంత మేరకు దిగుమతి చేసుకోవాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని నిషాంత్ కుమార్ వివరించారు