Gudur Railway Junction: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కీలకమైన జంక్షన్లలో ఒకటైన గూడూరు రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరు రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ రూ.49కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో స్టేషన్ రూపురేఖల్ని సమూలంగా మారుస్తారు. ప్రయాణీకులకు మెరుగైైన ప్రయాణ అనుభవాన్ని కల్పించడంతో పాటెు తిరుపతి, నెల్లూరు జిల్లా ప్రాంత ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగు పరచడానికి ఉపయోగ పడుతుంది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న గూడూరు రైల్వే స్టేషన్ చెన్నైకు సమీపంలో ఉన్న కీలకమైన రైలు జంక్షన్, దక్షిణ కోస్తాలో గూడూరు కీలకమైన రవాణ కూడలిగా ఉంది. ఈ ప్రాంతంలోని కీలక స్టేషన్లను ఆధునీకరించే చర్యల్లో భాగంగా తాజాగా నిధులు కేటాయించారు.
రైలు ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడం, ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి మద్దతు ఇవ్వడం కోసం ఈ నిధులు మంజూరు చేశారు. గూడూరు ప్రాంతం సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా స్టేషన్ అభివృద్ధి పనులు చేపడతారు.
1. గ్రౌండ్ + 2 అంతస్తులతో కూడిన కొత్త స్టేషన్ భవనం నిర్మిస్తారు.
2. 1 నుండి 5 వరకు ప్లాట్‌ఫారమ్‌లపై పూర్తిగా కవర్ ఓవర్ ప్లాట్‌ఫారమ్‌లను నిర్మిస్తారు.
3. తూర్పు నుండి పడమర ప్రవేశ ద్వారం వరకు 12 మీటర్ల వెడల్పు గల రూఫ్ ప్లాజాను స్టేషన్ భవనంతో అనుసంధానిస్తారు.
4. సర్క్యులేటింగ్ ఏరియాకు అభివృద్ధి చేస్తారు.
5. స్టేషన్ భవనాలకు కొత్త రూపురేఖలు కల్పిస్తారు.
విజయవాడ రైల్వే డివిజన్‌లో 21 రైల్వే స్టేషన్‌లను రూ.567.41 కోట్లతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి పనులు చేపట్టినట్టు విజయవాడ డిఆర్‌ఎం నరేంద్ర పాటిల్ తెలిపారు.