ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో కీలక మలుపు - హైదరాబాద్ లో రూ.11 కోట్ల నగదు స్వాధీనం-rs 11 crore cash seized in ap liquor scam case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో కీలక మలుపు - హైదరాబాద్ లో రూ.11 కోట్ల నగదు స్వాధీనం

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో కీలక మలుపు - హైదరాబాద్ లో రూ.11 కోట్ల నగదు స్వాధీనం

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులోని వరుణ్ పురుషోత్తం (A 40) ఇచ్చిన సమాచారం ఆధారంగా.. భారీ నగదు వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ సమీపంలోని ఓ ఫార్మ్‌ హౌస్‌లో సిట్‌ అధికారులు దాడులు చేపట్టగా… రూ.11 కోట్ల నగదును సీజ్ చేశారు.

రూ.11 కోట్ల నగదు స్వాధీనం

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఏ40గా ఉన్న వరుణ్‌ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌లో సిట్‌ అధికారుల దాడులు చేపట్టారు.శంషాబాద్‌ మండలంలోని కాచారం ఫార్మ్‌ హౌస్‌లో తనిఖీలు చేపట్టగా… అట్టపెట్టల్లో నిల్వ ఉంచిన రూ.11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఏ1గా ఉన్న రాజ్‌ కసిరెడ్డి ఆదేశాలతో వరుణ్‌, చాణక్య 12 పెట్టెలలో రూ.11 కోట్లు దాచినట్టు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. 2024 జూన్‌లో ఈ మొత్తం దాచినట్టు సిట్ అధికారులు పేర్కొన్నారు. ఏ 40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా… మరికొన్ని అంశాలపై సిట్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఇక డబ్బులు దొరిన ఫార్మ్ హౌస్… సులోచన ఫార్మ్స్, ప్రొఫెసర్ బాల్‌రెడ్డి పేర్లపై ఉన్నట్లు గుర్తించారు.

లిక్కర్ స్కామ్ కేసు - ఇప్పటివరకు ఏం జరిగింది..?

వైసీపీ… అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం ధరల్ని పెంచేసింది.సంపూర్ణ మద్యం నిషేధంలో భాగమంటూ మద్యం విక్రయాలపై రకరకాల ప్రయోగాలు చేసింది. 2019 చివరిలో కొత్త లిక్కర్ పాలసీని వైసీపీ ప్రవేశపెట్టింది. మద్యం దుకాణాల స్థానంలో ప్రభుత్వమే మద్యం విక్రయించేలా వైన్‌ షాపుల్ని ఏర్పాటు చేసింది.

వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయని తెలుగుదేశంతో పాటు జనసేన, బీజేపీ పార్టీలు ఆరోపిస్తూ వచ్చాయి. అయితే 2024 ఎన్నిక్లలో కూటమి విజయం సాధించటంతో అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం మద్యం కొనుగోళ్ల వ్యవహారంపై దృష్టి పెట్టింది. రూ.3 వేల కోట్ల రుపాయల అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ… విచారణకు ఆదేశించింది. ప్రత్యేకంగా ఓ సిట్ ను కూడా ఏర్పాటు చేసింది.

ఈ కేసులో ప్రభుత్వాధికారులతో పాటు పలువురు వైసీపీ నేతలను సిట్ విచారించటంతో పాటు అరెస్ట్ కూడా చేసింది. రాజ్ కసిరెడ్డి నుంచి తాజాగా మిథున్ రెడ్డి వరకు ఈ కేసులో నిందితులుగా ఉన్నట్లు సిట్ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన ప్రాథమిక ఛార్జ్‌షీట్‌ ను సిట్ తాజాగా దాఖలు చేసింది. 300కుపైగా పేజీలతో కోర్టుకు సమర్పించింది. వందకు పైగా ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదికలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను జత చేసింది.

ఇటీవలనే మరో 8 మందిని నిందితులుగా చేర్చినట్లు పేర్కొంది. వీరిలో అనిరుధ్ రెడ్డి, బొల్లారం శివకుమార్, సైమన్ ప్రసన్, రాజీవ్ ప్రతాప్, కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి, మోహన్ కుమార్, అనిల్ కుమార్ రెడ్డి, సుజల్ బెహ్రూన్ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులోని నిందితుల సంఖ్య 48కి చేరింది. ఛార్జ్‌షీట్‌లో 16 మంది పాత్రపై అభియోగాలు నమోదయ్యాయి.

268 మంది సాక్షులను విచారించినట్లు సిట్ దాఖలు చేసిన ఛార్జీషీట్ లో ప్రస్తావించారు. కొద్దిరోజుల కిందటనే ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసింది సిట్. కోర్టులో హాజరుపర్చగా ఆయనకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు.

ఈ కేసులో దూకుడుగా ముందుకెళ్తున్న సిట్… మరికొంత మంది వైసీపీ నేతలను విచారించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది కీలక నేతలను విచారించింది. ఈ కేసులోని నిందితులు ఇస్తున్న సమాచారం ఆధారంగా… విచారణను వేగవంతం చేస్తున్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.