విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి దొంగల యత్నం - కాల్పులు జరిపిన పోలీసులు..!-robbery attempt foiled on visakha express in andhrapradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి దొంగల యత్నం - కాల్పులు జరిపిన పోలీసులు..!

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి దొంగల యత్నం - కాల్పులు జరిపిన పోలీసులు..!

విశాఖ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగలు చోరీకి యత్నించారు. ఈ ఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు వద్ద జరిగింది. అయితే రైల్వే పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో… దుండగులు పారిపోయారు.

విశాఖ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ యత్నం

సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న విశాఖ ఎక్స్ ప్రెస్ లో చోరీ యత్నం జరిగింది. పల్నాడు జిల్లా తుమ్మల చెరువు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కాల్పులు జరపటంతో… దోపిడీ దొంగలు పారిపోయారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

కాల్పులు జరిపిన పోలీసులు…

రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆదివారం తెల్లవారుజామున 3.30 నుంచి 3.45 గంటల మధ్య ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అలారం గొలుసును లాగారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ప్రకారం… ఎస్కార్ట్ పోలీసులు దర్యాప్తు చేయడానికి రైలును ఆపారు. దీంతో నిందితులు పొలాల్లోకి పారిపోయారు.

హెచ్చరికలు జారీ చేసినా పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని అడ్డుకునేందుకు ఎస్కార్ట్ సిబ్బంది 9 ఎంఎం పిస్టల్ నుంచి ఐదు రౌండ్లు, 303 రైఫిల్ నుంచి నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో వారు పారరయ్యారు.

ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని రైల్వే పోలీసులు వెల్లడించారు. దాదాపు 10 నిమిషాల విరామం తర్వాత రైలు తిరిగి ప్రారంభమైందని గుంటూరు రైల్వే డీఎస్పీ బి.అక్కేశ్వరరావు తెలిపారు.

ఇదే ముఠా గతంలో నడికుడి సమీపంలో జరిగిన కొన్ని దొంగతనాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. బీహార్-మహారాష్ట్రకు చెందిన ఏడుగురు సభ్యుల బృందం ఈ సున్నితమైన మార్గంలో దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మార్గంలో పోలీసుల గస్తీని కూడా ముమ్మరం చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు. బీఎన్ఎస్ 126(2), రైల్వే యాక్ట్ 141, పోలీసు ఫైరింగ్ ప్రోటోకాల్స్ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం