Road accidents in AP : ఏపీలో గణనీయంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు….-road accident fatalities rise by 6 56 per cent in ap in 10 months ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Road Accident Fatalities Rise By 6.56 Per Cent In Ap In 10 Months

Road accidents in AP : ఏపీలో గణనీయంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు….

HT Telugu Desk HT Telugu
Nov 28, 2022 07:07 AM IST

Road accidents in AP ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరుగుతున్నాయి. గత పది నెలల కాలంలో దాదాపు 6.56శాతం పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది తొలి పది నెలల్లోనే ఏపీలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 5800మంది ప్రాణాలను కోల్పోయారు. ప్రమాదకరంగా ఉన్న రహదారులే ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని అధికారులు సైతం చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళనకర స్థాయిలో రోడ్డు ప్రమాదాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళనకర స్థాయిలో రోడ్డు ప్రమాదాలు (HT_PRINT)

Road accidents in AP ఆంధ్రప్రదేశ్‌లో గత పది నెలల కాలంలో 5800మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కోల్పోయారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాల మరణాలు ఈ ఏడాది మొదటి 10 నెలల్లో 5,800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. జనవరి నుంచి అక్టోబర్ 2022 మధ్య, రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో మరణాలు 6.56 శాతం పెరిగి 5,831కి చేరాయి.

ట్రెండింగ్ వార్తలు

గత ఏడాది ఇదే కాలంలో 5,472 మంది చనిపోయారు. ప్రమాదాల సంఖ్య 9.95 శాతం పెరగగా, గాయపడిన వారి సంఖ్య 11.11 శాతం పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది తొలి పది నెలల్లో 26 జిల్లాల్లో 14,314 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 5,831 మంది మృతి చెందారు. అదే సమయంలో 15,585 మంది గాయపడ్డారని గణాంకాలు చెబుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ ప్రమాదాల్లో మరణాల సంఖ్యను 15 శాతం తగ్గించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంటే, వాస్తవ మరణాల సంఖ్య 25.37 శాతం పెరిగాయి. రోడ్డు భద్రతా మండలిలో ఉన్న సీనియర్ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, 'అతి వేగం' ప్రధాన కారణంగా ఉన్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల దయనీయ పరిస్థితి ఇప్పుడు ఆందోళనకు మరో కారణమని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితి దారుణంగా తయారవడం వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.

"లైట్ మోటారు వాహనాలతో పాటు లారీలు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ద్విచక్ర వాహనాల ప్రమాదాలు చాలా సాధారణం అయ్యాయని రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సభ్యుడు తెలిపారు. 2021లో ఏపీలో మొత్తం 19,729 రోడ్డు ప్రమాదాలు జరగితే 8,053 మంది మృతి చెందారు. 21,169 మంది గాయపడ్డారు. 2020 సంవత్సరంతో పోలిస్తే ప్రమాదాల సంఖ్య 10.16 శాతం పెరిగింది.మరణాల సంఖ్య 14.08 శాతం పెరిగింది. 2020లో, 'కోవిడ్ సంవత్సరం' అయినప్పటికీ, రాష్ట్రంలో 17,910 ప్రమాదాలలో 7,059 మరణాలు మరియు 19,612 గాయాలు నమోదయ్యాయి. 2020లో రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ ఆంక్షలు అమలయ్యాయి. ఏడాదిలో చాలా భాగం రోడ్లపై వాహనాల రాకపోకలు లేవు. అయినా ప్రమాదాలు మాత్రం ఆగలేదు.

మూడేళ్ల క్రితం రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ రోడ్డు ప్రమాదాలు, మరణాలను అరికట్టేందుకు పలు చర్యలను సూచించినప్పటికీ ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకోలేదని రోడ్డు భద్రతా మండలి సభ్యుడు అభిప్రాయపడింది. "చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్-ర్యాంక్ అధికారి నేతృత్వంలో రోడ్డు భద్రతా అథారిటీ ఉంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కింద, రహదారి భద్రత కోసం ప్రత్యేకంగా ఒక అదనపు డీజీపీ కూడా ఉన్నారు. ప్రమాదాల నివారణ విషయంలో మాత్రం రోడ్ సేఫ్టీ కౌన్సిల్ నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది.

ఈ పోస్టులో నియమించే అధికారుల్ని 'శిక్షా పోస్టింగ్‌లు'గా పరిగణిస్తుంటారు. రహదారి భద్రతకు సంబంధించినంతవరకు సమర్థంగా పనిచేయడం లేదని రోడ్‌ సేఫ్టీ కౌన్సిల్ సభ్యుడు అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్ట్ కమిటీ సూచన మేరకు, రాష్ట్ర స్థాయిలో రోడ్డు భద్రతపై నామమాత్రపు ఏజెన్సీని ఏర్పాటు చేసినా అవసరమైన సిబ్బందిని మాత్రం కేటాయించలేదు.

సుప్రీం కోర్ట్ కమిటీ నిర్ణయాలను అమలు చేయడంతో పాటు విధానాల రూపకల్పన , అమలులో ఈ ఏజెన్సీ, రోడ్ సేఫ్టీ కౌన్సిల్‌కు సహాయం చేయాల్సి ఉంటుంది. "జిల్లా స్థాయిలో కూడా ఏజెన్సీలు ఏర్పాటు చేయవలసి ఉన్నా అవి ఎలాంటి రూపాన్ని సంతరించుకోలేదు. రహదారి భద్రత కోసం ప్రణాళికలను క్షేత్ర స్థాయిలో అమలులోకి తీసుకురావడానికి తగిన యంత్రాంగం లేదని సీనియర్ IPS అధికారి చెప్పారు.

ఏపీలో జాతీయ రహదారులపై ఉన్న 350కి పైగా 'బ్లాక్ స్పాట్'లను గుర్తించి వాటిని సరిదిద్దారు. మరోవైపు, రాష్ట్రంలో ఉన్న రహదారుల్లో 1,200 బ్లాక్‌స్పాట్‌లను గుర్తించామని, అయితే వాటిలో సగం కూడా సరిగ్గా లేవని అధికారి తెలిపారు. "రాష్ట్రంలో ప్రమాదాలు ఎందుకు పెరుగుతున్నాయో రోడ్లను పరిశీలిస్తే తెలిసిపోతుందని, ప్రమాదాలను అరికట్టడానికి, ప్రజల ప్రాణాలను రక్షించే ప్రక్రియను రోడ్ల మరమ్మతులతో ప్రారంభించి, ఆ తర్వాత ప్రతి అంశాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని పోలీస్‌ అధికారులు చెబుతున్నారు.

WhatsApp channel