AP Accidents: ప్రకాశంలో చిన్నారుల్ని మింగేసిన వాగు,రోడ్డు ప్రమాదంలో తాతా మనుమడిని ఢీకొట్టిన లారీ…
AP Accidents: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో వాగులో మునిగి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు గోదావరిలో జరిగిన రోడ్డు ప్రమాదం తాతా, మనుమడు లారీ ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయారు.
AP Accidents: ప్రకాశం జిల్లాల్లో ఘోరం విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులను వాగు బలికొంది. ఆదివారం సెలవు రావడంతో అమ్మమ్మ ఊరిలో కోలాటం వేస్తున్నారని తెలుసుకున్న చిన్నారులు, చూద్దామని వెళ్లారు. సరదాగా ఆడుకోవడం కోసం వెళ్తే వాగు ఆ చిన్నారులను మింగేసింది. వారిద్దరూ అక్కచెల్లెళ్ల పిల్లలు కావడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది.
ప్రకాశం జిల్లా దర్శి మండలంలో ప్రమాదవశాత్తు వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఏలూరు గ్రామానికి చెందిన ధర్నాసి రమణ (10), అద్దంకి మండలం వేలమూరుపాడు గ్రామానికి చెందిన పులి రాఘవ (12)లు ఆదివారం సెలవు కావడంతో తూర్పు వీరాయపాలెంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. వీరిద్దరూ అక్క చెల్లెళ్ల కుమారులే. అయితే వీరు తూర్పు వీరాయపాలెంలో ఏర్పాటు చేసిన కోలాటం ప్రదర్శనను చూడ్డానికి వెళ్లారు.
గ్రామ సమీపంలోని వాగు వద్దకెళ్లి ఆడుకుంటున్నారు. అదే సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పని పడిపోయారు. వాగులో లోతైన గుంట ఉండడంతో అందులోకి వెళ్లిపోయారు. దీంతో ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారులు చనిపోయారు. కొంత మంది అటుగా వస్తున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో మృతదేహాలను వాగులోంచి బయటకు తీశారు. ఒడ్డుపైన పెట్టిన మృత దేహాలను పోలీసులు పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి, పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
శుభాకార్యానికి వెళ్లి వస్తుండగా…
శుభాకార్యానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస సమీపంలో దామోదరపురం గ్రామానికి చెందిన పురటి తాతారావు (45) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన ఆదివారం నరసన్నపేటలో బంధువుల ఇంట్లో శుభాకార్యానికి వెళ్లి వస్తుండుగా ఈ ప్రమాదం జరిగింది. పురటి తాతారావు, కోటబొమ్మలి మండలం దుప్పలపాడుకు చెందిన నరసింహమూర్తి శుభకార్యానికి వెళ్లారు.
తిరిగి ప్రయాణంలో నరసన్నపేట-కోటబొమ్మాళి మార్గంలో ఎత్తురాళ్ల పాడు సమీపంలో జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పురటి తాతారావు అక్కడికక్కడే మృతి చెందగా, నరసింహమూర్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడు నరసింహమూర్తిని చికిత్స కోసం శ్రీకాకుళం తరలించారు.
తూర్పగోదావరి జిల్లాలో తాతా, మనుమడు
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తాతా, మనుమడు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. కూలీ పనులు చేసుకునే జీవించే వీర్రాజు భార్య నాగమణి ఏడాది క్రితం పాముకాటుతో మృతి చెందింది.
ఈ రోడ్డు ప్రమాదం ఆదివారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఆరికిరేవులు-కొవ్వూరు మధ్య పాశాలమ్మ గుడి వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో తాతా మాసా వీర్రాజు (55), మనుమడు ధనుష్ చంద్ర (12) మృతి చెందారు. కొవ్వూరు పట్టనం ఒకటో వార్డు రాజీవ్ కాలనీకి చెందిన మాసా వీర్రాజుకు ఇద్దరు కుమార్తెలు. అందులో పెద్ద కుమార్తె సునందను కుమారదేవం గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యంతో వివాహం అయింది. వారికి ఒక కుమారుడు ధనుష్ చంద్ర (12) ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.
అయితే ఎప్పుడు సెలవులు వచ్చిన మనుమడు ధనుష్ చంద్రను కొవ్వూరు తీసుకురావడం తాతా వీర్రాజుకు అలవాటుగా ఉంది. ఆదివారం ఉదయం తాతా మాసా వీర్రాజు కుమారదేవం వెళ్లి తన మనుమడు ధనుష్‌ను తీసుకొని తిరిగి కొవ్వురు ప్రయాణమయ్యారు.
ఇంకొద్ది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనే సరికి, ఆరికిరేవుల-కొవ్వూరు మధ్య పాశాలమ్మ గుడి వద్దకు వచ్చే సరికి, ఎదురుగా వచ్చిన లారీ తాతా, మనుమడు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో తాతా, మనుమడు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే రోడ్డుపై పడిని అక్కడికక్కడే మృతి చెందారు.
బీచ్‌లో గొడవ...కాపుకాసి దాడి…
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఘోరం జరిగింది. బీచ్‌లో జరిగిన గొడవుకు, ప్రత్యర్థులు కాపుకాసి దాడి చేసిన ఘటనలో ఇచ్ఛాపురానికి చెందిన యువకుడు మృతి చెందాడు. ఇచ్ఛాపురం మండలం కేదారిపురం గ్రామానికి చెందిన ఆశిబాలు (24) ఆదివారం స్నేహితులతో కలిసి ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలోని ఒరిస్సాలోని సున్నాపురం బీచ్‌కు వెళ్లారు.
అక్కడ సాయంత్రం వరకు స్నేహితులు కలిసి ఆశిబాలు గడిపారు. అయితే వారికి, ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన యువకులతో ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఆశిబాలు స్నేహితులతో కలిసి స్వగ్రామం కేదారిపురం తిరిగి వస్తుండగా, ఇచ్ఛాపురం యువకులు మార్గమధ్యలో దారి కాసి గొడవకు దిగారు. ఈ క్రమంలో ఆశిబాలు ఛాతిపై బలమైన ఆయుధంతో గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
(రిపోర్టింగ్ జగదీశ్వరరావు, హెచ్‌టి తెలుగు)