జీవో 3 పునరుద్ధరించి ఆదివాసీలకు ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి: గిరిజన సంఘం వినతి
జీఓ 3 పునరుద్ధరిస్తామన్న హామీని నెరవేర్చి ఆదివాసీలకు ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేయాలని ఆదివాసీ గిరిజన సంఘం కోరింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించింది.
రాష్ట్రంలో ఆదివాసీలకు ప్రత్యేక డీఎస్సీ తీయాలని ఆదివాసులు డిమాండ్ చేస్తున్నారు. జీఓ నంబర్ 3కి చట్ట బద్దత కల్పించి, గిరిజన స్పెషల్ డీఎస్సీ నోటీఫికేషన్ ఇవ్వాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో 3ను అమలు చేస్తామని ఆదివాసులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేసింది. అలాగే ఆదివాసీ డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, మెటీరియల్ పంపిణీ చేయాలని డిమాండ్ చేసింది.
ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ నేత పి.అప్పలనర్స, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లోతా రామారావు, కిల్లో సురేంద్ర ఈ మేరకు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణికి వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వాలు మారినప్పటికీ, గిరిజనుల జీవితాల్లో మార్పులు రావటం లేదని విమర్శించారు. ప్రతీ ప్రభుత్వం గిరిజనుల్ని చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
గిరిజనులకు ఇచ్చిన హామీలను, జీవోలను అమలు చేయడంలో జాప్యం జరుగుతోందని విమర్శించారు. డీఎస్సీకి సన్నద్ధమవుతున్న గిరిజన అభ్యర్థులకు అరకు, పాడేరు, చింతపల్లి కేంద్రాల్లో ఉచిత కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. పీవీటీజీలకు ప్రత్యేక పాఠశాల, కళాశాల నెలకొల్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రం ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తోందని, అయితే గిరిజనులకు స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐదేళ్ల పాటు ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
2013 నుంచి గిరిజనులకు స్పెషల్ డీఎస్సీపై చర్చ
2013 నుంచి గిరిజనులు స్పెషల్ డీఎస్సీ గురించి ఎదురుచూస్తున్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో గిరిజనులకు కేవలం 6 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలు చేస్తున్నారు. కాగా గిరిజన ప్రాంతాల్లో బీఎడ్, డీఎడ్ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా డీఎస్పీ నోటిఫికేషన్ జారీచేయాలని, అందులో వంద శాతం పోస్టులు గిరిజన అభ్యర్థులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
2013లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో 640 పోస్టులతో స్పెషల్ డీఎస్సీ వేస్తామని జీవో నంబర్ 233 విడుదల చేసింది. కానీ అమలకు నోచుకోలేదు. 2019 ఫిబ్రవరిలో మళ్లీ టీడీపీ ప్రభుత్వం జీవో నంబర్ 10ను జారీ చేసింది. అందులో 611 పోస్టులతో గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ ప్రకటించింది. కానీ అది కూడా అమలకు నోచుకోలేదు. దీంతో ప్రభుత్వాల పట్ల గిరిజనుల్లో అసంతృప్తి పెరిగింది. తమను ప్రభుత్వాలు ఊరించి మోసం చేస్తున్నాయని భావించి ఆదివాసీ గిరిజన సంఘం, ఇతర గిరిజన సంఘాలు ఆందోళనలు చేపట్టాయి.
రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన సంక్షేమ విద్యా శాఖ పరిధిలోని పాఠశాలల్లో 650, మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 373 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే మొత్తం 1,023 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ మెగా డీఎస్సీలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల్లో 1,134 భర్తీకి మాత్రమే అవకాశం ఉంది. అయితే ఇందులో మైదాన ప్రాంతంలోనే ఎక్కువ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో తక్కువ పోస్టు భర్తీ చేస్తారు.
జీవో నంబర్ 3 ఎప్పుడు వచ్చింది?
1986 నవంబర్ 5న నాటి ప్రభుత్వం జీవో 275 ద్వారా 5వ షెడ్యూల్‌లోని 5(1) కింద ఉపాధ్యాయ పోస్టుల్లో స్థానిక ఆదివాసులకే వంద శాతం ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే దీనిపై కొంత మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పుడు న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా 2000 జనవరి 10న నాటి ప్రభుత్వం జీవో 275లో మార్పులు చేసి ఆదివాసులకు వంద శాతం ఉపాధ్యాయ పోస్టుల భర్తీని స్పష్టం చేస్తూ జీవో 3ను విడుదల చేసింది.
అయితే దీనిపై కూడా కొంత సుప్రీం కోర్టుకు వెళ్లగా, 2002లో సుప్రీం కోర్టు జీవో 3ను రద్దు చేసింది. కాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 244 (1) కింద, 5వ షెడ్యూల్‌లో రాష్ట్ర గవర్నర్‌కు ఆదివాసీ సంక్షేమాన్ని పరిరక్షించే అధికారం ఉంది. అందువల్ల గవర్నర్ జోక్యం చేసుకొని, గిరిజనులకు వంద శాతం పోస్టులు ఇచ్చేలా శాసన సభలో బిల్లును ప్రవేశపెట్టేలా ప్రభుత్వానికి సలహా ఇవ్వొచ్చని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తోంది.
రిపోర్టింగ్: జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు